Banana Plant In Pot: ఇంట్లో అరటి మొక్క ఉంటే చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క పెంచడానికి పెద్ద స్థలం కావాలని చాలామంది అనుకుంటారు. కానీ కుండీలో కూడా అరటి మొక్కను ఈజీగా పెంచుకోవచ్చు. అందుకోసం పాటించాల్సిన టిప్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
అరటి మొక్క పెంచాలంటే చాలా స్థలం కావాలని అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడ్డట్లే. నిజానికి ఇంటి ఆవరణలో లేదా డాబా మీద పెద్ద కుండీలో కూడా అరటిని పెంచొచ్చు. ముఖ్యంగా తక్కువ ఎత్తు పెరిగే అరటి రకాలను ఎంచుకోవడం మంచిది. అన్ని అరటి రకాలు కుండీల్లో పెంచడానికి పనికిరావు. బాగా ఎత్తు పెరిగే రకాలను కుండీల్లో మెయింటైన్ చేయడం కష్టం. అలాగే తక్కువ ఎత్తు పెరిగే రకమైనా సరే, దాని వేర్లు, ఆకులు పెరగడానికి తగినంత స్థలం కావాలి. నర్సరీలో మొక్క కొనేటప్పుడే అది ఏ రకం, ఎంత ఎత్తు పెరుగుతుంది, పండ్లు ఇస్తుందా లేదా అని అడిగి తెలుసుకోవడం మంచిది.
26
కుండీ ఎంపిక
అరటి మొక్కను పెంచడానికి చిన్న పూల కుండీలు సరిపోవు. మొదట్లో చిన్న కుండీలో నాటినా, మొక్క పెరిగే కొద్దీ వేర్లకు సరిపడా పెద్ద కుండీలోకి మార్చాల్సి ఉంటుంది. పండ్లు వచ్చేలా పెంచాలనుకుంటే, కనీసం 50-60 సెం.మీ వెడల్పు, దానికి తగ్గ లోతు ఉన్న పెద్ద కుండీని తీసుకోవాలి. అరటి రకాన్ని బట్టి ఇంకా పెద్ద కుండీ కూడా అవసరం పడొచ్చు. అదనపు నీరు బయటకు పోవడానికి కుండీ అడుగున కచ్చితంగా రంధ్రాలు ఉండాలి. డాబా మీద పెడుతున్నప్పుడు మట్టి, నీరు, మొక్క మొత్తం బరువును దృష్టిలో ఉంచుకోవాలి.
36
ఎలాంటి మట్టి ఎంచుకోవాలంటే?
అరటి మొక్కకు పోషకాలు ఎక్కువగా ఉండే మట్టి కావాలి. అలాగే మట్టిలో తేమ ఉండాలి కానీ నీరు నిలిచిపోకూడదు. తోట మట్టి, బాగా మాగిన పశువుల ఎరువు లేదా కంపోస్ట్, కోకోపిట్ కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. మట్టి మరీ గట్టిగా లేకుండా, నీరు ఈజీగా బయటకు వెళ్లేలా ఉండాలి. కుండీలో మట్టి నింపాక మొక్కను నాటి, మొదలు చుట్టూ మట్టిని నెమ్మదిగా అదిమి నీళ్లు పోయాలి. మొక్కను మరీ లోతుగా పాతకూడదు.
అరటి చెట్టు బాగా పెరగాలంటే సూర్యరశ్మి చాలా ముఖ్యం. రోజుకు 6-8 గంటల పాటు నేరుగా ఎండ తగిలే చోట కుండీని పెట్టాలి. కుండీలోని మట్టి త్వరగా ఆరిపోతుంది కాబట్టి, తేమను తరచుగా చెక్ చేస్తుండాలి. పై మట్టి ఆరిపోతున్నప్పుడు తగినంత నీరు పోయాలి. అలాగని కుండీలో నీరు నిలిచిపోయేలా చేయకూడదు. అరటికి పోషకాలు ఎక్కువగా అవసరం కాబట్టి, కంపోస్ట్, ఇతర ఎరువులను వాడుకోవచ్చు. మొక్క ఎదుగుదలను బట్టి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి.
56
కోతకు రావడానికి ఎంత సమయం పడుతుంది?
కుండీలో అరటి మొక్క నాటిన కొద్ది నెలల్లోనే పండ్లు రావు. అరటి రకం, వాతావరణం, సూర్యరశ్మి, వేర్ల ఎదుగుదల, పోషకాలను బట్టే పువ్వు, కాయలు వస్తాయి. సాధారణంగా అరటి నాటినప్పటి నుంచి కోతకు రావడానికి 10 నుంచి 24 నెలల సమయం పడుతుంది. కుండీలో పెంచేటప్పుడు ఈ సమయం మారొచ్చు. మొక్క బాగా పెరిగాక అరటి పువ్వు వచ్చి, దాని నుంచి కాయలు వస్తాయి. గెల వచ్చాక మొక్క వంగిపోకుండా సపోర్ట్ ఇవ్వాలి.
66
కొత్త పిలకలను పెంచడం ద్వారా..
అరటి చెట్టు ఏపుగా పెరిగినా పండ్లు రాకపోతే, ముందుగా దానికి తగినంత ఎండ తగులుతుందో లేదో చెక్ చేయాలి. కుండీ మరీ చిన్నదిగా ఉండటం, పోషకాల లోపం, నీరు నిలిచిపోవడం లాంటివి కూడా మొక్క ఎదుగుదలను దెబ్బతీస్తాయి. అలాగే, ఒకసారి గెల వచ్చాక ఆ చెట్టుకు మళ్లీ కాయలు రావు. దాని మొదట్లో వచ్చే కొత్త పిలకలను పెంచితేనే తర్వాతి గెలను పొందవచ్చు. సరైన రకాన్ని ఎంచుకుని, జాగ్రత్తగా చూసుకుంటే ఇంట్లో కుండీలో కూడా అరటి పండ్లను పండించవచ్చు.