dark circles
చాలా మందికి కళ్ల చుట్టూ నల్లగా ఉంటుంది. ప్రస్తుతం ఇది సర్వ సాధారణ సమస్యగా మారింది. నిద్రలేమి, ఒత్తిడి, ఎక్కువ సేపు కంప్యూటర్, టీవీ, మొబైల్ ఫోన్లను వాడటం, డీహైడ్రేషన్, అధిక పనిభారం, రక్తహీనత వంటి కారణాల వల్ల కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి. అలాగే సరైన ఆహారాలను తినకపోవడం వల్ల కూడా కళ్ల చుట్టూ నల్లగా కనిపిస్తుంది. విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ, అలాగే యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఆహారాలను తింటే కళ్ల చుట్టూ ఉన్న నలుపు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. డార్క్ సర్కిల్స్ తగ్గడానికి ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Tomatoes
టమాటాలు
టమాటాలు కూడా డార్క్ సర్కిల్స్ ను పోగొట్టడానికి సహాయపడతాయి. టమాటాలను తింటే రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో కంటికింది సున్నితమైన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ముఖ్యంగా టమాటాల్లో ఉండే లైకోపీన్ చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
కీరదోసకాయ
కీరదోసకాయల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. ఇవి మన చర్మాన్ని పునరుత్తేజపరుస్తాయి. కీరదోసకాయ తీసుకోవడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది.
బొప్పాయి
బొప్పాయి మన చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. విటమిన్ ఎ పుష్కలంగా ఉండే బొప్పాయి వృద్ధాప్య లక్షణాలు అంటే ముడతలు, నల్ల మచ్చలను తగ్గించడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. బొప్పాయి కంటి చుట్టూ ఉన్న నల్లటి వలయాలను తొలగించడానికి సహాయపడతాయి.
బచ్చలికూర
బచ్చలికూరలో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో రక్త ప్రసరణను పెంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. విటమిన్ కె సమృద్ధిగా ఉండే ఈ ఆకు కూర చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
బీట్ రూట్
బీట్ రూట్ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. బీట్ రూట్ లో బీటాలిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చుట్టూ ఉన్న నల్లటి వలయాలను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా బీట్ రూట్ లో విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం లు కూడా మెండుగా ఉంటాయి.
watermelon juice
పుచ్చకాయ
పుచ్చకాయలో బీటా కెరోటిన్ తో పాటుగా యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. ఈ పండులో 92% నీరు ఉంటుంది. ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. పుచ్చకాయలో విటమిన్ బి1, విటమిన్ బి6, విటమిన్ సి లతో పాటుగా పొటాషియం, మెగ్నీషియంలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మన కళ్లను రక్షిస్తాయి.