
పొద్దు పొద్దున్న పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ తెలిసే ఉంటుంది. పండ్లను తినడం జీర్ణక్రియ, చర్మం, జుట్టు, జీవక్రియ, రోగనిరోధక శక్తికి మంచివని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పండ్ల వల్ల ఎన్ని ప్రయోజనాలున్నా.. ప్రతి వ్యక్తికి ఒక నిర్దిష్ట శరీర రకం, జీవక్రియ ఉంటుంది. అందుకే కొంతమంది ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా పండ్లను తింటే.. ఇంకొంతమంది తినకుండా ఉండాలి.
ప్రతి పండులో ఎన్నో రకాల ఎంజైమ్లు, ఆమ్లాలు ఉంటాయి. ఇవి గట్ లోని బ్యాక్టీరియాతో ప్రతిస్పందించగలవు. వ్యక్తి లక్షణాలను బట్టి అవి మంచిచేయొచ్చు లేదా చెడు చేయొచ్చు. ముందుగా మీరు తినే పండ్లు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను, దుష్ప్రభావాలను కలిగిస్తాయో తెలుసుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
నిపుణుల అభిప్రాయం ప్రకారరం.. అన్ని పండ్లలో క్రియాశీల ఎంజైమ్లు, సిట్రిక్ యాసిడ్, టార్టారిక్, ఫ్యూమారిక్, ఆక్సాలిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం వంటి పండ్ల ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పాల ఉత్పత్తులలోని లాక్టిక్ ఆమ్లంతో త్వరగా స్పందిస్తాయి. కూరగాయలు, ధాన్యాలు, మాంసంతో కలవవు. ఇవి జీర్ణం కాని జీవక్రియ వ్యర్థాలను పుట్టిస్తాయి. ఇలాంటి పండ్ల కలయికలు కణజాలం జీవక్రియకు ఆటంకం కలిగిస్తాయి. అలాగే కణజాలం ఏర్పడే ప్రక్రియను నిరోధిస్తాయి.
వీళ్లు పండ్లను తినకూడదు
జలుబు, దగ్గు, సైనసైటిస్, అలెర్జీలు, ఆస్తమా, గవత జ్వరం, ఊపిరితిత్తుల రద్దీ, బ్రాంకైటిస్, డయాబెటిస్, బరువు పెరగడం, ఎసిడిటీ, మంట లేదా కఫ సంబంధిత లక్షణాలు ఉంటే ఉదయం ఖాళీ కడుపుతో పండ్లను తినకూడదు.
వీళ్లు పండ్లను తినాలి
ఒకవేళ మీకు మలబద్ధకం, పొడి, గరుకైన చర్మం, పొడి జుట్టు, బలహీనమైన జీర్ణక్రియ, బలహీనమైన జీవక్రియ వంటి సమస్యలను ఉంటే ఖచ్చితంగా ఉదయాన్నే పండ్లను తినండి. పండ్లు మీ గట్ బ్యాక్టీరియాను పెంచుతాయి. అలాగే మీ జీర్ణ రసాలను ప్రేరేపిస్తాయి. అయితే జీర్ణక్రియకు సహాయపడటానికి, మలబద్ధకాన్ని పోగొట్టడానికి మీరు ఉడకబెట్టిన పండ్లను అంటే నీరు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలతో ఉడకబెట్టినవి తినాలి.
గుర్తుంచుకోండి.. పండ్లను తినడం మంచిదే కానీ.. పండ్లను మాత్రమే తినాలి. పండ్లను కూరగాయలు, పాడి, ధాన్యాలు లేదా మాంసంతో కలపకూడదు. ఎందుకంటే ఇలా కలిపితే అది విషపూరితంగా మారుతుంది. అయితే డ్రై ఫ్రూట్స్ పండ్ల నుంచి వచ్చినవే కాబట్టి వీటిని పండ్లను మిక్స్ చేసి తీసుకోవచ్చు.
ఉదయాన్నే పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: ఉదయం అల్పాహారంలో పండ్లను తినేవారు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవేంటంటే..
ఉత్తమ డిటాక్స్ ఆహారాలు
మన శరీరం ఉదయం 7 - 11 గంటల నుండి డిటాక్స్ ప్రక్రియకు లోనవుతుంది. చాలా కొవ్వులను కలిగున్న యాంటీ డిటాక్స్ ఆహారాల మాదిరిగా కాకుండా పండ్లు ఈ ప్రక్రియకు శక్తినిస్తాయి.
జీవక్రియ పెరుగుతుంది
పండ్లు అన్నింటికంటే సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు. ఉదయాన్నే వీటిని తినడం వల్ల సహజసిద్ధమైన పండ్లలోని చక్కెర జీవక్రియ రేటును పెంచేందుకు సహాయపడుతుంది.
మీ శరీరం చురుకుగా ఉంటుంది
మీరు నిద్రలేచిన వెంటనే మీ శరీరానికి సహజ పండ్ల చక్కెరలు చాలా అవసరం. మీ మెదడును చురుకుగా, శక్తివంతంగా ఉంచే పండ్లను తీసుకోండి. దీనివల్ల మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు.