స్థానిక జానపద కథల ప్రకారం, 1825 ప్రాంతంలో జైసల్మేర్ దివాన్ సలీం సింగ్ కన్ను కుల్దారా గ్రామ పెద్ద కుమార్తెపై పడింది. అత్యంత క్రూరుడిగా పేరున్న సలీం సింగ్.. ఆ అమ్మాయిని తనకు ఇచ్చి వివాహం చేయకపోతే గ్రామంపై భారీ పన్నులు వేసి, ఊరిని నాశనం చేస్తానని బెదిరించాడు. తమ ఆడబిడ్డ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి కుల్ధారా గ్రామస్తులందరూ ఒకే చోట సమావేశమయ్యారు. రాత్రికి రాత్రే తమ ఇళ్లను, ఆస్తులను వదిలి ఎక్కడికో వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ.. "ఈ కుల్ధారా గ్రామంలో మళ్లీ ఎవరూ నివాసం ఉండలేరు" అని శపించారని, ఆ తర్వాత ఎవరు ఇక్కడ నివసించడానికి ప్రయత్నించినా వింత అనుభవాలు ఎదురై పారిపోయారని స్థానికులు చెబుతారు.
అసలు నిజం ఏంటి..?
జానపథ కథలకు భిన్నంగా చరిత్ర కారులు ఈ గ్రామం గురించి మరో కథ చెబుతున్నారు. బ్రిటిష్ అధికారి జేమ్స్ టాడ్ రికార్డుల ప్రకారం 1815లో కుల్ధారాలో 800 మంది నివసించగా, 1890 నాటికి ఆ సంఖ్య 37కు పడిపోయింది. అంటే ఒక్క రాత్రిలో కాకుండా, దశాబ్దాల కాలంలో ప్రజలు క్రమంగా ఊరు విడిచి వెళ్లారని తెలుస్తోంది. 19వ శతాబ్దం నాటికి కుల్దారాలోని బావులు ఎండిపోవడం, సమీప నదిలోని నీరు ఇంకిపోవడం, పాలకుల విపరీతమైన పన్నుల భారం, వ్యాపార మార్గాలు మారడం, భూకంపం వంటి కారణాల వల్ల ప్రజలు మెరుగైన జీవనోపాధి కోసం ఈ గ్రామాన్ని వదిలి వలస వెళ్లిపోయి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
రాత్రిపూట ఈ గ్రామానికి నో ఎంట్రీ...
ప్రస్తుతం కుల్ధారా భారత పురావస్తు శాఖ (ASI) ఆధ్వర్యంలో ఒక పర్యాటక కేంద్రంగా ఉంది. పగటిపూట పర్యాటకులు ఇక్కడి శిథిలాలను, పురాతన వాస్తుశిల్పాన్ని చూసేందుకు వస్తుంటారు. కానీ సూర్యాస్తమయం తర్వాత ఇక్కడ వింత శబ్దాలు, నీడలు కనిపిస్తాయనే నమ్మకంతో స్థానికులు, అధికారులు సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరినీ లోపలికి అనుమతించరు. బాలీవుడ్ దర్శక నిర్మాతలు మాత్రం ఈ గ్రామంలో కొన్ని సినిమాల షూటింగ్ చేసినట్లు సమాచారం. సాయంత్రం తర్వాత మాత్రం ఎవరూ ఈ గ్రామంలోకి ఎవరూ అడుగుపెట్టరు.