Relationship Tips: వైవాహిక జీవితం ప్రశాంతంగా సాగాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకు ప్రయత్నిస్తారు. ఇలా ఉండేది మాత్రం చాలా తక్కువ జంటలే. అయినా పెళ్లి అన్నాక.. భార్యా భర్తల మధ్య చిన్న చిన్న కొట్లాటలు, మనస్పర్థలు, జగడాలు చాలా కామన్. ఇక పెళ్లైన కొత్తలో చాలా జంటలు ఆనందంగా, ప్రేమగా ఉంటాయి. కాలం గడుస్తున్న కొద్దే.. చాలా మంది జంటల మధ్య మనస్పర్థలు ఎక్కువ అవుతుంటాయి. కొట్లాటలు, జగడాలు తరచుగా జరుగుతుంటాయి. వీటకి కారణాలు చాలానే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పాత విషయాలను ప్రస్తావించడం:
జరిగిపోయిన విషయాలను ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. వాటిని గుర్తుచేసుకోవడం వల్ల ప్రయోజనం కలగాలే తప్ప.. అవి ఇద్దరి మధ్య మనస్పర్థలు కలిగించే విధంగా ఉండకూడదు. అలా ఉంటే వాటిని గుర్తుచేసుకుని మాట్లాడుకోవడం మానేయాలి. ప్రతి ఒక్కరి జీవితంలో గతం ఉంటుంది. దాన్ని పట్టుకుని గతంలో నువ్ ఇలా చేసావ్.. అలా ఉన్నావ్ అంటూ భాగస్వామితో అనడం చాలా తప్పు. తాన్నిపూర్తిగా మర్చిపోయి.. ప్రస్తుత బంధాన్ని ప్రేమిస్తేనే మీ వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో వర్దిల్లుతుంది. లేదంటే మీ బంధానికి బ్రేక్ పడే రోజు వస్తుంది.
క్షమాపణ చెప్పడానికి వెనకాడొద్దు:
ఎవరైనా భార్యా భర్తలు గొడవపడి.. తమ తప్పులను ఒప్పుకున్నాక.. ఒకరికొకరు క్షమాపనలు చెప్పుకోవడానికి వెనకాడుతుంటారు. ఇది మంచి అలవాటు కాదు. మీ బంధం బలంగా ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కానీ ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. తప్పు చేసినప్పుడు ఒప్పుకోండి. మీ భాగస్వామికి సారీ చెప్పండి. లేదంటే ఇది మీ బంధాన్ని శాశ్వతంగా విడదీసే ప్రమాదం ఉంది.
అనుమానించొద్దు:
అనుమానం పెను భూతం అంటారు పెద్దలు. ఎందుకంటే అనుమానం బలమైన బంధాలను సైతం ఇట్టే విడగొట్టేస్తుంది. కానీ ఈ రోజుల్లో చాలా రిలేషన్ షిప్స్ అనుమానంపైనే నడుస్తున్నాయి. ముఖ్యంగా ఒకరికి తెలియకుండా ఇంకొకరు.. తమ భాగస్వాముల మొబైల్ ఫోన్లను చెక్ చేస్తుంటారు. వారి సోషల్ మీడియా పై కూడా ఒక కన్నేసి ఉంచుతారు. అలా౦టి అలవాట్లు మీ పై ఉన్న నమ్మకాన్ని పోగొడతాయి. ఇవి మీ మధ్య దూరాన్ని పెంచుతాయి. అందుకే మీ భాగస్వామిని ఎప్పుడూ అనుమానించకండి.
ఒకరినొకరు నిందించుకోవడం:
రిలేషన్ షిప్ లో తప్పులు సర్వసాధారణం. కానీ ఆ వ్యక్తి తప్పులనే ఎప్పుడూ ఎత్తి చూపుతూ అవమానించడం, నిందించడం అస్సలు మంచిది కాదు. నిందలు మీ మధ్య గొడవలకు కారణమవుతాయి. జరిగిందేదో జరిగిపోయింది. అలా అన్నావ్.. ఇలా అన్నావని నిందించుకోవడం వల్ల ఒరిగేదేమీ లేదు. దీనివల్ల మీ వైవాహిక జీవితమే నాశనం అవుతుంది.