Sankranti 2024: ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ పండుగలను జరుపుకుంటారు. ఈ మూడు రోజుల్లో ఏ రోజుకారోజు ఎంతో ప్రత్యేకమైనవి. ఇక మొదటి రోజు రేపే కాబట్టి.. భోగి నాడు ఉదయాన్నే భోగి మంటలను వెలిగిస్తారు. ఇక సాయంత్రం వేళ పిల్లలపై భోగి పళ్లతో దిష్టి తీస్తారు. ఈ రోజు రేగు పళ్లనే మనం భోగి పళ్లుగా పిలుస్తాం. అయితే భోగి పండుగ నాడు పిల్లలకు భోగి పళ్లతో దిష్టి తీయడం వెనుక పెద్ద కథే ఉంది.
bhogi pallu
ఐదేండ్ల వయసున్న పిల్లలకే భోగి పండుగ నాడు భోగి పళ్లను పోస్తారు. ఇందుకోసం ఇంటి చుట్టు ముట్టు ఉన్న ముత్తైదువులు కూడా వస్తారు. ఒక్క రేగుపళ్లు ఒక్కటే కాదు.. రేగుపళ్లలోనే బంతిపూల రెమ్మలను, చిల్లర పైసలను, చెరుకు ముక్కలను కలిపి పిల్లలపై పోస్తారు.
పురాణాల ప్రకారం.. రేగుచెట్టు కిందే కూర్చొని, ఆ చెట్టు పళ్లను తింటే నారాయణుడు తపస్సు చేశాడట. అందుకే రేగుచెట్టుకు, రేగు పళ్లకు అంత ప్రాముఖ్యత వచ్చిందంటారు పండితులు. ఇక భోగి పండుగ నాడు భోగిపళ్లను పిల్లలపై పోయడం వల్ల వారికి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని చెప్తారు. ఇకపోతే ఈ రోజు రేగుపళ్లతో పిల్లలకు దిష్టితీయడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం కూడా పొందుతారని చెప్తారు. ఎందుకంటే భోగిపళ్లను అర్కఫలం అంటారు. సూర్యుడినే అర్కుడంటారు. ఇకపోతే మకర సంక్రాంతి నాడు సూర్యుడు ఉత్తరాయణుడు అవుతాడు. దీంతో సూర్యభగవానుడి కటాక్షం పిల్లలపై ఉంటుందనే నమ్మకం ఉంది. అందుకే భోగి నాడు ఖచ్చితంగా పిల్లలపై భోగి పళ్లను పోస్తారు.
మీరు గమనించారో? లేదో? భోగి పళ్లను అన్ని వయసుల పిల్లలపై పోయరు. కేవలం ఐదేండ్లలోపున్న పిల్లలకే పోస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే? ఈ చిన్నారుల ఇమ్యూనిటీ పవర్ బలహీనంగా ఉంటుంది. అలాగే వీరి జీర్ణవ్యవస్థ కూడా బలంగా ఉండదు. కాగా ఈ పిల్లలకు రేగుపళ్లు మంచి మెడిసిన్ లా పనిచేస్తాయి. పిల్లలు రేగుపళ్లను తింటే వారి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ పండ్లలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే పిల్లలకు జీర్ణ సమస్యలు కూడా రావు.
ఇక రేగుపళ్లలో కలిపే బంతిపూలలో కూడా ఎణ్నో ఔషదగుణాలుంటాయి. ఈ పువ్వులు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. బంతిపూలు చర్మానికి తగలడం వల్ల చర్మంపై ఉన్న క్రిమికీటకాలు చనిపోతాయి. చర్మ సమస్యలుంటే కూడా నయమవుతాయి. అంతేకాదు ఈ భోగిపళ్లు పిల్లలకున్న దిష్టిని కూడా తొలగిస్తాయనే నమ్మకం ఉంది.