ఆలియా భట్ సినిమాలతోనే కాదు.. తన ఫిట్‌నెస్, జీవనశైలి, ఆహారపు అలవాట్లతోనూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఆమెకు సంబంధించిన బీట్‌రూట్ సలాడ్, చియా పుడ్డింగ్ వంటకాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది వాటిపై ఆసక్తి చూపించారు. దీంతో ఆమె ఫుడ్ ఛాయిస్ మీద బోలెడు చర్చలు కూడా జరిగాయి.
ఆలియా భట్ ఆహారపు అలవాట్లలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఒకవైపు ఆరోగ్యకరమైన ఆహారంపై శ్రద్ధ, మరోవైపు తనకు ఇష్టమైన వంటను దూరం పెట్టలేదు. చాలామంది ఫిట్‌నెస్ కోసం డైట్ మొదలుపెట్టగానే తమకు నచ్చిన పదార్థాలన్నింటినీ మానేయాలని భావిస్తారు. కానీ ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఇష్టమైన వంటకాలను పూర్తిగా వదిలేయడమేనా? అనేదే ఇక్కడ అసలు ప్రశ్న.
పోషకాలు అందించే ఆహారాన్ని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో..ఆహారం పట్ల అతిగా ఆందోళన చెందకుండా, దాన్ని ఆస్వాదించడం కూడా అంతే ముఖ్యం. అయితే ఏం తినాలి, ఎంత తినాలి అనేది వ్యక్తి శరీరం అవసరాలు, ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.