బొద్దింకలు, బల్లులు ఇంట్లో మూలల్లో ఉండి చాలా ఇబ్బంది కలిగిస్తుంటాయి. వీటి వల్ల కొన్నిసార్లు వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న వీటిని ఇంట్లో నుంచి తరిమికొట్టలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికోసమే ఈ చిట్కాలు. ఈ కీటకాలు, బల్లులను సులభంగా బయటకు ఎలా పంపించాలో ఇక్కడ తెలుసుకుందాం.
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి!
ఇల్లు శుభ్రంగా ఉంటే కీటకాలు, బల్లులు ఎక్కువగా రావు. కాబట్టి ఇంటి పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టాలి. దీనికోసం ప్రతిరోజూ ఇంటిని ఊడ్చి, తుడవాలి. తరచుగా తుడిస్తే కీటకాలు, బల్లులు రావు. క్రిములు కూడా ఉండవు. తిన్న ఆహారం కింద పడితే వెంటనే శుభ్రం చేయండి. అలాగే, తిన్న పాత్రలను వెంటనే కడగాలి. ముఖ్యంగా ఇంట్లో ఉన్న చెత్తను వెంటనే తీసివేయాలి.
మస్కిటో నెట్:
ఇంట్లో కిటికీలు, తలుపుల చుట్టూ ఉన్న చిన్న రంధ్రాల ద్వారా కీటకాలు, బల్లులు ఇంట్లోకి రావచ్చు. కాబట్టి కిటికీలకు మస్కిటో నెట్ వేయండి. అలాగే, సాయంత్రం వేళ తలుపు తెరిచి ఉంచకుండా మూసివేయాలి. అప్పుడే ఇంట్లోకి కీటకాలు, బల్లులు రావు.
మూలికలు:
కీటకాలను సహజంగా వదిలించుకోవడానికి కొన్ని ఆకులను ఉపయోగించవచ్చు. కీటకాలకు కొన్ని ప్రత్యేక ఆకుల వాసన నచ్చదు. ఉదాహరణకు వేప ఆకులు. వీటిని మీరు ఇంట్లో ఉంచితే కీటకాలు రాకుండా నివారించవచ్చు. అలాగే, దుకాణాల్లో సహజ కీటక నివారణ ద్రావణాలు దొరుకుతాయి, వాటిని కొనుగోలు చేసి ఉపయోగించవచ్చు.
ఉల్లిపాయ, వెల్లుల్లి:
వంటగదిలో ఉపయోగించే ఉల్లిపాయ, వెల్లుల్లి, గుడ్డు పెంకు వంటివి కీటకాలు, బల్లులను వదిలించుకోవడానికి ఉపయోగించవచ్చు. వీటి నుంచి వచ్చే ఘాటైన వాసన కీటకాలు, బల్లులకు నచ్చదు. కాబట్టి వీటిని వంటగది, బాత్రూమ్, కిటికీల చుట్టూ ఉంచవచ్చు.
వినెగార్, నిమ్మరసం:
ఒక స్ప్రే బాటిల్‌లో వెనిగర్, నిమ్మరసం, నీళ్లు కలిపి బాగా కలపాలి. దీన్ని కీటకాలు, బల్లులు వచ్చే చోట చల్లాలి. దీనివల్ల వాటి బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా వంటగది, బాత్రూమ్, కిటికీల చుట్టూ చల్లడం చాలా మంచిది.
కర్పూరం:
కర్పూరం వాసన కీటకాలు, బల్లులను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి మీ ఇంటి స్టోర్ రూమ్, బాత్రూమ్, అలమార, వంటగది వంటి చోట్ల కర్పూరం ఉంచడం ద్వారా కీటకాలు, బల్లులు రాకుండా సులభంగా నివారించవచ్చు.