కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే 6 నెలలైనా పాడవదు..

First Published | Aug 15, 2024, 11:03 AM IST

దేవుడి పూజకైనా, వంటింట్లో కూరల్లోకైనా కొబ్బరి చాలా అవసరం.. చాలా మంది లేడీస్‌ కొబ్బరిని ఫ్రిజ్‌లో నిల్వ చేయడానికే ఇష్టపడతారు. అయితే దీనికంటే బెస్ట్‌ చిట్కాలు ఉపయోగించి కొబ్బరిని నిల్వ చేయవచ్చు. అవేంటో తెలుసుకోండి.. ఎప్పటికప్పడు తాజా కొబ్బరిని ఉపయోగించి ఆరోగ్యంగా ఉండండి..

మార్కెట్‌లో కొబ్బరి కాయ ధరలు ఒక్కోసారి సడన్‌గా పెరిగిపోతుంటాయి. ముఖ్యంగా ఏదైనా పండగలొచ్చినప్పుడు వాటి ధర రెట్టింపు అయిపోతుంది. అందుకే చాలా మంది కొబ్బరి కాయలను ముందుగానే కొని ఇళ్లలో నిల్వ ఉంచుతారు. అయితే కొన్ని రోజులకే అవి బూజుపట్టి పాడైపోతుంటాయి. కొబ్బరి కాయను పగలగొట్టిన తర్వాత రెండు చెక్కలను నిల్వ చేయడానికి చాలా మంది ఫ్రిజ్‌ను ఉపయోగిస్తారు. అయితే అవి జిగురుగా మారిపోయి వంటకు ఉపయోగించడానికి పనికి రాకుండాపోతాయి. 
 

1. కొబ్బరి కాయలను ఇలా నిల్వ చేయండి..

సాధారణంగా కొబ్బరి కాయలు రెండు రకాలు. ముదురు, లేత కాయలు. ముదురు కాయలు సాధారణంగా త్వరగా పాడవవు. మరి లేత కాయలు మాత్రం మూడు కళ్లు ఉన్న కుచ్చు వద్ద బూజు పట్టి పాడైపోతుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే కొబ్బరి కాయలను ఒలిచాక కాయర్‌(కొబ్బరి ముచ్చుక) ఉన్న సైడ్‌ పైకి వచ్చేలా భద్ర పరచాలి. అంటే మూడు కళ్లు ఉన్న చోట నీరు నిల్వ ఉండకుండా ఉంటే కాయ 6 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. 
 


2. కొబ్బరి చెక్కలను ఇలా జాగ్రత్త చేయండి..

ఆలయాల్లో ఇచ్చే కొబ్బరి చెక్క ప్రసాదాలను జాగ్రత్త చేయడం ఇంట్లో ఉండే ఆడవాళ్లకు చాలా పెద్ద టాస్క్‌. ఒక చెక్కతో చట్నీలు చేయలేక ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు.  ఇళ్లలో కూరల్లో వాడేందుకు కొబ్బరి కాయ పగలగొట్టి మిగిలిన చెక్కను జాగ్రత్త చేయడమూ పెద్ద పనే.. ఫ్రిజ్‌లో ఒకటి, రెండు రోజులు మాత్రమే బాగుంటుంది. అయితే కొబ్బరి చెక్కలను తెల్లటి గుడ్డలో కట్టి తర్వాత ఒక గిన్నెలో నీరు నింపి అందులో ఉంచాలి. అయితే రోజులకు మూడు సార్లు నీటిని మార్చాలని మాత్రం మర్చిపోవద్దు.  ఇలా చేస్తే కొబ్బరి త్వరగా పాడవదు. తురిమిన కొబ్బరిని సైతం ఇదే విధంగా నిల్వ చేయవచ్చు. అంతేకాకుండా కొబ్బరి చిప్పకు కొద్దిగా ఉప్పు రాసి కూడా నిల్వ చేస్తే పాడవకుండా ఉంటుంది. 
 

3. ఫ్రిజ్‌లో ఎలా నిల్వ చేయాలంటే..

మీ ఇంట్లో ఫ్రిజ్‌ ఉంటే తురిమిన కొబ్బరిని ఫ్రీజర్‌లో గాలి చొరబడకుండా పెడితే పాడవకుండా ఉంటుంది. అదేవిధంగా కొబ్బరి ముక్కలను నిల్వ చేయాలంటే వెండి గిన్నెలో నీళ్లు పోసి అందులో ముక్కలు వేసి ఫ్రిజ్‌లో ఎక్కడ పెట్టినా తాజాగానే ఉంటాయి.   
 

Latest Videos

click me!