Hair Wash: జుట్టు ఆరోగ్యంగా, పొడవుగా ఎదగాలని అందరికీ ఉంటుంది. అయితే వేసవిలో మాత్రం జుట్టు సమస్యలు ఎక్కువవుతాయి. వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలనే సందేహం కూడా ఎక్కువ మందిలో ఉంటుంది. వేసవిలో తలస్నానం ఎన్నిసార్లు చేయాలో తెలుసుకోండి.
జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. దీనికోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అయినా కూడా జుట్టు రాలిపోవడం వంటివి జరుగుతాయి. వేసవిలో చాలామందికి వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేయాలనే సందేహం ఉంటుంది. కొందరు ప్రతిరోజు షాంపూ చేస్తారు. మరికొందరు రెండు మూడు రోజులకు ఒకసారి షాంపూతో తలస్నానం చేస్తారు. నిజానికి అందరికీ ఒకే రూల్ వర్తించదని చెబుతున్నారు చర్మ నిపుణులు. జుట్టుతత్వం, వాతావరణం, చెమట, తలపై ఉన్న మాడు పరిస్థితిని బట్టి ఎన్నిసార్లు తలస్నానం చేయాలి అనేది ఆధారపడి ఉంటుందని వివరిస్తున్నారు. సరైన పద్ధతిలో తలను శుభ్రం చేయకపోతే చుండ్రు, దురద, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. జుట్టు షాంపూ అధికంగా చేసిన కూడా జుట్టు పొడి బారిపోయే ప్రమాదం ఉంటుంది.
24
ఆయిలీ జుట్టు ఉంటే..
కొందరికి హెయిర్ ఆయిలీగా ఉంటుంది. స్కాల్ప్ పై వారికి సహజంగానే నూనె ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అలాంటి జుట్టు త్వరగా జిడ్డుగా మారిపోతుంది. దుమ్ము, కాలుష్యం కూడా ఆ జుట్టుపై త్వరగా అతుక్కుంటాయి. కాబట్టి వీళ్ళు ప్రతి రెండు రోజులకు ఒకసారి షాంపుతో తలస్నానం చేస్తే మంచిది. ముఖ్యంగా వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది. కాబట్టి మాడును శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. జిమ్ కు వెళ్లే వాళ్ళు, బయట ఎక్కువ సేపు తిరిగేవాళ్లు, బైక్ మీద ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా తరచుగా తలస్నానం చేయాలి. లేకపోతే చెమట కారణంగా మాడుపై బ్యాక్టీరియా పెరిగి, దురద, చుండ్రు వంటి సమస్యలు వస్తాయి. బలమైన కెమికల్స్ ఉన్న షాంపూను వాడకూడదు మైండ్ షాంపూ లేదా సల్ఫేట్ ఫ్రీ షాంపూను వాడడం మంచిది.
34
మీది పొడిజుట్టు అయితే
పొడి జుట్టు,ఉంగరాల జుట్టు ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువసార్లు షాంపూ చేయకూడదు. అలాంటి జుట్టులో తేమ తక్కువగా ఉంటుంది. తరచూ తలస్నానం చేస్తే ఆ తేమ కూడా తగ్గి జుట్టు మరింత పొడిగా కనిపిస్తుంది. కొందరికి జుట్టు చివర్లు చిట్లిపోతాయి. అలాంటి వాళ్ళు వారానికి రెండు లేదా మూడుసార్లు తలస్నానం చేయాలి. కొన్నిసార్లు వారానికి ఒక్కసారి కడిగినా చాలనిపిస్తుంది. హెయిర్ వాష్ చేసిన తర్వాత కండీషనర్ వాడటం చాలా ముఖ్యం. అప్పుడే వెంట్రుకల సాఫ్ట్ గా మారుతాయి. వేడినీటితో తలకు స్నానం చేయడం తగ్గించాలి. ఎక్కువ వేడి నీరు వాడితే మాడుపై ఉన్న సహజమైన తేమ ఎండిపోతుంది. కాబట్టి గోరువెచ్చని నీటితో తల స్నానం చేయడం ఉత్తమం.
రోజు షాంపుతో తలస్నానం చేస్తే జుట్టు ఊడిపోతుందని అపోహ కూడా ఎంతో మందిలో ఉంది. కానీ ఇది ప్రతి ఒక్కరికీ వర్తించదు. కొందరికి ప్రతిరోజు హెయిర్ వాష్ చేసినా ఎలాంటి సమస్య ఉండదు. మరికొందరికి వారానికి రెండుసార్లు తల స్నానం చేస్తే సరిపోతుంది. మీ జుట్టు తత్వాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. జుట్టు ఆయిలీగా ఉన్న వారు తరచుగా తల స్నానం చేయాలి. జుట్టు పొడిగా ఉన్నవారు వారానికి రెండు సార్లు చేస్తే సరిపోతుంది. నీరు ఎక్కువగా తాగడం ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు బలంగా ఉంటుంది.