
రుతుస్రావం ఒక సహజ ప్రక్రియ. ప్రతి ఒక్క మహిళ.. ఈ నెలసరి సమస్యలను ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. కానీ పీరియడ్స్ సమయంలో చాలా మందిి విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. అలాగే వాంతులు, వికారం, తిమ్మరి వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అందరిలో ఈ సమస్యలు రాకపోవచ్చు. శరీర స్వభావాన్ని బట్టి ఇలాంటి సమస్యలు వస్తాయి.
కొంతమందికి పీరియడ్స్ సమయంలో రక్తస్రావం హెవీగా అవుతుంటుంది. మరికొందరికి పొత్తికడుపు నొప్పి ఉంటుంది. ఇంకొందరికి తలనొప్పి వస్తుంది. వికారంగా, వాంతులు అయ్యే వారు కూడా ఉన్నారు. పీరియడ్స్ సమయంలో డయేరియా, మైకము, వెన్నునొప్పి మొదలైన వాటితో సహా అనేక సమస్యలు వస్తాయి. రుతుస్రావం సమయంలో మహిళలు శారీరక నొప్పితో పాటు మానసిక సమస్యలతో కూడా బాధపడుతుంటారు. కోపం, ఏడుపు, డిప్రెషన్ వంటి సమస్యలు కొంతమంది ఆడవారిలో కనిపిస్తుంటాయి. రుతుస్రావం సమయంలో ఆడవారికి విశ్రాంతి చాలా అవసరం. ఇలాంటి సమయంలో కూడా పనిచేస్తే సమస్యలు పెద్దవవుతాయి. అయితే పీరియడ్స్ సమయంలో కొన్ని పనులను అస్సలు చేయకూడదంటారు నిపుణులు. అవేంటంటే..
నీటిని తక్కువగా తాగడం: కొంతమంది మహిళలు రుతుస్రావం సమయంలో నీటిని అసలే తాగరు. చాలా వరకు తగ్గిస్తారు. ఎందుకంటే తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లడం కష్టంగా ఉంటుందని. కానీ ఈ సమయంలోనే నీటిని ఎక్కువగా తాగాలి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. శరీరంలో నీటి పరిమాణం తక్కువగా ఉంటే పీరియడ్స్ నొప్పి, ఇతర సమస్యలు మరింత ఎక్కువవవుతాయి. నిమ్మరసం, దోసకాయ, కొబ్బరి నీరు, రసం మొదలైనవి తాగాలి.
కండోమ్ లేకుండా శారీరక సంబంధం: పీరియడ్స్ సమయంలో కూడా కొంతమంది సెక్స్ లో పాల్గొంటుంటారు. అయితే ఇలాంటి సమయంలో సెక్స్ లో పాల్గొనడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. అయితే ఇలాంటి సమయంలో సెక్స్ లో పాల్గొంటే గర్భం ధరించే అవకాశాలు తక్కువని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది అబద్ధం. ఎలాంటి రక్షణ లేకుండా సెక్స్ లో పాల్గొంటే గర్భం ధరించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే లైంగికంగా సంక్రమించే వ్యాధుల ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుంది. మీరు పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయాలనుకుంటే కండోమ్ లను ఖచ్చితంగా ఉపయోగించండి. ముఖ్యంగా పరిశుభ్రత విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.
ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి: పీరియడ్స్ సమయంలో పొట్ట బాగా ఉబ్బుతుంది. గ్యాస్ట్రిక్ తో పాటుగా వేరు సమస్యలు కూడా వస్తాయి. అందుకే నెలసరి సమయంలో కడుపులో గ్యాస్ ను పుట్టించే ఆహారాన్ని తినకూడదు. ముఖ్యంగా కాఫీ, కార్బోనేటేడ్ డ్రింక్స్ ను తాగకపోవడమే మంచిది. సోడియం అధికంగా ఉండే ఫాస్ట్ ఫుడ్ ను కూడా తినొద్దు. ఎక్కువ కారం, ఉప్పు ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.
నిశ్శబ్దం : ఇంతకు ముందు చెప్పినట్టుగా పీరియడ్స్ సమయంలో కొంతమంది కారణం లేకుండా కోపం ఎక్కువగా వస్తుంటుంది. చిన్న చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకుంటుంటారు. ఏడుస్తారు కూడా. హార్మోన్ల మార్పుల కారణంగా మానసిక స్థితి స్థిరంగా ఉండకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అయితే ఇలాంటి సమయంలో నిశ్శబ్దంగా ఉండటం మంచిది.