ఈరోజుల్లో మద్యం మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది. ప్రజల ఆరోగ్యానికి హానికరం అయినా ప్రభుత్వాలు ఆదాయంకోసం మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో కాలేజీ పిల్లల నుండి పండుముసలివారి వరకు మద్యం సేవిస్తున్నారు.
డబ్బులున్నోళ్లు ఫారెన్ బ్రాండ్స్, మద్యతరగతివారు దేశీయ బ్రాండ్స్, పేదవారు చీఫ్ లిక్కర్ తాగుతుంటారు... ఇక మహిళలు వైన్, వోడ్కా, బీర్లు వంటివి తాగుతారు. మందుకు స్టేటస్, జెండర్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. ఈ కాలంలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు విందుతో పాటు మందుకూడా తప్పనిసరి అయిపోయింది. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ముక్క, చుక్క లేనిదే శుభకార్యమే కాదు అశుభకార్యం కూడా ఉండదు.
అయితే మద్యం సేవించినవారిని ఎప్పుడైనా ఎంత తాగావని అడిగితే క్వార్టర్ లేదా హాఫ్ కొట్టానని చెబుతారు. ఇద్దరుముగ్గురి గ్యాంగ్ ఉంటే ఫుల్ బాటిల్ లేపేసామని చెబుతారు. మరి ఈ ఫుల్ బాటిల్ అంటే ఎంత? అని అడిగితే చాలామందికి తెలియదు. ఓ ఫుల్ బాటిల్ అంటే 750 మిల్లీ లీటర్లు... హాఫ్ అంటే 375 మి.లీ.. క్వార్టర్ అంటే 180 మి.లీ.