పీరియడ్స్ సమయంలో శృంగారం కరెక్టా? కాదా?

First Published | Sep 14, 2021, 3:01 PM IST

 పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయకూడదనే అపోహ వెనుక మతపరమైన మూలాలున్నాయి. అంతేతప్ప పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొనకూడదు అనేది నిజం కాదు. అనారోగ్యకరం కాదు. నిజానికి, ఇది కొన్ని సందర్భాల్లో తిమ్మిరికి ఉపశమనంగా పని చేస్తుంది.

పీరియడ్స్, నెలసరి, రుతక్రమం... ఇలా ఏ పేరుతో పిలిచినా అది ఆడవాళ్ల ఆరోగ్యచక్రాన్ని సూచిస్తుంది. అయితే ఇప్పటికీ ఈ రుతుస్రావం, నెలవారీ అంటూ, ముట్టూ లాంటి భావనలు గుసగుసగా మాట్లాడుకునే అంశాలుగానే పరిగణించబడుతున్నాయి. అంతేకాదు వీటిచుట్టూ అనేక అపోహలూ ఉన్నాయి.  

వైద్యపరంగా డిస్మెనోరియా అని పిలువబడే పీరియడ్ పెయిన్ చాలా మంది మహిళలు ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య. ఇది అనేక కారణాల వల్ల రావచ్చు. దీన్ని రెండు రకాలుగా చెబుతారు. స్పాస్మోడిక్ అంటే తీవ్రమైన నొప్పి. చాలామంది దీని గురించి ఆందోళన చెందుతారు. ఇది సాధారణమైనది కాదని భావిస్తారు. అయితే నిపుణులు మాత్రం ఇది పూర్తిగా సాధారణమని అంటున్నారు.


70-80 శాతం మహిళల్లో పీరియడ్స్ టైంలో పెయిన్ వస్తుంది. నొప్పి తేలికపాటి నుండి తీవ్రంగా ఉండొచ్చు. తీవ్రంగా ఉన్న సందర్భాల్లో, కొందరు మహిళల్లో మూర్చ కూడా కనిపిస్తుంది. రుతుక్రమం సమయంలో వచ్చే నొప్పి, లక్షణాలు ప్రతీ మహిళకు భిన్నంగా ఉంటాయి.

దీంతో పాటు పీరియడ్స్ చుట్టూ అనేక అపోహలు రాజ్యమేలుతూ ఉంటాయి. వాటిల్లో నిజమెంత..నిజానికి వాటిని నమ్మాలా? చూద్దాం.. 

అపోహ : పీరియడ్స్ నొప్పి అనేది అంత మంచి విషయం కాదు
వాస్తవం : పీరియడ్ నొప్పి వల్ల వేరే ఇతర అంతర్గత సమస్యలు ఉన్నాయని సూచన కాదు. నిజానికి పీరియడ్ సమయంలో తేలికపాటి నుండి మితమైన నొప్పి మంచి సంకేతం. పీరియడ్ నొప్పి ఆరోగ్యకరమైన గర్భాశయం, అండాశయాలకు సంకేతం అని తెలిస్తే  ఆశ్చర్య కలగక మానదు.

అపోహ : పీరియడ్స్ సమయంలో పుల్లని, చల్లటి ఆహారాన్ని తీసుకోకూడదు

వాస్తవం : పీరియడ్స్ సమయంలో పుల్లని ఆహారాన్ని ఎందుకు తీసుకోకూడదు అనే దాని వెనుక శాస్త్రీయ కారణం లేదు. పుల్లని ఆహారాలలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. దీంతోపాటు చల్లని ఆహారాల్ని కూడా తీసుకోవచ్చు. కానీ, మితంగా తీసుకోవాలి. ఈ సమయంలో ఆయిలీ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ మాత్రం తీసుకోవద్దు. వీటివల్ల కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి.

అపోహ : మీ పీరియడ్స్ టైంలో గర్భం దాల్చలేరు.

వాస్తవం : పీరియడ్స్ సమయంలో గర్భం దాల్చే అవకాశం ఉంది. మీ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంటే గర్భం వచ్చే అవకాశం లేదు. కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు గర్భం వచ్చే అవకాశం ఉంది.

ప్రెగ్నెన్సీకి కారణమైన అండోత్పత్తి మామూలుగా పీరియడ్స్ తరువాత జరుగుతుంది. అయితే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉన్నప్పుడు.. పీరియడ్స్, అండోత్పత్తి ఒకదానికొకటి ఓవర్ లాప్ అవ్వడం వల్ల గర్భం దాల్చే అవకాశం ఉంది. ఎక్కువ రోజులు రక్తస్రావం అవుతున్నప్పుడు కూడా గర్భం వచ్చే అవకాశం ఉంది. 

మీరు గర్భనిరోధక మాత్రలు లేదా IUD తీసుకుంటే తప్ప, రక్షణ లేకుండా సెక్స్ చేస్తే మాత్రం గర్భం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. 

అపోహ: పీరియడ్స్ సమయంలో వ్యాయామం చేయకూడదు.

వాస్తవం : పీరియడ్స్ సమయంలో వ్యాయామం చేయడం వల్ల నొప్పి పెరుగుతుందని నమ్ముతారు. దీనికి విరుద్ధంగా, కొన్ని సాధారణ వ్యాయామాలు, యోగా ఆసనాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి, మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారైతే, పీరియడ్స్ సమయంలో దాన్ని ఆపకండి. కఠినమైన వ్యాయామాలు కాకుండా తేలికపాటి వ్యాయామాలు చేయచ్చు. 

అపోహ : చల్లని నీళ్లతో స్నానం చేస్తే నొప్పి పెరుగుతుంది. 
వాస్తవం : పీరియడ్ నొప్పి గర్భాశయం గోడలు కదలడం వల్ల కలుగుతుంది. దీనికీ.. మీరు స్నానం చేసే నీటికీ ఎలాంటి సంబంధం లేదు. అయితే, వేడి నీటి స్నానం శరీరానికి విశ్రాంతినిస్తుంది. నొప్పి నుంచి ఉపశమన ప్రభావాన్ని కలిగిస్తాయి. అంతేకానీ చల్లటి నీటి స్నానాలు ఎటువంటి హాని కలిగించవు.

అపోహ : పీరియడ్స్ సమయంలో ఈత కొట్టకూడదు.

వాస్తవం : మీ పీరియడ్స్ సమయంలో ఈత కొట్టడం ఖచ్చితంగా సురక్షితం. టాంపోన్స్ లేదా మెన్స్ట్రువల్ కప్స్ లేని కాలంలో ఈ అపోహ పుట్టి ఉండొచ్చు.

అపోహ : పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయకూడదు
వాస్తవం : ఈ అపోహ వెనుక మతపరమైన మూలాలున్నాయి. అంతేతప్ప పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొనకూడదు అనేది నిజం కాదు. అనారోగ్యకరం కాదు. నిజానికి, ఇది కొన్ని సందర్భాల్లో తిమ్మిరికి ఉపశమనంగా పని చేస్తుంది. మీకు ఇబ్బంది లేకుంటే.. మీరు మీ పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయడం అస్సలు తప్పుకాదు.

Latest Videos

click me!