Current Shock: కరెంట్ షాక్ ఎప్పుడు కొడుతుందో చెప్పలేదు. ఇంట్లో లూజ్ కనెక్షన్లు ఉన్నా కూడా కొట్టే అవకాశం ఉంటుంది. మీకు కానీ లేదా మీ ముందు ఎవరికైనా కరెంట్ షాక్ తగిలితే వెంటనే కొన్ని పనులు చేయాలి. ఆ పనులేంటో తెలుసుకోండి.
విద్యుత్ ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో అంచనా వేయలేము. తడి నేల, తడిచేతులతో విద్యుత్ పరికరాలు లేదా వైర్లు తాకడం చాలా ప్రమాదకరం. ముఖ్యంగా ఎవరికైనా కరెంట్ షాక్ తగిలి వైర్‌కు చేయి అంటుకుపోతే.. వెంటనే అతడిని మీ చేతితో లాగకూడదు. అలా చేస్తే కరెంట్ మీ శరీరంలోకి కూడా ప్రవహించే ప్రమాదం ఉంటుంది. ముందుగా మెయిన్ స్విచ్, ప్లగ్ లేదా విద్యుత్ సరఫరాను సురక్షితంగా ఆపే ప్రయత్నం చేయాలి. విద్యుత్ సరఫరా ఆపే అవకాశం లేకపోతే బాధితుడిని నేరుగా తాకకుండా దూరంగా ఉండాలి. హై వోల్టేజ్ వైర్లు, మంటలు లేదా స్పార్కులు కనిపిస్తే దగ్గరకు వెళ్లకుండా వెంటనే అత్యవసర సహాయం తీసుకోవాలి.
23
వెంటనే వైద్యుడి దగ్గరికి
కరెంట్ సరఫరా పూర్తిగా ఆగిన తర్వాతే బాధితుడి దగ్గరకు వెళ్లాలి. వ్యక్తి స్పృహలో ఉన్నాడా, సరిగ్గా శ్వాస తీసుకుంటున్నాడా గమనించాలి. స్పందించకపోవడం లేదా శ్వాస లేకపోవడం కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం కోరాలి. కరెంట్ షాక్ తర్వాత బయటకు చిన్న గాయం మాత్రమే కనిపించినా.. లోపల శరీరానికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. గుండె కొట్టుకునే విధానంలో మార్పులు, కాలిన గాయాలు, నరాల సమస్యలు రావచ్చు. ఛాతిలో నొప్పి, గుండె దడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ కోల్పోవడం, ఎక్కువ నొప్పి లేదా కాలిన గాయం ఉంటే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.
33
ఈ జాగ్రత్తలు తీసుకోండి
కరెంట్ ప్రమాదం జరగకుండా ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తడి చేతులతో స్విచ్‌లు, ప్లగ్‌లు లేదా విద్యుత్ పరికరాలను తాకకూడదు. వర్షం సమయంలో బయట కనిపించే విద్యుత్ వైర్లు, ఇనుప వస్తువులు, విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలి. నేలపై నీరు ఉన్నప్పుడు విద్యుత్ పరికరాలను వాడకపోవడం మంచిది. పిల్లలను తెరిచి ఉన్న సాకెట్లు, దెబ్బతిన్న వైర్లకు దూరంగా ఉంచడం మర్చిపోవద్దు. కరెంట్ షాక్ తగిలిన వ్యక్తికి వెంటనే ఇంటి చిట్కాలు చేయడం కంటే ముందుగా విద్యుత్ సరఫరాను ఆపి, వ్యక్తి పరిస్థితిని గమనించి, అవసరమైతే వెంటనే వైద్య సహాయం అందించడం అత్యంత ముఖ్యం.