విటమిన్ డి గుండె జబ్బులను తగ్గిస్తుందా..?

First Published Jan 24, 2023, 10:49 AM IST

విటమిన్ డి కి, గుండె సంబంధిత సమస్యలకు మధ్య సంబంధం ఉందని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉన్నవారికి స్ట్రోక్, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
 

మన శరీరానికి విటమిన్ డి చాలా చాలా అవసరం. ఇది మన ఎముకలను బలంగా ఉంచుతుంది. బోలు ఎముకల వ్యాధిని తగ్గిస్తుంది. అలాగే మన రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా శరీరంలో అనేక ముఖ్యమైన పాత్రలను పోషిస్తుంది. ఒక పరిశోధన ప్రకారం.. విటమిన్ డి మన గుండెను, రక్త నాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. అయితే ఎవరి శరీరంలోనైతే విటమిన్ డి తక్కువ స్థాయిలో ఉంటుందో వారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలో తేలింది. ఈ విటమిన్ డి మన రక్తం స్వేచ్ఛగా ప్రవహించడానికి రక్త నాళాల గోడల పొరను మెరుగుపరుస్తుంది. అలాగే శరీర మంటను, దాని హానికరమైన ప్రభావాలను తగ్గించడానికి కూడా విటమిన్ డి సహాయపడుతుంది. 
 

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి గుండెపోటుతో పాటుగా, స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. మీకు తెలుసా..? విటమిన్ డి తక్కువ స్థాయిలో ఉంటే ప్రీ-డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. రక్తంలో విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉన్నవారికి డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల అధిక రక్తపోటు సమస్య వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని పరిశోధనల ప్రకారం.. విటమిన్ డి మాత్రలను  తీసుకోవడం వల్ల ఈ రక్తపోటు తగ్గుతుందని వెల్లడిస్తున్నాయి. ఇది  గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలను కూడా చాలా వరకు తగ్గుతుందని వెల్లడిస్తున్నాయి. 


దీర్ఘకాలిక గుండె వైఫల్యం తరచుగా విటమిన్ డి లోపంతో ముడిపడి ఉందని మరొక పరిశోధన చూపిస్తోంది. శరీరంలో మరీ తక్కువ విటమిన్ డి స్థాయిలు ఉండటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని పరిశోధకుల చెబుతున్నారు. వాస్తవానికి..  తక్కువ విటమిన్ డి స్థాయిలు ఉన్న గుండె వైఫల్యం ఉన్నవారు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ తెలిపింది. అయితే ఈ విటమిన్ డి లోపం సంకేతాలను గుర్తించడం చాలా కష్టం. కొంతమందిలో ఈ విటమిన్ డి లోపం లక్షణాలు కనిపించవు. మరికొంతమందికి మాత్రం నొప్పులు వస్తాయి. లేదా సాధారణం కంటే ఎక్కువగా అలసిపోతారు. విటమిన్ డి లేకపోవడం ఎముక నొప్పి, బలహీనత వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు ఈ విటమిన్ లోపం వల్ల నడవడానికి కూడా కష్టంగానే ఉంటుంది. 

vitamin d

విటమిన్ డి పుష్కలంగా ఉండే కొన్ని ఆహారాలు

కాలే
నారింజ
జున్ను
పుట్టగొడుగులు
సాల్మన్ చేపలు
గుడ్డు పచ్చసొన
ఆవు పాలు

Vitamin d

మీరు రోజూ తినే ఆహారం నుంచి మాత్రమే తగినంత విటమిన్ డి పొందడం కష్టం. అందుకే పైన తెలిపిన ఆహారాలను రోజూ ఒక్కదాన్నైనా తీసుకోండి. ఈ ఆహారాల్లో విటమిన్ విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఈ ఆహారాలను పుష్కలంగా తినడం వల్ల మీలో విటమిన్ డి లోపం పోతుంది. అంతేకాదు ఈ ఆహారాల్లో ఇతర పోషకాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. సూర్య రశ్మి ద్వారా కూడా విటమిన్ డిని పొందొచ్చు.

click me!