House Decorate: ఖ‌ర్చులేకుండా.. ఇంటిని ఇలా అందంగా తీర్చిదిద్దు కోవ‌చ్చు తెలుసా.. !

First Published Jan 12, 2022, 1:25 PM IST

 House Decorate: అందరిలో ది బెస్ట్ అనిపించుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులో ఎవరికి వారు తమ ఇళ్లు అందంగా కనిపించాలని కోరుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే ఇంటి అలంకరణ కోసం ఖరీదైన వస్తువులతో నింపడం అందరికీ సాధ్యపడనిది. కానీ ఖరీదైన వస్తువులే ఇంటి అలంకరణను నిర్ణయిస్తాయనుకోవడం మన పొరపాటే. ఎందుకంటారా.. ఇంటిని ఉన్నదాంట్లోనే ఇంద్రభవనంలా మార్చేయడానికి డబ్బులే అక్కర్లేదు. ఉపాయముంటే చాలు. ఇంటిని అందంగా.. చూస్తే వావ్ అనిపించేలా చేయాలంటే మనకు ఉండాల్సింది కేవలం ఉపాయాలేనండి. వీటికి మీరు పెద్దగా కష్టపడిపోవక్కర్లేదు. కొన్ని సింపుల్ ట్రిక్స్ ను పాటిస్తే సరి. పదండి మరి ఆ టిప్స్ ఏంటో చూద్దాం.
 

ఇంటిని మరింత ఆకర్షణీయంగా మార్చడంలో దిండ్లు బాగా ఉపయోగపడతాయి. డిఫరెంట్ కలర్స్ లో ఉన్న దిండ్లు ఇంటిని మరింత అందంగా మార్చగలవు. పొడవుగా ఉన్న సోఫా పై  వివిధ కలర్లలో ఉన్న దిండ్లను పెట్టండి. అయితే సోఫా కలర్ కు పూర్తి భిన్నంగా దిండ్ల కలర్లు ఉండేలా చూడాలి. ఇలా చేస్తే సరికొత్త లుక్ మీ ఇంటిని సంతరించుకుంటుంది. 

ఫర్నీచర్ ను మారిస్తే కూడా మీ ఇంటి కళ ఆటోమెటిక్ గా మారుతుంది.  ఇది సింపుల్ ట్రిక్ అయినా ఇంటిని బ్యూటీఫుల్ గా మార్చడంలో ఎంతో ఉపయోగపడుతుంది. టేబుల్, సోఫా, బెడ్, డ్రస్సర్ ను కదిలిస్తే మీ ఇళ్లు ఎంత అందంగా కనిపిస్తుందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అలాగే ఆ గది కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. దీంతో మీకు ఖచ్చితంగా తాజాగా అనిపిస్తుంది.

షెల్ఫ్ లల్లో అలంకరణ కూడా మీ ఇంటి అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. అరలలో వస్తువులు అమర్చే విధానం ఒక క్రమ పద్దతి ప్రకారం ఉండాలి. ఉదాహరణకు అరలలో రెండు వస్తువులకు బదులు బేసీ సంఖ్యలో అంటే మూడు లేదా ఐదు వస్తువులను ఉంచితే ఇల్లు మరింత ఆకర్షణీయంగా మారుతుంది. బుక్స్ ను లేదా ఫోటో ఫ్రేమ్ లు, వస్తువులను బేసీ సంఖ్యలో అమర్చాలి. ఆ తర్వాత వచ్చే తేడాను చూసి మీరే ఆశ్చర్యపోతారు.

ఇంటి అలంకరణకే కాకుండా మనకు జ్ఞాపకాలను అందిస్తాయి ఫోటోలు. అందుకే మీ హాలులో మీ కుటుంబ సభ్యులందరూ కలిసి దిగిన ఫోటోలను పెట్టండి. అయితే ఆ ఫోటో ఫ్రేమ్ ల రంగు ఒకే విధంగా ఉండేలా చేయాలి. వీలైతే ఎన్ని ఫోటోస్ ఉంటే వాటన్నింటికీ ఒకే కలర్ పెయింట్ వేయండి. అది బ్లాక్ కలర్ అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే బ్లాక్ ఫ్రేమ్ వైట్ కలర్ ఫోటోలు గోడకు తగిలిస్తే గోడలు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

పండ్లు ఆరోగ్యానికే కాదు ఇంటి అలంకరణకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. అందులో సిట్రస్ పండ్లు ఎంతో మేలు. ఇవి ఉన్న చోట కొత్త శోభ సంతరించుకుంటుంది. అవి ఉన్న గది రిఫ్రెష్ గా కనిపించేలా చేయడంతో పాటుగా తాజా ఫీలింగ్ ను కలిగిస్తాయి. సో ఒక గ్లాస్ పాత్రలో సిట్రస్ పండ్లను పెట్టండి.

మీ గదిలో పెద్ద అద్దం కూడా అలంకరణగా బాగా ఉపయోగపడుతుంది. ఈ గ్లాస్ మీ ఇంటిని ప్రకాశవంతంగా చేయడంతో పాటుగా ఆ గది పెద్దదిగా ఉందనే భ్రమను కలిగిస్తుంది. సో మీ గది లో పెద్ద అద్దాన్ని తగిలించి తేడాను చూడండి.
 

click me!