నానబెట్టిన అంజీర పండ్లను తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..?

First Published Sep 27, 2022, 10:55 AM IST

రాత్రంతా అంజీర పండ్లను నానబెట్టి ఉదయం తినడం వల్ల గుండె జబ్బుల నుంచి బ్లడ్ షుగర్ వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి.

ఎండిన అంజీర్ లేదా అత్తిపండ్లు తియ్యగా ఎంతో టేస్టీగా ఉంటాయి. మెత్తగా.. నమలడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఈ పండ్లలో కొవ్వనేదే ఉండదు. కొలెస్ట్రాల్ కూడా ఉండదు. వీటిలో చాలా తక్కువ సోడియం, ఫైబర్, కార్భోహైడ్రేట్లు ఉంటాయి.ఈ అంజీర్ లను రాత్రంతా నానబెట్టి ఉదయం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అయితే ఈ పండ్లను నేరుగా కూడా తినేయొచ్చు. కానీ నీటిలో నానబెట్టి తింటే దీనినుంచి మరిన్ని ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. 

నానబెట్టి తినడం వల్ల అత్తిపండ్లలో కరిగే ఫైబర్ కంటెంట్ ను విచ్చిన్నం చేయడానికి సహాయపడుతుంది.  ఇందుకోసం 2 నుంచి 4 ఎండిన అంజీర ముక్కలను తీసుకోండి. ఒక చిన్న గిన్నె తీసుకుని దానిలో సగం నీటిని పోయండి. అందులో అజీర ముక్కలను వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయం నానబెట్టిన పండ్లను పరిగడుపున తినండి. వీటిపై తేనెను వేసుకుని కూడా తినొచ్చు. ఈ నానబెట్టిన పండ్లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం పదండి. 

మలబద్దకాన్ని నివారిస్తుంది

రాత్రంతా నానబెట్టి ఉదయం ఈ అత్తిపండ్లను తినడం వల్ల మలబద్దకం నుంచి ఉపశమనం పొందుతారు. ఎందుకంటే ఈ పండ్లలో కరిగే, కరగని ఫైబర్లు ఉంటాయి. ఇవి పేగు కదలికలను మెరుగుపరుస్తాయి. ఇవి మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. పండ్లు, కూరగాయలు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తింటే మలబద్దకం సమస్య అనేదే ఉండదు. 
 

ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది

అత్తిపండ్లలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా అవసరం. అయితే మన శరీరం దానంతట అది కాల్షియాన్ని ఉత్పత్తి చేసుకోలేదు. కాబట్టి కాల్షియం ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. అత్తిపండ్లతో పాటుగా కాల్షియం ఎక్కువగా ఉండే ఇతర  పండ్లు, పాలు, ఆకు కూరలు, సోయా వంటి వాటిని ఎక్కువగా తీసుకోండి. 
 

బరువును తగ్గిస్తుంది

అత్తిపండ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని సూపర్ ఫుడ్ అంటారు. బరువు తగ్గేందుకని మరీ ప్రయత్నిస్తున్నట్టైతే  ఈ నానబెట్టిన అత్తిపండ్లను తినండి. ఇది మీ ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుంది. చాక్లెట్లు, ఐస్ క్రీం లు తినడానికి బదులుగా భోజనం తర్వాత పండును తినండి. ఇవి తీపిని తినాలన్న కోరికను పోగొట్టడంతో పాటుగా శరీర బరువును కూడా నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. 
 

బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది

అంజీర పండ్లలో పొటాషియం, క్లోరోజెనిక్ ఆమ్లం ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటీస్ తో బాధపడేవారు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి వీటిని రోజూ తినండి. 

పునరుత్పత్తి ఆరోగ్యం

అంజీర్ లో మాంగనీస్, ఐరన్, జింక్, మెగ్నీషియయం వంటి ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మహిళల పునరుత్పత్తి ఆరోగ్యానికి సహాయపడతాయి. వీటిని తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుంది. రుతువిరతి తర్వాత వచ్చే సమస్యల నుంచి మీ శరీరాన్ని రక్షిస్తుంది. పీఎంఎస్ సమస్యలను తగ్గించడానికి అత్తిపండ్లు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 

click me!