తేనె, ఉప్పు, చక్కెర... వద్దు
ఏడాది నిండేవరకు పిల్లలకు తేనె పెట్టకూడదు. తేనెలో ఉండే 'క్లోస్ట్రిడియం బోటులినమ్' (Clostridium botulinum) అనే బ్యాక్టీరియా వల్ల 'ఇన్‌ఫాంట్ బోటులిజం' అనే తీవ్రమైన అనారోగ్యం వచ్చే ప్రమాదం ఉంది. అలాగే, పిల్లల ఆహారంలో అనవసరంగా ఉప్పు, చక్కెర కలపొద్దు. పెద్దలకు అవసరమైనంత ఉప్పు, తీపి పిల్లలకు అవసరం లేదు.
పండ్లలో ఉండే సహజమైన చక్కెర వేరు, మనం అదనంగా కలిపే చక్కెర వేరు. కాబట్టి పండ్లు మానక్కర్లేదు, కానీ అదనపు చక్కెర కలపడం మానాలి. పిల్లలకు పెట్టే ఆహారంలో ఎక్కువ ఉప్పు, చక్కెర లేకుండా చూసుకోవాలి.
గుడ్లు, పల్లీలు, పాల ఉత్పత్తులు, చేపలు వంటివి అలర్జీ కలిగిస్తాయనే భయంతో పెట్టరు. గుడ్డును బాగా ఉడికించి లోపలి పచ్చసొనను తినిపించాలి. పచ్చసొనలో కొంచెం పాలు కలిపితే అది పలుచగా అవుతుంది. సులువుగా గొంతుదిగుతుంది. ఎగ్ వైట్ మాత్రం ఏడాది నిండే వరకు పెట్టకూడదు. ఇక చేపలను ఉడికించి, ముళ్లు తీసేయాలి. పల్లీలను పీనట్ బటర్ రూపంలో ఇవ్వచ్చు.