బంగారు ఆభరణాలు కొత్తలో కొన్నప్పుడు మిలమిలా మెరుస్తాయి. ఆ తర్వాత మెల్లగా వాటి మెరుపు తగ్గుతుంది. వాటిపై నల్లటి పొర అనేది పేరుకు పోతుంది. అందుకే అప్పుడప్పుడు బంగారు ఆభరణాలను శుభ్రం చేస్తూ ఉండాలి.
దేశంలో బంగారు ఆభరణాలకు ఎంతో విలువ ఉంది. మహిళలు రోజూ వాటిని ధరిస్తారు. అయితే ఈ బంగారు ఆభరణాలు అప్పుడప్పుడు తమ కళను కోల్పోతాయి. నల్లగా మారుతాయి. వాటిపై దుమ్ము, ధూళి, కాలుష్యం తాలూకు నల్లటి పొర ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఇంట్లోనే చాలా సులువుగా వాటిని శుభ్రం చేసుకోవచ్చు. బంగారాన్ని తళతళ మెరిసేలా చేయాలంటే ఇంటి చిట్కాలు కొన్ని ఉన్నాయి.
24
ఇలా చేస్తే బంగారం మెరుస్తుంది
గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో సబ్బును వేసి చేతితోనే కలపండి. తర్వాత సబ్బు తీసి పక్కన పెట్టండి. ఆ సబ్బు నీరు నురగలాగా అవుతుంది. సబ్బుకు బదులు మీరు షాంపూను కూడా వాడవచ్చు. అందులో కొంచెం బేకింగ్ సోడా వేసి కలపండి. నీరు మరీ వేడిగా ఉండకూడదు. గోరువెచ్చగానే ఉండాలి. ఇప్పుడు అందులో బంగారు ఆభరణాలను వేసి కాసేపు ఉంచాలి.
34
నిమ్మరసం, ఉప్పు కలిపి
ఆ నీటిలోనే నిమ్మరసం, ఉప్పు కూడా వేసి చేత్తోనే కలపాలి. బంగారు ఆభరణాలను అరగంట పాటు అలా వదిలేయాలి. తర్వాత వాటిని తీసి మరొక గిన్నెలో వేయాలి. ఆ గిన్నెలో కూడా గోరువెచ్చటి నీళ్లు వేయాలి. ఇప్పుడు ఒక బ్రష్ తీసుకొని బంగారు ఆభరణాలను చేత్తో పట్టుకొని సున్నితంగా శుభ్రం చేయండి. తర్వాత మంచి నీటిలో కడిగి కాటన్ వస్త్రంతో తుడవండి. ఆభరణాలపై నీరు నిలవ ఉండకుండా చూసుకోండి. ఇలా శుభ్రం చేస్తే ఏ బంగారు ఆభరణాలైనా తళతళ మెరుస్తాయి.
కొంతమంది బంగారాన్ని మెరుగు పెట్టడానికి ఇచ్చి మోసపోతూ ఉంటారు. నిజానికి బంగారాన్ని మెరుగుపెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే నెలకు ఒకసారి ఇలా బంగారు ఆభరణాలను శుభ్రం చేసుకుంటే అవి తమ రంగును కోల్పోవు. నల్లగా మారవు. ఇది అనుకూలమైనది, సురక్షితమైనది కూడా. అందులోను ఇది చాలా చవక పద్ధతి. ఇందులో మీరు వాడిన వస్తువులకు ఎక్కువ ధర చెల్లించక్కర్లేదు. కాబట్టి ఇలా నల్లబడిన బంగారు ఆభరణాలను సులభంగా శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నించండి.