
ఒకప్పుడు పెళ్లిళ్లు, పేరంటాల్లోనూ, బేకరీ వంటకాల్లోనూ, పరోటా చేస్తున్నప్పుడు గుమగుమలాడే వాసన వచ్చేది. వీటన్నింటి తయారీలోనూ డాల్డా వాడేవారు. నెయ్యి కొనే స్థోమత లేని పేద, మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరలోనే నెయ్యి రుచిని, సువాసనను అందించే ప్రత్యామ్నాయంగా... మార్కెట్లో డాల్డా లభించేది. దీనితో చేసిన వంట చాలా సువాసనతోనూ, కమ్మగానూ ఉండేది. చాలా మంది దీనిని రెగ్యులర్ గా వాడేవారు. కానీ, డాల్డా వాడకం ఆరోగ్యానికి మంచిది కాదని తర్వాతర్వాత తెలిసొచ్చింది. దీంతో, దీని వాడకం కూడా తగ్గిపోయింది. అసలు, డాల్డా తినొద్దని డాక్టర్లు ఎందుకు చెబుతున్నారు? అసలు.. దీనిని ఎలా తయారు చేస్తారు? దీనిని తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటి?
డాల్డా మనకు చూడటానికి నెయ్యిలానే ఉంటుంది. కానీ, దీనిని మన నెయ్యి లాగా పాలతో తయారు చేయరు. దీనిని వెజిటేబుల్ గీ అని కూడా పిలుస్తారు. ఒక రసాయన ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు. ముందుగా పామాయిల్, సోయా బీన్, ప్రొద్దుతిరుగుడు వంటి చౌకైన కూరగాయల నూనెలను తీసుకుంటారు. ఆ నూనెలకు నికెల్ అనే లోహాన్ని ఉపయోగించి హైడ్రోజన్ వాయిను పంపుతారు. దీని వల్ల ద్రవ రూపంలో ఉన్న నూనె.. చిక్కగా మారి పసుపు రంగులోకి మారుతుంది. నెయ్యిలాగా గడ్డలాగా మారుతుంది. అందుకే, మనకు అది చూడటానికి అచ్చం నెయ్యిలానే ఉంటుంది. వాసన కూడా అలానే వస్తుంది.
డాల్డాను ఎందుకు తినకూడదు?
డాల్డా తయారీ ప్రక్రియలో సహజమైన నూనెల్లో ఉండే మంచి గుణాలు నశించడమే కాకుండా, శరీరానికి తీవ్ర హాని చేసే ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా తయారవుతాయి. డాల్డాను వేడి చేసినప్పుడు ఇవి మరిన్ని ప్రమాదకర రసాయనాలుగా మారుతాయి. అందుకే ఆరోగ్య నిపుణులు, వైద్యులు డాల్డాను ఆహారంలో వాడకూడదని ఖచ్చితంగా హెచ్చరిస్తారు.
గుండె జబ్బుల ప్రమాదం: డాల్డాలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL)ను విపరీతంగా పెంచి, మంచి కొలెస్ట్రాల్ (HDL)ను తగ్గిస్తాయి. దీనివల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి హార్ట్ ఎటాక్ (గుండెపోటు), స్ట్రోక్ వస్తాయి.
అధిక బరువు (ఓబెసిటీ): డాల్డాను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీవక్రియ మందగించి, శరీరంలో అనవసరమైన కొవ్వు పేరుకుపోయి అధిక బరువు పెరిగిపోతారు.
టైప్-2 డయాబెటిస్: ట్రాన్స్ ఫ్యాట్స్ ఇన్సులిన్ నిరోధకతను పెంచుతాయి, దీనివల్ల రక్తం కాకుండా చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఫ్యాటీ లివర్ : నాసిరకం కొవ్వులను కరిగించడం కాలేయానికి భారంగా మారి 'ఫ్యాటీ లివర్' సమస్యకు దారితీస్తుంది.
జీర్ణక్రియ సమస్యలు: డాల్డా త్వరగా జీర్ణం కాదు. దీనివల్ల గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి.
క్యాన్సర్ ప్రమాదం: డాల్డాను మళ్లీ మళ్లీ వేడి చేసి వాడటం వల్ల అందులో కార్సినోజెన్లు అంటే క్యాన్సర్ కలిగించే కారకాలు తయారవుతాయి.
అందుకే డాల్డా తినకూడదని డాక్టర్లు చెబుతుంటారు. ఈ డాల్డాను ఇప్పటికీ చాలా మంది బయట మార్కెట్ లో వాడుతూనే ఉన్నారు. బయటి బేకరీ వస్తువులు, పరోటాలు, సమోసాలు, స్వీట్లలో డాల్డాను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అందుకే, బయటే కొనే ఆహారాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఇంట్లోనే స్వచ్చమైన నెయ్యితో చేసిన ఆహారాలను తీసుకోవడం ఉత్తమం.