Parenting: పిల్లలు తెలిసో, తెలియకో ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. అయితే మగపిల్లలు తప్పు చేసినప్పుడు తండ్రి ఎలా స్పందిస్తాడన్నదే వారి భవిష్యత్ పై పెద్ద ప్రభావం చూపుతుందట. ముఖ్యంగా తండ్రి కొడుకుతో ఈ 5 మాటలు అస్సలు చెప్పకూడదట. అవేంటో చూద్దాం.
పిల్లలు తప్పులు చేయడం సహజం. ముఖ్యంగా మగపిల్లలు ఎదుగుతున్న సమయంలో కొన్ని విషయాలను సరిగ్గా అర్థం చేసుకోలేక కొన్ని తప్పులు చేయవచ్చు. ఆ తప్పు వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడం ఎంత ముఖ్యమో, ఆ సమయంలో తండ్రి ఉపయోగించే మాటలను జాగ్రత్తగా ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. తండ్రి చెప్పే ఒక్క మాట కొడుకులో మార్పు తీసుకురావచ్చు. అదే సమయంలో అతని ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీయవచ్చు. అందుకే కొడుకు తప్పు చేసినప్పుడు తండ్రి కొన్ని మాటలను అస్సలు చెప్పకూడదు. అవేంటో చూద్దాం.
26
నీకు ఏం చేతకాదనడం
కొడుకు ఒక తప్పు చేశాడని అతని సామర్థ్యాన్నే ప్రశ్నించడం సరైన పద్ధతి కాదు. ఇలాంటి మాటలు పిల్లవాడి మనసులో బలంగా నాటుకుపోయి, తాను నిజంగానే పనికిరానివాడిననే భావన కలిగించవచ్చు. తప్పును వ్యక్తిత్వంతో కలపకుండా, ఎలా సరిదిద్దాలో చెప్పడం ముఖ్యం. తప్పు చేసిన కొడుకును తక్కువ చేయడం కంటే, తప్పు నుంచి బయటపడే మార్గాన్ని చూపించడమే తండ్రి బాధ్యత.
36
నిన్ను చూస్తే సిగ్గేస్తోందనడం
తండ్రి అనే కొన్ని మాటలు కొడుకుకు చాలా బాధ కలిగించవచ్చు. ముఖ్యంగా ఇతరుల ముందు ఈ మాట చెప్పడం వల్ల అవమానంగా అనిపించి, తండ్రితో తన సమస్యలను పంచుకోవడానికి కూడా భయపడే అవకాశం ఉంటుంది. తప్పు చేసినప్పుడు కొడుకు తన చర్యపై సిగ్గుపడాలి కానీ, తాను ఒక వ్యక్తిగా సిగ్గుపడాల్సిన అవసరం లేదని అతనికి అర్థమయ్యేలా చేయాలి. తప్పును ఖండించడం వేరు, మనిషిని ఖండించడం వేరు. ఈ విషయం తండ్రి గుర్తుంచుకోవాలి.
పిల్లలను మరొకరితో పోల్చడం చాలా సులభం. మంచి మార్కులు వచ్చిన వారిని చూపించి, నువ్వెందుకు అలా చదవలేకపోతున్నావని అడగడం తండ్రికి సాధారణంగా అనిపించవచ్చు. కానీ కొడుకు దాన్ని ప్రోత్సాహంగా తీసుకోడు. బదులుగా తనపై తనకు నమ్మకం తగ్గే అవకాశం ఉంటుంది. ప్రతి పిల్లవాడికి తనదైన సామర్థ్యం, వేగం, ఆసక్తులు ఉంటాయి. కాబట్టి ఇతరులతో కాకుండా తన గత పనితీరుతో పోల్చి చెప్పడం మంచిది.
56
నువ్వు ఎప్పుడూ ఇలాగే చేస్తావనడం
ఒకసారి చేసిన తప్పును పట్టుకుని.. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉంటావు, నువ్వు మారవు అని పదేపదే చెప్పడం వల్ల పిల్లవాడికి తాను మారలేననే భావన కలగవచ్చు. ఒక తప్పు అతని మొత్తం వ్యక్తిత్వాన్ని నిర్ణయించదు. కాబట్టి తండ్రి కోపంలో శాశ్వతమైన తీర్పులు ఇవ్వకుండా ఉండటం అవసరం.
66
నువ్వు నా కొడుకువైతే ఇలా చేసేవాడివి కాదనడం
కొన్ని మాటలు పిల్లవాడిలో తండ్రి ప్రేమను కోల్పోతాననే భయాన్ని కలిగించవచ్చు. తండ్రి ప్రేమ షరతులతో కూడుకున్నది కాదనే నమ్మకం పిల్లవాడికి ఉంటే, అతను భయపడకుండా తన సమస్యలను తండ్రితో చెప్పగలుగుతాడు. తప్పు చేసినప్పుడు కొడుకును భయపెట్టడం కంటే, అతనిలో బాధ్యతను పెంచడం ముఖ్యమనే విషయాన్ని తండ్రి గుర్తుంచుకోవాలి.