
గొంతు క్యాన్సర్ సాధారణంగా స్వరపేటిక లో ప్రారంభమయ్యే క్యాన్యర్లను సూచిస్తుంది. కానీ అన్నవాహిక లేదా థైరాయిడ్ తో ప్రారంభమయ్యే క్యాన్సర్లను కూడా ఇది సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఈ గొంతు క్యాన్సర్ వయస్సు, లింగ భేదం లేకుండా ఎవరికైనా వస్తుంది. గొంతు క్యాన్సర్ కణాల పెరుగుదల శ్వాసకోశ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. స్మోకింగ్, ఆల్కహాల్, మాదకద్రవ్యాలను ఎక్కువగా వాడటం, క్యాన్సర్ కుటుంబ చరిత్ర, పేలవమైన ఆహారం, హ్యూమన్ పాపిల్లోమావైరస్, ఇబివి వల్ల గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
గొంతు క్యాన్సర్ లక్షణాలు
దగ్గు
ఒకవేళ మీరు గొంతు క్యాన్సర్ బారిన పడినట్టేతై విపరీతమైన దగ్గు వస్తుంది. ముఖ్యంగా ఇది వారం కంటే ఎక్కువ రోజులు ఉంటుంది. సాధారణ దగ్గు ఉంటే దాని గురించి భయపడాల్సిన పనిలేదు. వారం దాటినా దగ్గు తగ్గకపోతే మాత్రం ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లండి. దీనికి తోడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగితే దాన్ని లైట్ తీసుకోకండి.
ఆహారాన్ని మింగడానికి రాకపోతే
ఏదైనా తిన్నప్పుడు లేదా తాగినప్పుడు అది లోపలికి పోవడానికి కష్టంగా ఉంటే కూడా గొంతు క్యాన్సర్ అని అనుమానించాల్సిందే. ఎందుకంటే గొంతు క్యాన్సర్ వల్ల ఫుడ్ ను మింగడానికి రాదు. ఇలాంటి సమస్య కనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.
చెవి నొప్పి
చెవి నొప్పికి కారణాలెన్నో ఉన్నాయి. అందులో గొంతు నొప్పి కూడా ఒకటి. ఎందుకంటే గొంతు క్యాన్సర్ చెవి రక్తనాళాలపై ఒత్తిడిని కలిస్తుంది. దీనివల్ల విపరీతమైన చెవి నొప్పి వస్తుంది. నాలుగైదు రోజులు పాటు చెవి నొప్పి వస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
జలుబు
చల్లని వాతావరణంలో జలుబు చేయడం సర్వ సాధారణం. ఒకవేళ మీరు మందులు వాడినా జలుబు తగ్గకపోతే మాత్రం అనుమానించాల్సిందేనంటున్నారు నిపుణులు.
గొంతులో గాయం
గొంతులో గాయం లేదా ఏదైనా ముద్దగా ఉందనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. నోట్లో అయిన గాయలు 15 నుంచి 20 రోజులైనా నయం కాకపోతే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.
ధ్వనిలో మార్పు
ధ్వనిలో మార్పు కూడా మీరు గొంతు క్యాన్సర్ పడ్డారన్న సంకేతాన్ని తెలియజేస్తుంది. అందుకే రోజులా కాకుండా ఏదైనా తేడాను గమనిస్తే దాన్ని సీరియస్ గా తీసుకోండి.
ముక్కు నుంచి రక్తస్రావం
కొంతమందికి క్యాన్సర్ లక్షణాలలో ముక్కు నుంచి రక్తం కారడం, దీర్ఘకాలిక నాసికా రద్దీ, నిరంతర సైనస్ ఇన్ఫెక్షన్లు, తరచుగా తలనొప్పి, అకస్మత్తుగా బరువు తగ్గడం వంటివి కనిపిస్తాయి.
పై లక్షణాలు మీలో కనిపించినా.. మీకు మీరే ఇది గొంతు క్యాన్సర్ అని నిర్ధారించుకోకూడదు. ఈ లక్షణాలు మీలో ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి కారణమేంటో అడగండి. అవసరమైన పరీక్షలు చేయించుకోండి. గొంతు క్యాన్సర్ నోరు, నాలుక, టాన్సిల్, శ్వాసనాళం వంటి ఎన్నో ప్రాంతాలకు వ్యాపిస్తుంది. అందుకే లక్షణాలు కనిపించిన వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.