Drumstick Soup: మునగకాడలతో వేడివేడిగా, రుచికరమైన సూప్ చేసుకుని తాగితే చాలా రుచిగా ఉంటుంది. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి ఘుమఘుమలాడే మునగకాడ సూప్ రెసిపీ ఎలాగో ఇక్కడ ఇచ్చాము. చల్లని వాతావరణంలో ఇది రుచిగా ఉంటుంది.
మునగకాడ అనగానే మనకు సాంబార్ గుర్తొకొస్తుంది. నిజానికి మునక్కాడలతో రకరకాల వంటలు వండుకోవచ్చు. చల్లని వాతావరణంలో వేడి వేడి మునగకాడ సూప్ ట్రై చేయండి. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఘాటుకు మునగకాడ రుచి తోడైతే ప్రతి స్పూన్ ఎంతో రుచిగా ఉంటుంది. సాయంత్రం పూట లేదా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా తాగేందుకు ఈ సూప్ అదిరిపోతుంది.
23
మునక్కాడల సూప్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
మునగకాడలు - 2
చిన్న ఉల్లిపాయలు - 6 నుంచి 8
టమాటా - 1 (చిన్నది)
వెల్లుల్లి - 4 రెబ్బలు
మిరియాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1/2 టీస్పూన్
పసుపు - 1/4 టీస్పూన్
వెన్న లేదా నూనె - 1 టీస్పూన్
నీళ్లు - 3 నుంచి 4 కప్పులు
ఉప్పు - తగినంత
కొత్తిమీర - కొద్దిగా
33
మునగకాడ సూప్ రెసిపీ
మునక్కాడల సూప్ చేసేందుకు మునగకాడలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కుక్కర్‌లో మునగకాడ ముక్కలు, కొద్దిగా పసుపు, నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి.
మునగకాడ ముక్కలు చల్లారాకల లోపల ఉన్న గుజ్జును స్పూన్‌తో తీసి పక్కన పెట్టుకోవాలి. మునగకాడలు ఉడికించిన నీళ్లను పారబోయకుండా సూప్ కోసం ఉంచుకోవాలి.
ఇప్పుడు ఉడికించిన మునగకాడ గుజ్జులో కొద్దిగా ఉడికించిన నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. సూప్ మరింత స్మూత్‌గా కావాలనుకుంటే దీన్ని వడకట్టుకోవచ్చు.
ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి 1 టీస్పూన్ నూనె వేసి వేడి చేయాలి. అందులో కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు, జీలకర్ర వేసి మంచి సువాసన వచ్చేదాకా వేయించాలి.
తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి. ఆపై కట్ చేసిన టమాటా ముక్కలు వేసి మెత్తబడేదాకా మగ్గనివ్వాలి.
ఇప్పుడు అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న మునగకాడ గుజ్జు, మిగిలిన ఉడికించిన నీళ్లు పోయాలి. తగినంత ఉప్పు వేసి మీడియం మంట మీద 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. చివరగా కొత్తిమీర చల్లి దించేస్తే, ఘుమఘుమలాడే మునగకాడ సూప్ రెడీ.
స్పైసీగా కావాలనుకునేవారు మిరియాల పొడిని కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. సూప్ క్రీమీగా ఉండాలనుకుంటే కొద్దిగా పాలు లేదా కొబ్బరి పాలు కలుపుకోవచ్చు. అయితే పాలు పోశాక ఎక్కువసేపు మరిగించకుండా వెంటనే దించేయడం మంచిది.