పూర్వం ఓ రాజు ఉండేవాడు. అతని రాజ్యంలో అన్నీ ఉన్నాయి. సంపద, సౌఖ్యం, సేవకులు, విలాసవంతమైన జీవితం అన్నీ ఉన్నాయి. ఏది కోరుకున్నా నిమిషాల్లో తన ముందుకు వచ్చేస్తుంది. తనకు చిన్న కష్టం కలగకుండా చూసుకునే సేవకులు ఉన్నారు. ఇన్ని ఉన్నా కూడా ఆ రాజు ఎప్పుడూ అసంతృప్తిగా, ఆందోళనతో ఉండేవాడు. తనకు అన్నీ ఉన్నా.. ఏదో లోపం ఉన్నట్లు ఫీలయ్యేవాడు.
చాలా రోజులపాటు ఈ విషయంలో బాధపడిన ఆ రాజు... ఓ రోజు మంత్రిని పిలిచి.. తన బాధను వివరించాడు. ‘ నా దగ్గర అన్నీ ఉన్నాయి. అయినా నేను ఎందుకు సంతోషంగా లేను? నేను ఎలా నిజమైన ఆనందాన్ని పొందగలను?’ అని అడిగాడు. ఆ ప్రశ్నకు మంత్రి కాసేపు ఆలోచించి.. నవ్వుతూ ఓ పరిష్కారం చెబుతాడు.
‘రాజ్యంలో అత్యంత సంతోషంగా ఉన్న మనిషి ఎవరో కనుక్కొని.. అతని చొక్కా మీరు ధరిస్తే.. మీకు కూడా సంతోషం కలుగుతుంది’ అని మంత్రి చెబుతాడు. ఆ మాట వినగానే రాజు తన సైనికులను పిలిచి.. ‘ రాజ్యంలో అత్యంత సంతోషంగా ఉన్న మనిషిని కనుక్కొని అతని చొక్కా తీసుకు రండి’ అని ఆదేశిస్తాడు.
వెంటనే సైనికులు చాలా మందిని కలుస్తారు. రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ అడుగుతూనే ఉంటారు. రోజులు గడుస్తున్నాయి కానీ.. సంతోషకరమైన వ్యక్తిని మాత్రం కనుక్కోలేరు. ధనవంతులు, వ్యాపారాలు, రైతులు, కళాకారులు, పండితులు.. ఇలా ఎవరిని కలిసినా.. తమకు ఏదో సమస్య ఉందని.. సంతోషంగా లేమనే చెబుతారు.