Parenting: పిల్లలు భయపడకుండా మాట్లాడాలంటే.. పేరెంట్స్ చేయాల్సిన 5 పనులివే!

Published : Oct 21, 2026, 01:50 PM IST

Parenting: పిల్లలు తమ మనసులోని మాటను ధైర్యంగా చెప్పగలుగుతున్నారా? లేక భయపడుతున్నారా? చాలామంది పిల్లలు పేరెంట్స్ ఏమోంటారో అని కొన్ని విషయాలను మనసులోనే దాచుకుంటారు. మరి పిల్లలు భయపడకుండా మనసులోని మాటను చెప్పాలంటే పేరెంట్స్ ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.

PREV
16
పిల్లల భయపడకుండా మాట్లాడాలంటే ఏం చేయాలి?

పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. కొత్త వ్యక్తులతో మాట్లాడటం, తమ అభిప్రాయాలను చెప్పడం, తప్పులను అంగీకరించడం, సమస్యలను పరిష్కరించుకోవడం వంటి నైపుణ్యాలు వారిలో క్రమంగా అభివృద్ధి చెందుతాయి. అయితే కొంతమంది పిల్లలు తమ మనసులోని మాటను బయటకు చెప్పడానికి భయపడుతుంటారు. ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు ఏమంటారోనని ఆందోళన చెందుతారు. తమకు ఎదురైన సమస్యలను చెప్పకుండా దాచిపెడతారు. మరికొందరు తమకు నచ్చని విషయాలను కూడా ఎదుటివారికి చెప్పలేక మౌనంగా ఉండిపోతారు. మరి పిల్లలు తల్లిదండ్రులతో ఏ విషయాన్ని అయినా స్వేచ్ఛగా చెప్పాలంటే పేరెంట్స్ ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

26
పిల్లలు చెప్పేది శ్రద్ధగా వినడం

పిల్లలు తమకు ఎదురైన విషయాలను తల్లిదండ్రులతో పంచుకోవాలంటే ముందుగా వారి మాటలకు విలువ ఇస్తున్నారనే నమ్మకం కలగాలి. పిల్లలు స్కూల్లో జరిగిన సంఘటన గురించి చెబుతున్నప్పుడు ఫోన్ చూడటం, టీవీ చూడటం లేదా మధ్యలోనే వారి మాటలను ఆపేయడం వంటివి చేయకూడదు. వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. ఇలా చేయడం వల్ల తమ మాటలను తల్లిదండ్రులు అర్థం చేసుకుంటున్నారనే భావన పిల్లల్లో పెరుగుతుంది. భవిష్యత్తులో ఏదైనా సమస్య ఎదురైనా దాన్ని దాచిపెట్టకుండా మీతో పంచుకోవడానికి ఇష్టపడతారు.

36
తప్పులు చేసినప్పుడు తిట్టకుండా..

పిల్లలు తప్పులు చేయడం సహజం. కొత్త విషయాలు నేర్చుకునే క్రమంలో వారు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అయితే ప్రతి చిన్న తప్పుకూ గట్టిగా తిట్టడం, ఇతర పిల్లలతో పోల్చడం, అవమానించడం వంటివి చేస్తే పిల్లల్లో భయం పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో తాము చేసిన తప్పులను అంగీకరించడానికి కూడా వారు వెనుకాడతారు. తప్పు జరిగినప్పుడు దాని గురించి ప్రశాంతంగా మాట్లాడి, మరోసారి అలాంటి పొరపాటు జరగకుండా ఏం చేయాలో వివరించాలి. పేరెంట్స్ తమను అవమానించరనే నమ్మకం కలిగితే పిల్లలు నిజాయతీగా మాట్లాడే అవకాశం పెరుగుతుంది.

46
పిల్లల భావాలను తక్కువగా చూడకూడదు

పిల్లలు బాధపడినప్పుడు లేదా భయపడినప్పుడు కొంతమంది పెద్దలు వాటిని చిన్న విషయాలుగా భావిస్తారు. “ఇంత చిన్నదానికే ఏడుస్తావా?”, “దీనికే భయపడితే ఎలా?”, వంటి మాటలు అంటుంటారు. ఇలాంటి మాటలు పిల్లలకు తమ భావాలను బయటపెట్టకూడదనే భావన కలిగించవచ్చు. పిల్లలు భయపడుతున్నా, బాధపడుతున్నా వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. పిల్లలు ఏడ్చినప్పుడు లేదా భయపడినప్పుడు వెంటనే ఆపేయాలని ఒత్తిడి చేయకుండా, తమ భావాలను మాటల్లో చెప్పడానికి ప్రోత్సహించాలి.

56
స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం కల్పించడం

పిల్లలు ధైర్యంగా మాట్లాడాలంటే ఇంటి వాతావరణం ఎంతో ముఖ్యం. ఇంట్లో పెద్దలు ఎప్పుడూ కోపంగా ఉండటం, పిల్లలు ప్రశ్నలు అడిగినప్పుడు విసుక్కోవడం, వారి అభిప్రాయాలను పట్టించుకోకపోవడం వంటివి పిల్లలు మాట్లాడటానికి వెనుకాడేలా చేయవచ్చు. అందుకే రోజూ కొంత సమయాన్ని పిల్లలతో మాట్లాడటానికి కేటాయించాలి. కుటుంబానికి సంబంధించిన చిన్న చిన్న నిర్ణయాల్లో వారి అభిప్రాయాన్ని అడగాలి. అలాగే పిల్లలు పెద్దలతో విభేదించినప్పుడు వెంటనే కోప్పడకుండా, తమ అభిప్రాయాన్ని గౌరవంగా ఎలా చెప్పాలో నేర్పించాలి. ఇలా చేస్తే ఇంట్లో తమ మాటకు విలువ ఉందనే నమ్మకం పిల్లల్లో ఏర్పడుతుంది.

66
ఇతరులతో పోల్చకుండా ధైర్యం చెప్పడం

ప్రతి పిల్లవాడి వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, మాట్లాడే తీరు వేర్వేరుగా ఉంటాయి. కొంతమంది పిల్లలు అందరితో త్వరగా కలిసిపోతారు. మరికొందరు కొత్త వ్యక్తులతో మాట్లాడటానికి కొంత సమయం తీసుకుంటారు. అందువల్ల పిల్లలను ఇతరులతో పోల్చడం మంచిది కాదు. పిల్లలు తప్పు మాట్లాడితే ఎగతాళి చేయకుండా, అవసరమైతే సరైన విధంగా ఎలా చెప్పాలో నేర్పించాలి. ఇంట్లో చిన్న చిన్న ఆటల ద్వారా ఇతరులతో ఎలా మాట్లాడాలి, సహాయం ఎలా అడగాలి, నచ్చని విషయానికి మర్యాదగా ఎలా నో చెప్పాలి వంటివి నేర్పించవచ్చు. ఇలా క్రమంగా ప్రోత్సహిస్తే పిల్లలు కొత్త పరిస్థితులను ఎదుర్కోవడానికి ధైర్యం తెచ్చుకుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories