Helmet: వేసవిలో వేడి గాలులు, చెమట కారణంగా హెల్మెట్ ధరించడం అసౌకర్యంగా అనిపిస్తుంది. దీంతో కొందరు హెల్మెట్‌ను సరిగ్గా పెట్టుకోరు, స్ట్రాప్‌ను వదులుగా ఉంచుతారు లేదా దగ్గర దూరాలకు వెళ్లేటప్పుడు హెల్మెట్ లేకుండానే ప్రయాణిస్తారు.
బైక్ లేదా స్కూటర్ నడిపేటప్పుడు ప్రమాదం జరిగితే ఎక్కువగా తలకు గాయాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. నాణ్యమైన హెల్మెట్ తలకు బలమైన రక్షణ ఇస్తుంది. చిన్న దూరం ప్రయాణమైనా, పెద్ద ప్రయాణమైనా హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోవాలి. వేసవిలో కొందరు వేడి కారణంగా హెల్మెట్‌ను పూర్తిగా పెట్టుకోకుండా లేదా వదులుగా ధరిస్తుంటారు. ఇలా చేయడం వల్ల ప్రమాద సమయంలో హెల్మెట్ తల నుంచి జారిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే హెల్మెట్ ఎప్పుడూ సరైన ఫిట్టింగ్‌తో ఉండాలి.
25
గాలి చొరబడని హెల్మెట్ సమస్యలను పెంచుతుంది
చాలా మంది సంవత్సరాల తరబడి ఒకే హెల్మెట్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే కొన్ని హెల్మెట్లలో సరైన వెంటిలేషన్ వ్యవస్థ ఉండదు. దీంతో హెల్మెట్ లోపల వేడి ఎక్కువగా నిల్వ ఉంటుంది. ఫలితంగా చెమట అధికంగా పట్టడం, తలనొప్పి, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. వేసవిలో హెల్మెట్ కొనుగోలు చేసే సమయంలో గాలి ప్రసరించే వెంటిలేషన్ హోల్స్ ఉన్న మోడళ్లను ఎంపిక చేసుకోవడం మంచిది. ఇవి లోపల గాలి ప్రసరణను మెరుగుపరుస్తాయి. ప్రయాణ సమయంలో తల చల్లగా ఉండేందుకు సహాయపడతాయి.
35
హెల్మెట్ స్ట్రాప్‌ను వదులుగా ఉంచడం ప్రమాదకరం
ఎండ వేడిని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో కొందరు హెల్మెట్ స్ట్రాప్‌ను పూర్తిగా బిగించరు. ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు. ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ సులభంగా ఊడిపోయే అవకాశం ఉంటుంది. హెల్మెట్ తలకు సరిగ్గా సరిపోవాలి. స్ట్రాప్‌ను కూడా సరిగ్గా బిగించాలి. అలాగే హెల్మెట్ లోపల ఉండే ప్యాడింగ్‌ను తరచూ శుభ్రం చేయడం అవసరం. ఇలా చేయడం వల్ల చెమట వల్ల వచ్చే దుర్వాసన, బ్యాక్టీరియా సమస్యలు తగ్గుతాయి.
వేసవిలో ఎక్కువ దూరం బైక్‌పై ప్రయాణించేవారు శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. ఎండలో ఎక్కువసేపు ప్రయాణిస్తే డీహైడ్రేషన్, అలసట వంటి సమస్యలు రావచ్చు. అందుకే ప్రయాణం మధ్యలో అప్పుడప్పుడు విరామం తీసుకుని నీరు తాగడం మంచిది. అవసరమైతే ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ కూడా తీసుకోవచ్చు. శరీరానికి తగినంత నీరు అందితే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
55
లైట్ కలర్ హెల్మెట్, మంచి వైజర్ ఉంటే మరింత సౌకర్యం
హెల్మెట్ రంగు కూడా వేసవిలో ప్రభావం చూపుతుంది. నలుపు లేదా ముదురు రంగుల హెల్మెట్లు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. తెలుపు, సిల్వర్ లేదా ఇతర లైట్ కలర్ హెల్మెట్లు వేడిని తక్కువగా ఆకర్షిస్తాయి. అలాగే కొందరు ఎండ నుంచి రక్షణ కోసం వైజర్‌ను పూర్తిగా మూసివేస్తారు. దీంతో లోపల ఉక్కపోత పెరుగుతుంది. మంచి ఎయిర్ ఫ్లో కలిగిన లేదా యాంటీ ఫాగ్ ఫీచర్ ఉన్న హెల్మెట్లు ఉపయోగిస్తే శ్వాస తీసుకోవడం సులభంగా ఉంటుంది. ప్రయాణం కూడా మరింత సౌకర్యంగా సాగుతుంది.