సాధారణంగా రాత్రిపూట అందరూ నిద్రపోతారు. కానీ కొందరికి మాత్రం ఎంత ట్రై చేసినా నిద్రపట్టదు. ఆ టైంలో వారి ఆలోచనలు, క్రియేటివిటీ మరింత పెరుగుతాయి. రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉండటం చెడు అలవాటా? లేక శరీర సహజ లక్షణమా? సైకాలజీ ఏం చెబుతోందో ఇక్కడ చూద్దాం.
రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉండే అలవాటు చాలా మందికి ఉంటుంది. కొందరికి చదువు, ఉద్యోగం, క్రియేటివ్ పనుల వల్ల ఈ అలవాటు ఉంటే, మరికొందరికి సహజమైన శరీర గడియారం కారణంగా ఉంటుంది. సైకాలజీ ప్రకారం మన శరీరంలో పనిచేసే సర్కేడియన్ రిథమ్ అనే జీవ గడియారం నిద్ర చక్రాన్ని నియంత్రిస్తుంది. ఈ జీవ గడియారం ఒక్కో వ్యక్తికి ఒక్కో రకంగా మారుతుంది. రాత్రిళ్లు చురుకుగా ఉండే వారిని సాధారణంగా నైట్ అవుల్స్ అంటారు. కొందరు ఉదయం వేళల్లో చురుకుగా ఉంటే, మరికొందరు రాత్రి వేళల్లో మంచి పనితీరును కనబరుస్తారు. అందువల్ల రాత్రి మెలకువగా ఉండటం చెడు అలవాటు కాదు, అది సహజ స్వభావం కూడా కావచ్చని సైకాలజీ చెబుతోంది.
25
క్రియేటివిటీ ఎక్కువ..
సైకాలజీ ప్రకారం రాత్రిళ్లు మెలకువగా ఉండే వారిలో సృజనాత్మకత ఎక్కువగా ఉండే అవకాశముంది. చుట్టూ సైలెన్స్, తక్కువ డిస్టబెన్స్, ఒత్తిడి లేని పరిస్థితులు, లోతైన ఆలోచనలకు దోహదం చేస్తాయి. కొందరు రచయితలు, కళాకారులు, సాఫ్ట్‌వేర్ నిపుణులు తమకు రాత్రి సమయం అత్యంత అనుకూలమైందిగా చెబుతుంటారు. వ్యక్తుల క్రమశిక్షణ, బాధ్యతాభావం, ఆత్మనియంత్రణ వంటి అంశాలు కూడా నిద్రపాటుపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.
35
మానసిక ఆరోగ్యంపై ప్రభావం
సైకాలజీ నిపుణుల ప్రకారం ఎక్కువకాలం తక్కువ నిద్రపోవడం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. డిప్రెషన్, ఆందోళన, చిరాకు వంటి సమస్యలు నిద్రలేమితో పెరుగుతాయి. సాధారణంగా పెద్దవారికి 7–9 గంటల నిద్ర అవసరం. అంతకంటే తక్కువగా నిద్రపోతే మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, భావోద్వేగ నియంత్రణ దెబ్బతినే అవకాశం ఉంటుంది. రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉండి, ఉదయం త్వరగా లేవాల్సి వస్తే నిద్ర తగ్గుతుంది. ఇది దీర్ఘకాలంలో మానసిక ఒత్తిడిని పెంచుతుంది.
కొందరికి రాత్రి సమయం ఎమోషనల్ గా కాస్త సున్నితంగా ఉంటుంది. పగలు పనులతో బిజీగా ఉండి మనసులోని ఆలోచనలు బయటపడకపోయినా, రాత్రి నిశబ్దంలో అవి స్పష్టంగా ఎదురవుతాయి. ఒక విషయం గురించి మళ్లీ మళ్లీ ఆలోచించడం.. ఆందోళన, నిద్రలేమికి దారితీస్తుంది. సైకాలజీ ప్రకారం, రాత్రి పడుకునే ముందు డిజిటల్ పరికరాల వినియోగాన్ని తగ్గించడం, కెఫిన్‌ను సాయంత్రం తర్వాత తీసుకోకపోవడం, ధ్యానం లేదా శ్వాస అభ్యాసం చేయడం వంటి అలవాట్లు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి.
55
నిద్రను ప్రభావితం చేసే అంశాలు
మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, రాత్రి మెలకువగా ఉండే వారిలో స్వతంత్ర భావాలు, సృజనాత్మక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వారు సాధారణ నియమాలకు భిన్నంగా ఆలోచించే ధోరణి కలిగి ఉండవచ్చు. అయితే ఇది అందరికీ వర్తించదు. వ్యక్తి జీవనశైలి, పని సమయం, శారీరక ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు వంటి అనేక అంశాలు నిద్రను ప్రభావితం చేస్తాయి. రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉండటం ఒక లక్షణం కావచ్చు, కానీ అది ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా ఉండేలా చూసుకోవడం అత్యంత ముఖ్యమని సైకాలజీ నిపుణులు సూచిస్తున్నారు.