మీరు పామును చూడగానే ఏం చేస్తారు…? భయంతో వణికిపోయి తప్పులు చేస్తారు. అవే పాముకాటుకు కారణం అవుతాయి. కాబట్టి పాము కనిపించగానే ఏం చేయాలో కాదు ఏం చేయకూడదో తెలుసుకొండి.
Snakes : ఒక్కసారిగా పామును చూడగానే ఎవ్వరైనా భయపడిపోతారు.. ఆ కంగారులో తప్పులు చేస్తారు. మన యాక్షన్ బట్టి పాము రియాక్షన్ ఉంటుంది... మనం దానికి హాని తలపెడితే అదికూడా మనపై దాడికి యత్నిస్తుంది... కాటు వేస్తుంది. పాముకాటుకు గురికాకుండా సురక్షితంగా తప్పించుకునే మార్గాలివే...
సాధారణంగా విషసర్పాలు వాటికవే దాడి చేయవు. వాటిని బెదిరించినప్పుడు లేదా దాడికి ప్రయత్నించినప్పుడు తప్పించుకునే దారి లేనప్పుడే కాటేస్తాయి. అందుకే పాము కనిపిస్తే ఏం చేయాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఏం చేయకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం.
25
పాముని కంగారుపడకండి, చంపడానికి ప్రయత్నించకండి
చాలామంది చేసే పెద్ద తప్పు పామును చూడగానే కంగారు పడటమే. పామును చూడగానే హడలెత్తిపోయి హఠాత్తుగా కదిలితే పాము భయపడి ఆత్మరక్షణ కోసం దాడి చేస్తుంది. బదులుగా ప్రశాంతంగా ఉండి, నెమ్మదిగా వెనక్కి వెళ్లండి. పాములు మనుషులను చూసి కాదు, ప్రమాదాన్ని గ్రహించి స్పందిస్తాయి.
పామును చంపడానికి ప్రయత్నించడం చాలా ప్రమాదకరం. పాముకాట్లకు ఇది ఒక ప్రధాన కారణం. శిక్షణ పొందిన నిపుణులు కూడా అవసరమైతే తప్ప పాముతో నేరుగా తలపడరు. దాడి చేస్తే అది ఆత్మరక్షణ కోసం కాటేయొచ్చు.
35
పామును పట్టుకోడానికి ట్రై చేయొద్దు
పాము నెమ్మదిగా పాకుతున్నా, చిన్నదిగా ఉన్నా లేదా హానిచేయనిదిగా కనిపించినా దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడం పెద్ద తప్పు. చాలా కాట్లు పాములను పట్టుకునే ప్రయత్నంలోనే జరుగుతాయి. ఈ పనిని ఎప్పుడూ శిక్షణ పొందిన రెస్క్యూ టీమ్‌లకు వదిలేయండి.
ఒక పాము తాను చిక్కుకుపోయానని భావిస్తే, దాడి చేసే అవకాశం ఎక్కువ. దాని చుట్టూ చేరడం లేదా అది వెళ్లే దారిని అడ్డుకోవడం చేయొద్దు. అది సహజంగా వెళ్లిపోవడానికి దారి వదలండి.
పాము చుట్టూ జనం గుమిగూడితే దానికి ఒత్తిడి పెరిగి ప్రమాదం పెరుగుతుంది. పెద్దగా అరవడం, శబ్దాలు చేయడం లేదా దాన్ని భయపెట్టాలని చూడటం వంటివి చేస్తే అది రెచ్చిపోతుంది. పిల్లల్ని, పెంపుడు జంతువుల్ని వెంటనే దూరం తీసుకెళ్లండి.
కొంతమంది కిరోసిన్, పెట్రోల్ పోయడం లేదా నిప్పు పెట్టి పామును తరిమేయాలని చూస్తారు. ఇది ప్రమాదకరం కావడమే కాక, పర్యావరణానికి కూడా హానికరం. ఇది సమస్యను పరిష్కరించకపోగా, మరింత తీవ్రం చేస్తుంది.
ఒకవేళ పాము కాటు వేస్తే గాటు పెట్టడం, నోటితో విషం పీల్చడం, లేదా కట్టు కట్టడం వంటి పాత పద్ధతులు పాటించొద్దు. ఇవి మేలు కన్నా ఎక్కువ కీడు చేస్తాయి. బదులుగా వెంటనే వైద్య సహాయం తీసుకోండి.
55
పామును చూడగానే ఈ జాగ్రత్తలు పాటించండి
తప్పులు చేయకుండా ఉండటం ఎంత ముఖ్యమో, సరైన పద్ధతి పాటించడం కూడా అంతే ముఖ్యం. పాము కనిపించగానే సురక్షిత దూరం పాటించండి. హఠాత్తుగా వెనక్కి తిరగకుండా నెమ్మదిగా దూరం జరగండి. స్థానిక అటవీ శాఖ లేదా స్నేక్ రెస్క్యూ సేవలకు కాల్ చేయండి. నిపుణులు వచ్చేవరకు ఆ ప్రాంతాన్ని ఖాళీగా ఉంచండి. కాటు వేస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లండి.