
Kidney symptoms: ప్రస్తుత జీవన శైలి కారణంగా ఎంతో మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటే మాత్రం మన ఆరోగ్యం ఏమాత్రం బాగోదు. కిడ్నీల పనితీరు దెబ్బతింటే మన శరీరంలో విషపదార్థాల సంఖ్య పెరిగిపోతూనే ఉంటుంది. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇలా కాకూడదంటే.. కిడ్నీ పరీక్షలను తరచుగా చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అయితే కిడ్నీల వ్యాధులు మీకు సోకాయని తెలుసుకోవడం చాలా కష్టం. కిడ్నీ సమస్యలు అంత తొందరగా బయటపడవు కూడా. కానీ మనలో జరిగే కొన్ని మార్పుల ద్వారా తెలుసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
డయాబెటిక్ పేషెంట్లలో 40 శాతం మందికి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అది కూడా దీర్ఘకాలిక సమస్య. కాబట్టి డయాబెటిస్ ఉన్న వారు ఎప్పటికప్పుడు కిడ్నీ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి.
మీ ఇంట్లో ఎవరైనా మధుమేహం సమస్య, లేదా హైబీపీ , కిడ్నీ వ్యాధుల వారున్నా.. మూత్రపిండాల పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కిడ్నీ ఆరోగ్యం దెబ్బతిన్నాయనడానికి గుర్తుగా మీరు అనూహ్యంగా వెయిట్ తగ్గుతారు.
మూత్రపిండాలు మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలన్నింటినీ బయటకు పంపిస్తాయి. ఒకవేళ వీటి ఆరోగ్యం దెబ్బతింటే మాత్రం మన శరీరంలో వ్యర్థద్రవాలు పేరుకుపోయి మీ కాళ్లు, చేతులు, ముఖం, మడమల్లో నీరు పేరుకుపోతుంది. దాంతో ఆ భాగాలు ఉబ్బిపోయినట్టుగా కనిపిస్తాయి.
ఏ పనిచేయకపోయినా మీరు ఊరికే అసపోవడం, నిసత్తువగా కనిపించడం, శ్వాసలో ఇబ్బంది ఎదురవడం వంటి లక్షణాలు కూడా కిడ్నీ వ్యాధులకు సంకేతమే.
ఒకవేళ మీ మూత్రంలో రక్తం వస్తుంటే .. వెంటనే వైద్యులను సంప్రదించండి. దీనివల్ల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు. మూత్రం పరీక్ష ద్వారా సమస్య ఏంటన్న విషయాన్ని తెలుసుకుంటారు. కిడ్నీ సమస్యలు తలెత్తితే కూడా ఇలాగే అవుతుందట.
ఊరికూరికే మూత్రం వస్తుంటే కూడా అనుమానించాల్సిందే. అలాగే మూత్రం ముదురు రంగులో రావడం, మూత్ర విసర్జన రాకున్నా.. ఒత్తిడిగా అనిపించడం వంటి సమస్యలు కిడ్నీ వ్యాధులకు సంకేతాలు.
ఒంట్లో వ్యర్థపదార్థాలు పేరుకుపోయినప్పుడు స్కిన్ పై దద్దుర్లు వస్తుంటాయి. అలాగే దురద కూడా పెడుతుంది. కిడ్నీల ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ఒంట్లో వివిధ భాగాల్లో కారణం లేకుండా నొప్పి పుడుతుంది. ఇటువంటి సమయాల్లో కిడ్నీల పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి.
ఒంట్లో వ్యర్థాలు బయటకుపోకపోతే.. వికారం, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఒక్కోసారి కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటే అనీమియా వస్తుంది. దీంతో మెదడుకు ఆక్సిజన్ తగినంతగా అందదు. దీంతో మైకం కమ్ముతుంది.
కిడ్నీ వ్యాధుల బారిన పడ్డప్పుడు అంగస్తంభన సమస్యలు కూడా తలెత్తుతాయి. దీంతో పాటుగా తంతు కణజాలం, నరాలు, ధమనులు దెబ్బతినడంతో పురుషాంగానికి బ్లడ్ సర్క్యూలేషన్ సరిగ్గా జరగదు. దీంతో అంగస్తంభన సమస్య వస్తుంది.