Empty Stomach Foods: ఉదయం ఖాళీ కడుపుతో ఏం తినాలి? ఏం తినకూడదు? అనే విషయంలో చాలామందికి సందేహాలు ఉంటాయి. కొందరు లేవగానే టీ, కాఫీ తాగుతారు.. మరికొందరు పండ్లు, డ్రై ఫ్రూట్స్ తింటారు. అసలు ఖాళీ కడుపుతో ఏం తినవచ్చు? ఏం తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
ఉదయం మనం తీసుకునే ఆహారం రోజును ఉత్సాహంగా ప్రారంభించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే ఉదయం లేవగానే పొట్టకు ఇబ్బంది కలిగించని, శరీరానికి అవసరమైన పోషకాలు అందించే ఆహారం తీసుకోవడం మంచిది. నిపుణుల ప్రకారం ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలు తీసుకోవడం మంచిదైతే, మరికొన్ని తినకపోవడం మంచిది. ఇంతకీ ఉదయం పరగడుపున ఏం తినాలి? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.
26
నీళ్లు తాగడం
ఉదయం లేవగానే ముందుగా ఒక గ్లాసు నీళ్లు తాగడం మంచి అలవాటు. రాత్రంతా నీళ్లు తాగకుండా ఉండటం వల్ల ఉదయం దాహంగా ఉంటుంది. అందుకే నిద్ర లేచిన తర్వాత నీళ్లు తాగి, కొద్దిసేపటి తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేయవచ్చు. అలాగే ఆపిల్, అరటిపండు, బొప్పాయి, నారింజ, జామ వంటి పండ్లను కూడా ఉదయం తినవచ్చు. వీటిలో శరీరానికి ఉపయోగపడే విటమిన్లు, ఫైబర్ ఉంటాయి. అయితే పండ్ల రసం తాగడం కంటే పండును అలాగే తినడం మంచిది.
36
ఓట్స్, గింజలు, గుడ్డు
నానబెట్టిన బాదం, వాల్‌నట్స్ వంటి గింజలను కూడా ఉదయం పూట తినవచ్చు. వీటిని పరిమిత మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. ఓట్స్‌లో పండ్లు, గింజలు కలిపి తింటే కూడా మంచి బ్రేక్‌ఫాస్ట్ అవుతుంది. అలాగే గుడ్లు కూడా ఉదయం తినడానికి మంచి ఆహారం. ఉడికించిన గుడ్డు లేదా తక్కువ నూనెతో చేసిన ఆమ్లెట్ తీసుకోవచ్చు. గుడ్డుతో పాటు కూరగాయలు లేదా చపాతీ తీసుకుంటే శరీరానికి మరింత శక్తి అందుతుంది.
ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగలి వంటి రెగ్యులర్ టిఫిన్స్ ని కూడా తినవచ్చు. వీటితో పాటు పప్పు, సాంబార్, కూరగాయలు లేదా చట్నీ తీసుకుంటే బ్రేక్ ఫాస్ట్ మరింత సమతుల్యంగా ఉంటుంది. ప్రతిరోజూ ఒకే రకమైన టిఫిన్ కాకుండా రకరకాల ఆరోగ్యకరమైన ఆహారాలను మార్చి మార్చి తీసుకోవడం మంచిది.
56
ఖాళీ కడుపుతో తినకూడని ఫుడ్స్
చాలా కారంగా లేదా ఎక్కువ నూనెతో చేసిన పదార్థాలను ఉదయం పూట తినకపోవడం మంచిది. బజ్జీలు, పకోడీలు, వడలు, పూరీలు వంటి వాటిని ప్రతిరోజూ ఉదయం తినడం కంటే అప్పుడప్పుడు తీసుకోవడం ఉత్తమం. వీటిని ఎక్కువగా తింటే కొంతమందికి కడుపులో భారంగా అనిపించవచ్చు. అలాగే స్వీట్స్ ని కూడా ఉదయం ఎక్కువగా తీసుకోవద్దు. స్వీట్లు, బిస్కెట్లు, ప్యాకేజ్డ్ జ్యూస్‌లు, చక్కెర ఎక్కువగా ఉండే డ్రింక్స్‌ను రోజూ తీసుకునే అలవాటు మంచిది కాదు. వీటి బదులు పండ్లు లేదా తక్కువ చక్కెర ఉన్న ఆహారాన్ని ఎంచుకోవచ్చు.
66
టీ, కాఫీలు వద్దు
చాలామందికి ఉదయం నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగితే కొంతమందికి కడుపులో మంట, అసౌకర్యం కలగవచ్చు. మీకు అలాంటి సమస్య ఉంటే ముందుగా కొద్దిగా బ్రేక్ ఫాస్ట్ చేసి ఆ తర్వాత టీ లేదా కాఫీ తాగడం మంచిది.
అలాగే ఉదయం బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం సరైంది కాదు. ముఖ్యంగా ఉదయం నుంచి పనులు చేసేవారు, ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారు తగినంత ఆహారం తీసుకోవాలి. అల్పాహారం తక్కువగా తీసుకుంటే కొద్దిసేపటికే ఆకలి వేయవచ్చు. కాబట్టి కడుపు నిండేలా కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా తినడం మంచిది.