
hair fall
జుట్టు రాలడానికి కారణాలెన్నో ఉంటాయి. జన్యుపరంగా కూడా జుట్టు రాలుతుంది. కాలుష్యం, చుండ్రు, దుమ్ము, ధూళి వంటి కారణాల వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. అయినా ఈ సమస్యలేం లేకున్నా రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు ఊడిపోవడం సర్వ సాధారణ విషయం. అయితే ఈ వెంట్రుకల స్థానంలో మళ్లీ కొత్త వెంట్రుకలు మొలుస్తాయి. కానీ ఇంతకంటే ఎక్కువ వెంట్రుకలు రాలిపోతే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే జన్యుపరంగా, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్, జీవక్రియతో పాటుగా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా వెంట్రుకలు విపరీతంగా రాలిపోతాయి. అయితే కొన్ని కొన్ని సార్లు మీ రోజువారీ అలవాట్లు కూడా జుట్టు రాలడానికి కారణం అవుతాయి. నెత్తిమీద దురద లేదా నెత్తిమీద ఇన్ఫెక్షన్ వల్ల కూడా జుట్టు రాలిపోతుంది.
కొన్ని ఆహారాలు జుట్టు రాలడానికి దారితీస్తాయి
మనం తినే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. శరీరంలో తగినన్ని పోషకాలు ఉంటే చర్మం, జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి. కానీ కొన్ని ఆహారాలు చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అవేంటంటే..
క్రాష్ డైటింగ్
యో-యో డైటింగ్
సరైన ఫుడ్ షెడ్యూల్ లేకపోవడం
ఆహారంలో సమతుల్యత లోపించడం
ఈ రోజుల్లో చాలా మంది జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కు బాగా అలవాటు పడిపోయారు. కానీ చక్కెర, కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్ ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. క్రాష్ డైట్, యో-యో డైటింగ్ కూడా అంతే. వీటివల్ల మీ శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు అందవు. ఫలితంగా మీ జుట్టు రాలడం స్టార్ట్ అవుతుంది. మీ మొత్తం శరీరం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఆహారంలో సన్నని మాంసాలు, ప్రోటీన్లు, కూరగాయలు, పండ్లు, విత్తనాలు, పాడి, తృణధాన్యాలు ఉండాలి. జుట్టు ప్రోటీన్లు, జింక్, ఇనుము, మెగ్నీషియంతో తయారవుతుంది. అందుకే ఇవి మీ ఆహారంలో సరైన నిష్పత్తిలో ఉండేలా చూసుకోండి.
జుట్టు రాలడానికి కారణమయ్యే ఇతర విషయాలు
ధూమపానం
స్మోకింగ్ క్యాన్సర్ కారకం అన్న సంగతి అందరికీ తెలుసు. అయినా స్మోకింగ్ చేస్తారు. ధూమపానం మీ రక్త నాళాలను నిర్బంధిస్తుందన్న సంగతి మీకు తెలుసా? అంతేకాదు ఇది మీ జుట్టు కుదుళ్లను బలహీనంగా మారుస్తుంది. అంటే కుదుళ్లకు తగినంత రక్తసరఫరా జరగదు. దీంతో జుట్టు బాగా రాలిపోతుంది. జుట్టు సన్నబడుతుంది. అంతేకాదు స్మోకింగ్ మీ జుట్టు తిరిగి పెరగకుండా చేస్తుంది. అలాగే మీ నెత్తిమీద కొత్త వెంట్రుకలు రాకుండా చేస్తుంది. పొగాకు వృద్ధాప్యానికి కూడా కారణమవుతుంది. చర్మం పై ముడతలను ఏర్పరుస్తుంది. మీరు స్మోకింగ్ ను మానేస్తేనే మీ మొత్తం ఆరోగ్యం బాగుంటుంది.
hair fall
ఒత్తిడి
దీర్ఘకాలిక ఒత్తిడి కార్టిసాల్, నోరాడ్రినలిన్ వంటి హార్మోన్ల ఉత్పత్తికి కారణమవుతుంది. ఇది జుట్టు కుదుళ్లను బలహీనంగా చేస్తుంది. దీనివల్ల కొత్త జుట్టు పెరగదు. చివరికి మీ జుట్టు పల్చగా మారి బాగా రాలిపోతుంది. ఒత్తిడి ప్రభావాలు కనిపించడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. కానీ ఈ సమస్యలను ఇట్టే తగ్గించుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. విశ్రాంతి తీసుకోవడం, వ్యాయామం చేయడం, మీ ఒత్తిడిని నియంత్రించడం.
కాలుష్యం, నుంచి మీ జుట్టును రక్షించండి
కాలుష్యం కెరాటిన్ నిర్మాణంపై ప్రభావం చూపుతుంది. ఈ ప్రోటీన్ జుట్టు నిర్మాణానికి చాలా చాలా అవసరం. కెరాటిన్ లోపం వల్ల జుట్టు బలహీనపడుతుంది. జుట్టు దెబ్బతింటుంది కూడా. కాలుష్యం బట్టతలకు కారణమవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దుమ్ము, ధూళి, పొగకు గురికావడం వల్ల నెత్తి సంక్రమణకు కారణమవుతుంది. దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే.. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు టోపీ లేదా స్కార్ఫ్ ధరించి మంచి హెయిర్ కండీషనర్ ను వాడండి.