శనగలు సహజంగా చాలా గట్టిగా ఉంటాయి. దానిని రెండు ముక్కలుగా విడగొట్టి శనగపప్పు గా మార్చినా కూడా ఆ గట్టిదనం అలాగే ఉంటుంది. అందువల్ల నీరు లోపలికి వెళ్లడానికి ఇతర పప్పుల కంటే ఎక్కువ సమయం పడుతుంది. పెసరపప్పు, కందిపప్పు వెంటనే నీరు పీల్చుకొని మెత్తగా మారుస్తాయి. దీని వల్ల, ఇవి తొందరగా ఉడుకుతాయి. కానీ, శనగపప్పు అలా కాదు. శనగపప్పులో ప్రోటీన్, కార్బో హైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని మృదువుగా మార్చాలి అంటే.. వేడి, సమయం చాలా అవసరం.
శనగపప్పు త్వరగా, మెత్తగా ఉడకాలంటే ఏం చేయాలి?
వంట చేయడానికి కనీసం 30 నుంచి 40 నిమిషాల ముందు శనగపప్పును నీటిలో నానపెట్టాలి. వీలైతే గోరువెచ్చని నీటిలో నానపెడితే.. పప్పు ఇంకా తొందరగా ఉడుకుతుంది. వేడి నీటిలో వేస్తే... పప్పు త్వరగా నాని... తొందరగా ఉడుకుతుంది. నానపెట్టే సమయం లేదు.. అయినా పప్పు తొందరగా ఉడకాలి అంటే.. చిటికెడు బేకింగ్ సోడా వేస్తే సరిపోతుంది. ఇది పప్పు గట్టితనాన్ని తగ్గించి, త్వరగా మెత్తగా ఉడికేలా చేస్తుంది. అయితే, బేకింగ్ సోడా మరీ ఎక్కువగా మాత్రం వేయకూడదు. ఎక్కువ వేస్తే.. పప్పు రుచి తగ్గిపోతుంది. కాబట్టి, చిటికెడు మించి వేయకూడదు.
ఒకవేళ మీరు శనగపప్పును కుక్కర్ లో ఉడికించాలి అనుకుంటే.. సాధారణ నీటికి బదులు, వేడి లేదా మరిగించిన నీటిని వాడాలి. అప్పుడు తొందరగా ఉడుకుతుంది.