ఈ యూనివర్స్ లో సౌర కుటుంబం(solar system) ఏర్పడిన తర్వాత చాలా శకలాలు ఈ విశ్వంలో కొన్ని ప్లానెట్స్ చుట్టూ ఉప గ్రహాల్లా తిరుగుతున్నాయి. అలాంటిదే మన చందమామ కూడా. మన సౌర కుటుంబంలో ప్రతి గ్రహానికి ఉప గ్రహాలున్నాయి. భూమికి చంద్రుడిలా, శుక్రుడికి రెండు ఉపగ్రహాలున్నాయి. గురుడికి 79, శనికి 62, యురేనస్ కు 27, ఇలా ప్రతి గ్రహానికి ఎన్నో కొన్ని ఉప గ్రహాలున్నాయి. ఆ గ్రహాల గురుత్వాకర్షణ వల్ల కొన్ని సహజంగా ఉపగ్రహాలుగా మారాయి. మరికొన్ని విశ్వంలో వచ్చే మార్పుల వల్ల ఆ ప్లానెట్స్ కక్ష్యలోకి వెళ్లి తాత్కాలిక ఉపగ్రహాలుగా మారుతుంటాయి. అలా ఇప్పుడు భూమికి కూడా ఓ గ్రహ శకలం టెంపరరీ ఉపగ్రహంగా మారనుంది.
భూమికి రెండు నెలల పాటు ఒక చిన్న చంద్రుడు రాబోతున్నాడు. ఈ చంద్రుడు తాత్కాలికంగా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇది చాలా అరుదైన ఖగోళ అద్భుతం. ఈ సంఘటనలో ఒక గ్రహశకలం భూమి గురుత్వాకర్షణ శక్తి కారణంగా సెప్టెంబర్ 29 నుండి నవంబర్ 25 వరకు భూమి చుట్టూ తిరుగుతుంది. దీని పేరు 2024 PT5.
2024 PT5 దాదాపు రెండు నెలల పాటు తాత్కాలిక చంద్రుడిగా మారుతుంది. 33 అడుగుల వ్యాసం కలిగిన ఈ గ్రహశకలం భూమి గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఈ కక్ష్యలోకి వచ్చింది. అయితే కొన్నాళ్ల తర్వాత మళ్లీ యూనివర్స్ లోకి వెళ్లిపోతుంది.
దీనిని మొదట ఆగస్టు 7, 2024న ATLAS గుర్తించింది. ఇది అమెరికన్ స్పేస్ ఏజెన్సీ NASAకు చెందిన సంస్థ. ఇది విశ్వంలోని గ్రహశకలాలను పరిశీలిస్తూ, వాటిపై అధ్యయనం చేస్తుంది. దీని పని గ్రహశకలాలను పర్యవేక్షించడం, అవి భూమికి దగ్గరగా వచ్చినప్పుడు హెచ్చరికలు జారీ చేయడం.
33 అడుగుల గ్రహశకలం 2024 PT5
అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ నివేదిక ప్రకారం ఈ గ్రహశకలం పెద్దది కాదు. దీని వ్యాసం 10 మీటర్లు (33 అడుగులు). భూమికి దగ్గరగా 53 రోజులు గడిపినప్పటికీ 2024 PT5 భూమి చుట్టూ పూర్తిగా తిరగదు. ఇది భూమి గురుత్వాకర్షణ శక్తి నుండి బయటపడటానికి ముందు గుర్రపు నాడ ఆకారంలో ఒక లూప్‌ను ఏర్పరుస్తుంది.
RNAAS నివేదిక ప్రకారం భూమికి గ్రహశకలాలను ఆకర్షించే స్వభావం ఉంది. ఈ గ్రహశకలాలు కొన్నిసార్లు మన గ్రహం చుట్టూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువసార్లు తిరుగుతాయి. అవి భూమి దీర్ఘవృత్తాకార మార్గం నుండి వేరుపడటానికి ముందే పూర్తిగా తిరగలవు.
2006లో కూడా ఇదే విధంగా భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఒక గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చింది. జూలై 2006 నుండి జూలై 2007 వరకు భూమి చుట్టూ తిరిగింది. ప్రస్తుతం భూమికి దగ్గరవుతున్న 2024 PT5 కూడా 2022 NX1 మార్గాన్ని అనుసరిస్తోంది.
2051 మళ్లీ భూమికి దగ్గరగా..
ఇది 2051లో మళ్ళీ భూమికి దగ్గరగా వచ్చి సగం చుట్టు తిరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2024 PT5 వల్ల భూమిపై ప్రజలకు ఎటువంటి ముప్పు లేదు. ఇదంతా విశ్వంలో సహజంగా జరిగే పరిణామమని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని NASA ప్రకటించింది.
Planet X
ఇలాంటి మినీ మూన్స్ చాలా అరుదుగా ఏర్పడతాయి. ఈ సంఘటన శాస్త్రవేత్తలకు భూమి దగ్గరకు వచ్చే ఆస్టరాయిడ్లపై అధ్యయనం చేయడానికి మంచి అవకాశం. అయితే ఈ మినీ మూన్ అనేది చాలా చిన్న విషయం. వెలుతురు తక్కువగా ఉండడం వల్ల ఇది మన కంటికి కనిపించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.