భారతదేశంలో ఘనంగా జరుపుకునే ప్రధాన పండుగలలో మకర సంక్రాంతి ఒకటి. ఈ ఏడాది మకర సంక్రాంతి జనవరి 15న వచ్చింది. పురాణాల ప్రకారం.. ఈ పండుగను దానధర్మాలకు, ఆరాధనకు, యజ్ఞానికి పవిత్రమైనదిగా భావిస్తారు. సంక్రాంతి అని కూడా పిలువబడే మకర సంక్రాంతి అనే పేరు సూర్యభగవానుడికి గుర్తుగా వచ్చింది. అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినందుకు గుర్తుగా ఈ పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. చేతికొచ్చిన పంటలను ఆరాధించడం, వాటిని సంతోషంగా పంచుకోవడం వల్ల ఇది పంట సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. పంచాంగం ప్రకారం.. మకర సంక్రాంతిని తమిళనాడులో పొంగల్ గా, గుజరాత్, రాజస్థాన్ లలో ఉత్తరాయనన్ గా, హర్యానా, పంజాబ్ లో మాఘీగా , తూర్పు ఉత్తర ప్రదేశ్ లో కిచిడీగా సెలబ్రేట్ చేసుకుంటారు.