Psychology: చాలామంది ఎలాంటి నోటిఫికేషన్, మెసేజ్ రాకపోయినా సరే.. ఫోన్ తీసుకొని చెక్ చేస్తుంటారు. నిజానికి ఇది అలవాటు మాత్రమే కాదు.. దీని వెనక చాలా కారణాలు ఉన్నాయని చెబుతోంది సైకాలజీ. మరి ఎందుకు తరచూ ఫోన్ చెక్ చేయాలని అనిపిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.
నేటి కాలంలో చాలామంది ఉదయం లేవగానే ఫస్ట్ ఫోనే చూస్తుంటారు. రాత్రి పడుకునే ముందు కూడా చివరిసారిగా ఫోన్ చెక్ చేసి పడుకుంటారు. కొన్నిసార్లు ఎలాంటి నోటిఫికేషన్ రాకపోయినా ఫోన్ తీసి స్క్రీన్‌ను చూస్తుంటారు. అసలు ఎందుకు ఇంతలా ఫోన్ ని చెక్ చేయాలని అనిపిస్తుంది? దీని గురించి సైకాలజీ నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
27
కొత్త విషయాల కోసం
సైకాలజీ ప్రకారం మన మెదడు ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకోవాలని కోరుకుంటుంది. దీన్ని క్యూరియాసిటీ డ్రైవ్ అంటారు. కొత్త విషయం తెలిసినప్పుడు లేదా ఆసక్తికరమైన సమాచారం దొరికినప్పుడు మెదడులో డోపమైన్ అనే రసాయనం విడుదల అవుతుంది. ఇది ఒక ఫీల్ గుడ్ కెమికల్. ఫోన్‌లో మెసేజ్, లైక్, కామెంట్ లేదా నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి మనకు చిన్నపాటి ఆనందం కలుగుతుంది. ఆ అనుభూతిని మళ్లీ పొందాలనే కోరికతో మనం ఫోన్‌ను పదే పదే చెక్ చేస్తుంటాం.
37
అనిశ్చితి కారణంగా..
మరొక ముఖ్యమైన కారణం వేరియబుల్ రివార్డ్ సిస్టమ్. ఇది మనుషుల ప్రవర్తనను ప్రభావితం చేసే శక్తివంతమైన సైకాలజికల్ సూత్రం. ఫోన్ తీసిన ప్రతిసారి ఆసక్తికరమైన విషయం కనిపించదు. కానీ కొన్నిసార్లు చాలా ముఖ్యమైన మెసేజ్, మంచి వార్త లేదా ఆసక్తికరమైన వీడియో కనిపిస్తుంది. ఈ అనిశ్చితి కారణంగా మన మెదడు ఈ సారి ఏదైనా ప్రత్యేకమైంది ఉండొచ్చు అని భావిస్తుంది. దానివల్ల మనం మళ్లీ మళ్లీ ఫోన్ చెక్ చేస్తుంటాం.
మన స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగులు ఏదైనా కొత్త విషయం గురించి మాట్లాడుతుంటే మనకు తెలియకపోతే వెనుకబడ్డామనే భావన కలుగుతుంది. అందువల్ల ఎప్పటికప్పుడు సోషల్ మీడియా, వాట్సాప్ లేదా ఇతర యాప్‌లను చెక్ చేస్తూ ఉంటాం. ఏదైనా ముఖ్యమైన సమాచారం మిస్ అవుతామేమో అనే భయం మనల్ని ఫోన్‌కు మరింత దగ్గర చేస్తుంది.
57
యాప్ ల ప్రభావం
సాధారణంగా చాలా యాప్ లను మన మానసిక అంశాల ఆధారంగానే రూపొందిస్తారు. అంటే నోటిఫికేషన్‌ల రంగులు, స్క్రోల్ చేసే విధానం, లైక్స్, కామెంట్ల వ్యవస్థ అన్నీ యూజర్స్ ఎక్కువ టైం గడిపేలా రూపొందించబడతాయి. ముఖ్యంగా ఎరుపు రంగు నోటిఫికేషన్ గుర్తులు మన దృష్టిని వెంటనే ఆకర్షిస్తాయి. వాటిని చూసిన వెంటనే ఫోన్ ఓపెన్ చేయాలని అనిపిస్తుంది. అలాగే చాలామంది కాస్త ఖాళీ టైం దొరికినా తెలియకుండానే ఫోన్ తీస్తుంటారు. ఇలా పదేపదే ఒకే చర్యను చేయడం వల్ల అది మన దైనందిన జీవితంలో భాగమైపోతుంది.
67
ఒంటరితనం వల్ల..
మానసిక ఒత్తిడి, ఒంటరితనం లేదా బోర్‌గా అనిపించినప్పుడు కూడా మనం ఫోన్‌ను చూస్తుంటాం. ఎందుకంటే ఫోన్ తాత్కాలికంగా మన దృష్టిని సమస్యల నుంచి మళ్లిస్తుంది. సోషల్ మీడియా, వీడియోలు లేదా గేమ్స్ కొంతసేపు వినోదాన్ని అందిస్తాయి. దీంతో మనకు రిలాక్స్ అయిన భావన కలుగుతుంది. కానీ దీర్ఘకాలంలో ఇది ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితికి తీసుకురావచ్చు.
77
ఫోన్ వాడకం తగ్గాలంటే..
నిపుణుల ప్రకారం ఫోన్ వాడకాన్ని పూర్తిగా ఆపాల్సిన అవసరం లేదు. కానీ దానిపై నియంత్రణ ముఖ్యం. అవసరం లేని నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయడం, కేటాయించుకున్న టైంలోనే సోషల్ మీడియా చూడడం, నిద్రపోయే ముందు ఫోన్‌ను దూరంగా పెట్టడం వంటి చిన్న మార్పులు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం లేదా కుటుంబ సభ్యులతో సమయం గడపడం వంటివి ఫోన్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి.