బర్గర్ అంటే ఇష్టపడని జంక్ ఫుడ్ లవర్ ఉండడు. రెండు బన్స్ మధ్యలో రకరకాల కూరగాయలు.. సాస్, మయోనైజ్, చీజ్, చికెన్ ముక్కలు ఇలా రకరకాలుగా తయారు చేసే బర్గర్ అంటే.. నోట్లో నీళ్లూరుతాయి.
అందుకే బర్గర్ ను ఇష్టపడేవారు అనేకరకాల బర్గర్లను రుచి చూడడానికి ఇష్టపడతారు. అయితే ఓ చెఫ్ మాత్రం ఏకంగా నాలుగున్నర లక్షల రూపాయల విలువైన బర్గర్ ను తయారు చేసి ఆశ్చర్యపరిచాడు.
తయారు చేయడమే కాదు దాన్ని అమ్మి వచ్చిన డబ్బులు ఓ ఎన్ జీవోకు దానం కూడా చేశాడు. వివరాల్లోకి వెడితే..
నెదర్లాండ్స్‌లోని వూర్తుయిజెన్‌లోని డి డాల్టన్స్ డైనర్ చెఫ్ రాబర్ట్ జాన్ డి వీన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బర్గర్‌ను తయారు చేశాడు. దీన్ని 5,000 యూరోలకు అమ్మాడు. అంటే మన కరెన్సీలో రూ.4.5 లక్షలు మాత్రమే. దీనికి ‘ది గోల్డెన్ బాయ్’ అని పేరు కూడా పెట్టాడు.
రాబర్ట్ జాన్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో బర్గర్ ఫొటోను షేర్ చేశాడు. దాని వివరాలను చెప్పుకొచ్చాడు. ఇది నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.
డి డాల్టన్స్ డైనర్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఈ బర్గర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీధైన, ఆసక్తికరమైన బర్గర్. దీనికి కారణం దీని తయారీకి వాడిన పదార్థాలే. బెలూగా కేవియర్, కింగ్ క్రాబ్, స్పానిష్ పాలెట్టా ఇబెరికో, వైట్ ట్రఫుల్, ఇంగ్లీష్ చెడ్డార్ చీజ్ వంటి పదార్ధాలు దీని తయారీలో వాడారు.
అంతేకాదు దీని వెబ్‌సైట్ లో పరిశీలిస్తే దీంట్లో కోపి లువాక్‌తో తయారు చేసిన బార్బెక్యూ సాస్ కూడా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ బీన్స్‌లో కోపి లువాక్ ఒకటి. అలాగే, బర్గర్ కోసం వాడిన బన్ను డోమ్ పెరిగ్నాన్ షాంపైన్ డౌతో తయారు చేశారు.
ఇక ఈ బర్డర్ మీద టాపింగ్ గా బంగారంతో చేసిన పేపర్ ను వేశారు. ఈ అత్యంత ఖరీదైన బర్గర్ ను నెదర్లాండ్స్కు చెందిన వ్యాపార సంస్థ రెమియా ఇంటర్నేషనల్ కొన్నది.
దీన్ని రాయల్ డచ్ ఫుడ్ అండ్ బివరేజ్ అసోసియేషన్ చైర్మన్ రాబర్ విల్లెంసే తిన్నారు. ఈ అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని వీన్ ఓ ఎన్జీఓకు విరాళంగా ఇచ్చారు.
ఇంతకీ ఇలాంటి బర్గర్ తయారు చేయాలని వీన్ కు ఎందుకు అనిపించిందంటే.. డిప్రెషన్ వల్లనట. ప్రస్తుత పరిస్తితుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు,రెస్టారెంట్ పరిశ్రమ దుర్భరమైన పరిస్థితిని చూసి బాధతో దీన్ని తయారుచేశానని చెప్పడం కొసమెరుపు.