
ప్రతి వ్యక్తికి పుస్తకాలను చదివే అలవాటు ఖచ్చితంగా ఉండాలని కొంతమంది చెప్తుంటారు. అంతెందుకు తల్లిదండ్రులు కూడా పిల్లల కథలు చదివి.. వారి కోసం పుస్తకాలతో స్నేహం చేస్తారు. కానీ చదవడం వల్ల పిల్లలకు మాత్రమే కాదు పెద్దలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. పుస్తకాలు చదివే అలవాటు వారి జ్ఞానాన్ని పెంచుతుందని మనందరికీ తెలుసు. అంతేకాదు ఇది ఎన్నో మానసిక సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
క్రమం తప్పకుండా చదివే వ్యక్తులు తక్కువగా ఒత్తిడికి గురవుతారని నిపుణులు చెబుతున్నారు. మీరు ఒక పుస్తకం లేదా ఒక కథను చదువుతున్నప్పుడు దానీలోనే మునిగిపోతారు. ఇలాంటి సమయంలో పూర్తిగా బయటి విషయాలను మర్చిపోతారు. అలాగే ఎక్కడో ఒక చోట మీరు ఆ కథతో కనెక్ట్ అవుతారు. దీంతో మీ సమస్యలన్నీ కాసేపు పక్కకు వెళతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. అందుకే ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే వారు పుస్తకాన్ని చదవని మానసిక నిపుణులు సలహానిస్తున్నారు.
చదవడం వల్ల కలిగే గొప్ప ప్రయోజనాల్లో ఒకటేంటంటే.. మీరు జీవితాన్ని చూసే విధానం మారుతుంది. పుస్తకాలను చదవడం వల్ల మీ నాలెడ్జ్ బేస్ పెరుగుతుంది. ఒక పుస్తకం ఎన్నో కొత్త కొత్త విషయాలను నేర్పిస్తుంది. తెలిసేలా చేస్తుంది. అలాగే మీ మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
చాలా మందికి ఒత్తిడి అతి అలోచన వల్లే వస్తుంది. ఈ అతి ఆలోచన మనిషిని అన్ని విధాలా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మానసిక ఆరోగ్యమే కాదు.. శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ముఖ్యంగా జీవితంలో అన్ని పరాజయాలే చూసిన వారు మానసికంగా బాగా క్రుంగిపోతారు. ఇలాంటి వారు స్ఫూర్తిదాయకమైన కథలను చదివితే మంచిది. వీటివల్ల మనం పడుతున్న కష్టం ఎన్నటికైనా మనల్ని వీడి పోతుందని అర్థం అవుతుంది. ఇది మీ మానసిక ఆరోగ్య౦పై సానుకూల ప్రభావ౦ చూపిస్తు౦ది.
ఆలోచనా పరిధిని పెంచుతుంది
చదివే అలవాటు మీ ఆలోచనా పరిధిని పెంచుతుంది. సాధారణంగా చాలా మంది లైఫ్ లో ఏదైనా గడ్డు పరిస్థితి లేదా.. సమస్య వచ్చినప్పుడు కొంపలు మునిగిపోయినట్టు.. బాధ, దుఖం, నిరాశతో ఉంటారు. మానసికంగా బలహీనంగా మారిపోతారు. కానీ చదివే అలవాటున్న వ్యక్తులు ఎలాంటి సిచ్యువేశన్ వచ్చినా మానసికంగా మరింత స్ట్రాంగ్ గా ఉంటారట.
చదవడం వల్ల జ్ఞానం పెరుగుతంది. దీనివల్ల ఒక వ్యక్తి పరిస్థితిని మరింత మెరుగ్గా అంచనా వేయగలుగుతాడు. ఎందుకంటే చదివే అలవాటు వల్ల అతని ఆలోచనా పరిధి పెరుగుతుంది. అతను తన పరిస్థితి గురించి, సమస్య పరిష్కార మార్గం గురించి పుస్తకంలో ఎక్కడో ఒకట చదివే ఉంటాడు. సమస్య ఉన్నప్పుడు ఒత్తిడికి గురికావడానికి బదులు సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తేనే మీరు అనుకున్నది సాధిస్తారన్న విషయం ఇలాంటి వాళ్లకు బాగా తెలిసి ఉంటుంది.
మానసిక ఆరోగ్యం బాగుండాలంటే.. రెగ్యులర్ గా రోజులో కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. కానీ చాలా మంది విశ్రాంతి పేరుతో మొబైల్ లేదా టీవీలకు అత్తుక్కుపోతారు. కానీ స్క్రీన్ ను ఎక్కువ సేపు చూడట వల్ల కంటి ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం దెబ్బతింటాయి. అందుకే విశ్రాంతి సమయంలో నచ్చిన బుక్ ను చదివేయండి. ఇష్టమైన పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఆ వ్యక్తి చాలా ఆనందంగా ఉంటాడు. అలాగే చాలా రిలాక్స్ డ్ గా భావిస్తాడు.
ఒక పుస్తకాన్ని చదవడం అంటే ఒకేసారి మొత్తం పుస్తకాన్ని చదివేయమని కాదు. రోజూ కొన్ని పేజీలను మాత్రమే చదవాలి. అప్పుడే మీరు రిలాక్స్ గా ఫీలవుతారు. కాబట్టి ప్రతిరోజూ చదవడానికి కొంత సమయం తీసుకోండి. మీ మానసిక ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉండేలా చూసుకోండి. మానసిక ఆరోగ్యం బాగుంటేనే మీ మొత్తం శరీర ఆరోగ్యం బాగుంటుంది.
నిద్రపై సానుకూల ప్రభావం
చదివే అలవాటు వల్ల కలిగే ప్రయోజనాల్లో ఇదీ ఒకటి. పడుకునే ముందు ఏదైనా బుక్ చదవాలని చాలా మంది చెప్తుంటారు. నిత్రపోయే మందు బుక్ చదవడం వల్ల ఆ వ్యక్తి చాలా ప్రశాంతంగా, గాఢంగా నిద్రపోతాడు. మానసిక ఆరోగ్యం కోసం మంచి రాత్రి నిద్ర పొందడం చాలా ముఖ్యం మరి.