చలికాలంలో చెవినొప్పి.. తగ్గాలంటే ఇలా చేయండి

First Published Nov 22, 2022, 10:54 AM IST

చలికాలం రాకతో రకరకాల రోగాలు కూడా సోకుతుంటాయి. దగ్గు, జలుబు, జ్వరం, అలెర్జీతో పాటుగా చెవి నొప్పి, కీళ్ల నొప్పులు కూడా వస్తుంటాయి. అయితే ఈ చెవినొప్పి అసలు ఎందుకు వస్తుందో తెలుసుకుంటే.. దీన్ని తగ్గించడం సులువు అవుతుంది.. 

చలికాలంలో చెవినొప్పి రావడం సర్వసాధారణం. సాధారణంగా ఈ నొప్పి  చెవి, దాని చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కువగా వస్తుంది. ఈ నొప్పి చివరికి ఇది మెదడుకు చేరుతుంది. నిజానికి చాలా మంది చల్లని వాతావరణం, గాలి వల్ల వస్తుందని అనుకుంటారు. కానీ ఈ చెవినొప్పికి ఒకటి కాదు చాలా కారణాలే ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో.. వాటిని ఎలా తగ్గించుకోవాలో  ఇప్పుడు తెలుసుకుందాం..  

శీతాకాలంలో చెవి నొప్పికి అనేక కారణాలు ఉండొచ్చు. మీకు తెలుసా? మన చెవుల లోపలి నిర్మాణం.. మెదడు, గొంతుకు అనుసంధానించే సున్నితమైన కణజాలాలు, నరాల చివరలు, సిరలతో రూపొందించబడింది. ఈ ప్రాంతం బయటి వాతావరణానికి పాక్షికంగా బహిర్గతమవుతుంది. అంటే చెవి చల్లని, చల్లని గాలి ద్వారా ప్రభావితమవుతుందన్న మాట. ఇది కొన్ని ఇన్ఫెక్షన్లకు కూడా కారణం కావచ్చంటున్నారు నిపుణులు.

శీతాకాలంలో చెవి నొప్పికి గల కొన్ని కారణాలు

ఇన్ఫెక్షన్: జలుబుతో బాధపడే కొంతమందికి చెవి నొప్పి కూడా వస్తుంది. చెవికి కనెక్ట్ అయ్యే యూస్టాచియన్ ట్యూబ్.. బ్యాక్టీరియా గొంతు నుంచి మధ్య చెవికి వెళ్లేందుకు సహాయపడుతుంది. ఈ చెవి సంక్రామ్యత అప్పుడప్పుడు మధ్య చెవిలో ద్రవం పేరుకుపోవడానికి దారితీస్తుంది. దీనివల్ల కూడా చెవి నొప్పి కలుగుతుంది.
 

దగ్గు, జలుబు : మీరు దగ్గినప్పుడు లేదా తుమ్మిన ప్రతిసారీ మీ చెవి లోపల కొంత ఒత్తిడి కలుగుతుంది. తరచుగా జలుబు అయితే అదనపు ఒత్తిడి చెవిలో చికాకును లేదా నొప్పిని కలిగిస్తుంది.

సైనస్: సైనస్ సమస్యలతో బాధపడేవారు కూడా శీతాకాలంలో తరచుగా చెవినొప్పిని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్లు ఎప్పుడూ తుమ్మడం, దగ్గడం వల్ల చెవులపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది.  దీనివలల్ చెవినొప్పి కలుగుతుంది. చెవి నొప్పికి సైనస్ ప్రధాన కారణమంటున్నారు నిపుణులు.
 

చల్లని గాలి: ఈ చల్లని వాతావరణంలో బయటకు వెళ్లిన తర్వాత కొంతమంది చెవిలో నొప్పి వస్తుంటుంది. ఇలా కావడానికి చల్లని గాలే కారణం. చల్లని గాలి వల్ల చెవిలోపలి నరాలు ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల చెవిలో లేదా దాని చుట్టుపక్కల విపరీతమైన నొప్పి కలుగుతుంది. 

చలికాలంలో చెవి నొప్పిని తగ్గించే చిట్కాలు

చలికాలంలో ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ చెవుల్లోకి, ముక్కులోకి చల్లని గాలి వెళ్లకుండా చూసుకోవాలి. చెవును శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చెవులు శుభ్రంగా లేకపోతే.. చెవులు అంటువ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలను తీవ్రతరం చేస్తాయి. చెవులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి..

1. ఈ సీజన్ లో బయటకు వెళ్లేటప్పుడు చెవులను కవర్ చేయడం మరువకండి. మరీ ముఖ్యంగా మీరు చల్లగా ఉండే ప్లేస్ లో ఉంటున్నట్టైతే చల్లటి గాలికి నేరుగా చెవుల్లోకి వెల్లకుండా చెవులకు ఏదైనా అడ్డం పెట్టండి.

2. సైనస్, దగ్గు, జలుబు సమస్యతో బాధపడేవారు ఈ సీజన్ లో మరింత జాగ్రత్తగా ఉండాలి. మెడిసిన్స్ ను క్రమం తప్పకుండా వాడాలి.

3. చెవులను క్లీన్ చేయడానికి హెయిర్ పిన్నులు లేదా అగ్గిపుల్లలు వంటి వాటిని అసలే ఉపయోగించకండి. 

4. డాక్టర్ సలహా లేకుండా మీరంతట మీరే ఇయర్ డ్రాప్స్ ను వేయకండి. 

5.చెవిలో ఏ చిన్న సమస్య వచ్చినా  స్పెషలిస్ట్ ను సంప్రదించండి. ఎందుకంటే ఈ సమస్యలను మరింత జాప్యం చేస్తే.. తీవ్రమైన సంక్రామ్యతకు దారితీస్తుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు చెవిటి వాళ్లు కూడా కావొచ్చు.

6. పెయిన్ కిల్లర్స్, అలెర్జీ మందులు, యాంటీ బయాటిక్స్ ను వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోండి. 

7. చల్లటి వాతావరణం వల్ల చెవినొప్పి వస్తే.. గోరువెచ్చని నీటిలో తడిపిన బట్టను చెవిపై ఉంచితే కాస్త ఉపశమనం పొందుతారు. 

8. చెవిని ఎప్పుడూ పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. చెవిలో నీళ్లు ఉన్నా.. నొప్పిగా అనిపిస్తుంది. 

9. చలికాలంలో టోపీ, హెడ్ బ్యాండ్ లేదా స్కార్ఫ్ ఉపయోగించి మీ చెవులను వెచ్చగా ఉంచండి. ఈ చిట్కాలను పాటిస్తే.. చలికాలంలో చెవినొప్పి వచ్చే అవకాశం తగ్గుతుంది. నొప్పి ఉన్నా తొందరగా ఉపశమనం కలుగుతుంది. 

click me!