Motivation story
పూర్వం చిట్టాపురం గ్రామంలో శ్రీమన్ అనే ఓ వ్యాపారి ఉండేవాడు. వస్తువులు కొనుగోలు చేసి విక్రయించడం ఇతని పని. వస్తువులు తక్కువ ధరకు ఎక్కడ లభిస్తాయో తెలుసుకొని కొనుగోలు చేస్తాడు. వాటిని వేరే గ్రామానికి తీసుకెళ్లి విక్రయించి అధిక లాభాలు పొందుతాడు. ఈ క్రమంలోనే ఓ రోజు కొబ్బరి బొండాలను విక్రయించాలని నిర్ణయిస్తాడు. తక్కువ ధరకు ఎక్కడ లభిస్తాయో తెలుసుకొని ఆ గ్రామానికి వెళ్తాడు.
Telugu story
ఎడ్ల బండి నిండా బొండాలను నింపుకొని పక్కనే ఉన్న భూంపల్లి అనే గ్రామంలో విక్రయించడానికి వెళ్తుంటాడు. అయితే ఆ గ్రామానికి అతను వెళ్లడం అదే తొలిసారి, దారి కూడా సరిగ్గా తెలియదు. దీంతో దారి మధ్యలో మేకలు కాస్తూ ఓ వెళ్తున్న ఓ మేకల కాపరిని భూంపల్లి గ్రామానికి ఎలా వెళ్లాలని అడుగుతాడు. అతను ఇలా నేరుగా వెళ్లమని సమాధానం ఇస్తాడు. ఎంత సమయం పడుతుందని అడిగితే.. 'నెమ్మదిగా వెళ్తే గంట, వేగంగా వెళ్తే రెండు గంటలు. నిదానమే ప్రధానం' అని బదులిస్తాడా కాపరి.
దీంతో ఆ వ్యాపారికి అర్థం కాదు. ఇదేంటి నెమ్మదిగా వెళ్తే త్వరగా వెళ్లొచ్చని, వేగంగా వెళ్తే ఆలస్యమవుతుందని అంటున్నాడు. వీడెవడో తింగరోడు ఉన్నాడని మనసులోనే అనుకుంటూ ముందుకు సాగుతాడు. త్వరగా గ్రామానికి చేరుకోవాలని ఎడ్ల బండి వేగాన్ని పెంచుతాడు. అయితే ఆ గ్రామానికి వెళ్తున్న మార్గంలో రోడ్డుపై పెద్ద గుంత ఉంటుంది. వేగంగా వెళ్లడంతో శ్రీమన్ ఆ గుంతను గమనించకుండా వెళ్లిపోతాడు.
telugu-motivational-story
గుంతలో నుంచి వేగంగా వెళ్లడంతో ఎడ్ల బండి ఒక్కసారిగా ఎగురుతుంది. దీంతో బండిలోని కొబ్బరిబొండాలన్నీ చెల్లాచెదురుగా రోడ్డు మీద పడిపోతాయి. వాటన్నింటినీ నెమ్మదిగా ఒక్కొక్కటి ఏరుకొని మళ్లీ బండిలో వేసుకొని భూంపల్లికి వెళ్లే సరికి ఆ మేకల కాపరి చెప్పినట్లే రెండు గంటల సమయం పడుతుంది. అప్పుడు అర్థమవుతుంది. నిదానమే ప్రధానం అన్న సామెతలో ఎంత నిజం ఉందో అని.
నీతి: మనలో కూడా చాలా మంది జీవితంలో త్వరగా సక్సెస్ కావాలని అడ్డదారిలో వేగంగా వెళ్లడానికి ప్రయత్నించి బొక్క బోర్లాపడతారు. అందుకే నిదానంగా ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ జీవితంలో ముందుకు సాగితే ఎప్పటికైనా విజయం సొంతమవుతుందనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది.