Karthika Masam: కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. 2026లో కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ముఖ్యమైన పండుగలేంటి? ఎన్ని రోజులు ఈ మాసం నడుస్తుంది వంటి వివరాలు ఇక్కడ ఇచ్చాము.
హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. శివుడు, విష్ణుమూర్తిని ఆరాధించే మాసం ఇదే. అందుకే ఈ నెలను పవిత్రమైన కాలంగా భావిస్తారు. తెలుగువారి పంచాంగం ప్రకారం 2026లో కార్తీక మాసం నవంబరు 10, మంగళవారం ప్రారంభమవుతుంది. డిసెంబరు 8, మంగళవారం ముగుస్తుంది. ఈ నెలలో తెల్లవారుజామున నిద్రలేచి పవిత్ర స్నానాలు చేయడం, శివాలయాలను దర్శించడం, తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం ఆనవాయితీ. చాలామంది నెల రోజుల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటూ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. కొందరు కార్తీక సోమవారాల్లో ఉపవాసం పాటిస్తారు. ఈ నెలలో దీపారాధన చేయడం వల్ల శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.
23
కార్తీక మాసం ముఖ్యమైన పండుగ
కార్తీక మాసంలో నాగుల చవితి, క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి వంటి పర్వదినాలు ప్రత్యేకం. 2026 నవంబరు 13, శుక్రవారం నాగుల చవితి వస్తుంది. ఈ రోజున నాగదేవతను పూజించడం ఆనవాయితీ. నవంబరు 16, సోమవారం మొదటి కార్తీక సోమవారం వస్తుంది. నవంబరు 21, శనివారం క్షీరాబ్ధి ద్వాదశి జరుపుకుంటారు. ఈ రోజును చిలుక ద్వాదశి అని కూడా పిలుస్తారు. తులసి మొక్క దగ్గర ఉసిరి కొమ్మను ఉంచి పూజలు చేసే సంప్రదాయం ఉంది. నవంబరు 23న రెండో కార్తీక సోమవారం వస్తుంది. ఈ రోజున చాలామంది శివాలయాలకు వెళ్లి అభిషేకాలు చేయిస్తారు. శివనామస్మరణతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
33
కార్తీక పౌర్ణమి ఎప్పుడు?
కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైన పర్వదినాల్లో కార్తీక పౌర్ణమి ఒకటి. 2026 నవంబరు 24, మంగళవారం కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ రోజున ఇళ్లలో, ఆలయాల్లో దీపాలు వెలిగిస్తారు. కొన్ని ఆలయాల్లో జ్వాలాతోరణం నిర్వహిస్తారు. 365 వత్తులతో దీపం వెలిగించే సంప్రదాయం కూడా ఉంది. నవంబరు 30న మూడో కార్తీక సోమవారం, డిసెంబరు 7న నాలుగో కార్తీక సోమవారం వస్తాయి. డిసెంబరు 7న మాస శివరాత్రి కూడా వస్తుంది. డిసెంబరు 8న కార్తీక అమావాస్యతో ఈ మాసం ముగుస్తుంది. ప్రాంతం, కుటుంబ సంప్రదాయాన్ని బట్టి కొన్ని పూజల తేదీల్లో మార్పులు ఉండవచ్చు. కాబట్టి పూజలు చేసేవారు స్థానిక పంచాంగాన్ని పరిశీలించడం మంచిది.