అల్లం, వెల్లుల్లి నిజంగా కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయా ?

First Published Sep 20, 2022, 10:58 AM IST

ఒంట్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ప్రతిరోజూ కొంత మొత్తంలో అల్లం, వెల్లుల్లిని తినేవారు చాలా మందే ఉన్నారు. నిజంగా ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయా..? 
 

High Cholesterol

ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారు. గుండె జబ్బులకు కొలెస్ట్రాల్ యే మూల కారణం. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే రక్తణాల్లో కొవ్వు నిల్వలు పేరుకుపోతాయి. ఇది ధమనుల గుండా వెళ్లే రక్త పరిమాణానాన్ని ఇది నియంత్రిస్తుంది. దీని వల్ల చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

కొలెస్ట్రాల్ అనేది రక్తంలో కనిపించే మైనం లాంటి పదార్థం. ఇది ఆరోగ్యకరమైన కణాల ఏర్పాటు ప్రక్రియకు మద్దతునిస్తుంది. ఇది కొంతవరకైతే శరీరానికి ప్రయోజనం చేకూరుస్తుంది. కానీ మన శరీరంలో ఈ కొలెస్ట్రాల్ స్థాయి విపరీతంగా పెరిగిపోతేనే మనం ఊహించలేని నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది. 
 

cholesterol

అయితే కొంతమంది కొలెస్ట్రాల్ ను కరిగించుకోవడానికి అల్లం, వెల్లుల్లిని తింటుంటారు. ఈ రెండు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి సహాయపడతాయని నమ్ముతుంటారు. పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ ప్రకారం.. వెల్లుల్లి, అల్లంలో కనిపించే బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దీర్ఘకాలిక మంటతో సంబంధం ఉన్న ప్రో ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్లను నివారించడంలో సహాయపడతాయి.

వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధిస్తుంది. అలాగే ధమనులలో ఫలకం ఏర్పడటాన్ని పరిమితం చేస్తుంది. దీంతో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ ను 15% వరకు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ శోషణకు అంతరాయం కలిగించడం,  కొలెస్ట్రాల్ ను పిత్త ఆమ్లాలుగా మార్చడానికి ప్రేరేపిస్తుంది అల్లం. దీనివల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని నిరూపించబడిందని అంజలి ముఖర్జీ చెప్పారు.
 

అనారోగ్యకరమైన జీవనశైలి వల్లే శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోతుంది. ఈ అల్లం, వెల్లుల్లిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటుగా ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే ధమనులలో అడ్డంకిని తొలగించడానికి సహాయపడతాయి.  కొవ్వును కూడా కరిగిస్తాయి. 

శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఉందో? లేదో తెలుసుకోవడానికి లిపిడ్ ప్రొఫైల్ లేదా లిపిడ్ ప్యానెల్ అనే రక్త పరీక్షను చేయించుకోవాల్సి ఉంటుంది. పోషకాలు ఎక్కువగా ఉండే, సమతుల్య ఆహారం తింటూ.. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కొంతవరకు తగ్గుతుంది. 

అల్లంలో.. విటమిన్ ఎ, మెగ్నీషియం, విటమిన్ ఇ, పొటాషియం, విటమిన్ సి, మాంగనీస్, జింక్, విటమిన్ బి, ఫాస్పరస్ వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలుంటాయి. అల్లాన్ని కొంత మొత్తంలో తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. అలాగే మలబద్దకం సమస్యను పోగొడుతుంది. ఇది జీర్ణసంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు వాంతులు, వికారం, విరేచనాల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఈ అల్లం దగ్గు, ఒంటి నొప్పులు, జలువు, కడుపు నొప్పి, శ్వాసలో ఇబ్బంది, అజీర్థి వంటి సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. 

ఇక వెల్లుల్లిలో కూడా ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు,యాంటీ ఇన్ల్ఫమేటరీ, ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు  అధిక మొత్తంలో ఉంటాయి. ఈ వెల్లుల్లి కూడా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. హైబీపీ పేషెంట్లకు ఇవి చక్కగా ఉపయోగపడతాయి. వీటిని పచ్చిగా తింటే బీపీ కంట్రోల్ లో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. అలాగే మొటిమలు, అజీర్థి వంటి సమస్యలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. 

click me!