Telugu Saying: పక్కింట్లో చిన్న గొడవ జరిగినా తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. కాలం మారినా, మనుషుల ఈ స్వభావం మాత్రం మారలేదు. ఇలా మనుషుల మనస్తత్వాన్ని ప్రతిబింబించే సామెతే “పక్కింటి పోరు పండగంత వేడుకంట.” అసలు ఈ సామెత ఎలా పుట్టిందో తెలుసుకుందాం.
సామెతలు.. తరతరాల అనుభవాలకు ప్రతిరూపాలు. అలాంటి సామెతల్లో ఒకటి “పక్కింటి పోరు పండగంత వేడుకంట”. ఈ ఒక్క వాక్యంలోనే మనుషుల స్వభావం, సమాజం తీరు, ఆసక్తులు, బలహీనతలు అన్నీ దాగి ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ సామెత ఎప్పుడో పుట్టినా, దాని అసలు అర్థం మాత్రం నేటి కాలంలో మరింత స్పష్టంగా కనిపిస్తోంది.
24
ఈ సామెత ఎలా వచ్చిందంటే?
ఈ సామెత ఎలా పుట్టిందో ఒకప్పటి గ్రామీణ జీవన విధానాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. ఒకప్పుడు గ్రామాల్లో ఇళ్లు దగ్గర దగ్గరగా ఉండేవి. ఒక ఇంట్లో గొడవ జరిగితే, ఆ శబ్దం చుట్టుపక్కల వారికి వినిపించేది. కొద్దిసేపట్లోనే అక్కడ జనం గుమిగూడేవారు. ఎవరు గొడవ పడుతున్నారు? ఎందుకు పడుతున్నారు? చివరకి ఏమవుతుంది? అనే ఆసక్తి అందరిలో ఉండేది. కొందరు సర్దిచెప్పడానికి వస్తే.. మరికొందరు మాత్రం ఆ గొడవను వినోదంలా చూస్తూ నిలబడేవారు. ఆ దృశ్యాలనే గమనించిన మన పూర్వీకులు “పక్కింటి పోరు పండగంత వేడుకంట” అనే సామెతను సృష్టించి ఉంటారు.
34
నేటి కాలంలో ఈ సామెత ప్రాధాన్యం
సాధారణంగా మనిషికి ఇతరుల జీవితాలపై ఆసక్తి ఉంటుంది. తన ఇంట్లో అన్నీ ప్రశాంతంగా ఉన్నప్పుడు, పక్కింట్లో జరిగే చిన్న సంఘటన కూడా పెద్ద విషయంలా కనిపిస్తుంది. అందుకే ఇతరుల సమస్యలు, వివాదాలు, గొడవలు చాలామందికి ఆసక్తికరంగా అనిపిస్తాయి. అయితే ఈ సామెతను కేవలం పాతకాలానికే పరిమితం చేయలేం. నేటి సోషల్ మీడియా యుగంలో దీని ప్రాధాన్యం మరింత పెరిగింది. ఒకప్పుడు జనాలు పక్కింటి పోరు మాత్రమే చూడగలిగేవారు. కానీ ఇప్పుడు ప్రపంచం మీద జరిగే అన్నీ గొడవలను ఫోన్ లో చూస్తున్నారు, వాటిపై చర్చలు పెడుతున్నారు. కొన్నిసార్లు అసలు సమస్య కంటే దానిపై జరిగే చర్చే పెద్దదిగా మారుతోంది.
నిజానికి ఈ సామెతలో విమర్శ మాత్రమే లేదు. ఒక హెచ్చరిక కూడా ఉంది. ఇతరుల సమస్యలను వేడుకగా చూడడం కంటే, వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఇది సూచిస్తుంది. ఎందుకంటే ఈ రోజు పక్కింట్లో వచ్చిన సమస్య రేపు మన ఇంట్లో కూడా రావచ్చు. అందుకే ఇతరుల కష్టాలను చూసి ఆనందించడం కాకుండా, అర్థం చేసుకోవడం, అవసరమైతే సహాయం చేయడం ఉత్తమం.