హెన్నా ఇలా పెట్టారంటే జుట్టులో చుండ్రు పూర్తిగా పోవడం ఖాయం

First Published | Jun 18, 2024, 10:27 AM IST

చుండ్రు చాలా మందికి ఉంటుంది. ఈ చుండ్రు వల్ల నెత్తిమీద దురద పెట్టడమే కాకుండా వెంట్రుకలు కూడా విపరీతంగా రాలుతాయి. అయితే ఒక పద్దతిలో తలకు హెన్నా పెడితే చుండ్రు మొత్తమే లేకుండా పోతుంది. అదెలాగంటే?
 

ఎండాకాలమైనా, వానాకాలమైనా చుండ్రు సమస్య మాత్రం ప్రతి సీజన్ లో ఉంటుంది. అసలు ఈ చుండ్రుకు గల కారణాలు కొన్ని మాత్రమే తెలుసు. నిజానికి చుండ్రుకు ఎన్నో కారణాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుంటే చుండ్రు లేకుండా చేయొచ్చు. అయితే ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా మంది మార్కెట్లో దొరికే ఖరీదైన యాంటీ డాండ్రఫ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు ఇవి కూడా చుండ్రును పోగొట్టడంలో ఫేల్ అవుతుంటాయి. కానీ హెన్నా ప్యాక్ తో చుండ్రును పూర్తిగా పోగొట్టొచ్చు. 
 

చుండ్రుకు కారణాలు

నెత్తిమీది చర్మం బాగా పొడిబారడం వల్లే చుండ్రు ఎక్కువగా వస్తుంటుంది. ఇలా కాకూడదంటే జుట్టును ఎప్పుడూ కూడా వేడి నీళ్లతో కడగకూడదు. 

మన నెత్తిమీద నూనె ఎక్కువగా ఉంటే దుమ్ము, ధూళి నెత్తిమీద, జుట్టుకు అంటుకుంటుంది. దీనివల్ల చనిపోయిన చర్మం నెత్తిమీద చాలా వేగంగా పేరుకుపోవడం ప్రారంభిస్తుంది. నెత్తిమీది చర్మంపై మలాసెజియా అనే ఫంగస్ ఉంటుంది. ఈ ఫంగస్ నెత్తిమీద నుంచి విడుదలయ్యే నూనెతో కలిసి చర్మాన్ని ఉత్తేజపరుస్తుంది. ఇది చుండ్రును పెంచుతుంది.

జుట్టును సరిగా శుభ్రం చేయకపోయినా కూడా చుండ్రు సమస్య వస్తుంది. 

ఒత్తిడి, మానసిక ఆరోగ్య సమస్యలు కూడా చుండ్రుకు కారణమవుతాయి. ఒత్తిడి మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఇది చర్మం పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. ఇది చుండ్రు సమస్యను కలిగిస్తుంది.
 


henna hair

మెహందీ హెయిర్ ప్యాక్ ను ఎలా చేయాలి?

కావాల్సిన పదార్థాలు 

100 గ్రాముల గోరింటాకు పొడి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి, 1 టేబుల్ స్పూన్ ఉసిరి పొడి,
అవసరమైనంత నీరు
 

తయారుచేసే విధానం

గోరింటాకు పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో పెరుగు, నిమ్మరసం, మెంతుల పొడి, ఉసిరి పొడి వేసి బాగా కలపండి. దీనిలో నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని 2నుంచి 3 గంటల పాటు మూతపెట్టి పక్కనపెట్టండి. గోరింటాకు కాస్త ఉబ్బినతర్వాత  మీ జుట్టుకు అప్లై చేయండి. 
 

జుట్టును చిన్న చిన్న భాగాలుగా విభజించి హెన్నా పేస్ట్ ను నెత్తిమీద, జుట్టు పొడవునా సమానంగా అప్లై చేయండి.  ఈ ప్యాక్ ను జుట్టు మూలాల నుంచి చివర్ల వరకు అప్లై చేసేలా చూసుకోవాలి. హెయిర్ ప్యాక్ ను 1 గంట పాటు ఆరనివ్వాలి. కావాలనుకుంటే షవర్ క్యాప్ తో జుట్టును కవర్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ ను పెట్టుకుని ఎండలో కూర్చోకోకూడదు. అలాగే హెయిర్ డ్రయ్యర్ లేదా మరేదైనా మార్గంలో జుట్టును ఆరేలా చేయొద్దు. ఇది మీ జుట్టుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. తర్వాత సాధారణ నీటితో జుట్టును బాగా కడగండి. గోరింటాకు హెయిర్ ప్యాక్ ను జుట్టుకు అప్లై చేసిన రోజు, ఆ తర్వాతి రోజు షాంపూతో తలస్నానం చేయకూడదు.
 

మెహందీ హెయిర్ ప్యాక్ ప్రయోజనాలు

హెన్నా సహజంగా చల్లగా ఉంటుంది. ఇది నెత్తిమీద దురద, మంట సమస్యలను తగ్గిస్తుంది. 
ఇక పెరుగు, నిమ్మరసం జుట్టును డీప్ కండీషనర్ చేస్తాయి. దీంతో చుండ్రు సమస్య ఉండదు. 
మెంతి పొడిలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చుండ్రును తగ్గించడానికి సహాయపడతాయి.
ఈ హెయిర్ ప్యాక్ ను క్రమం తప్పకుండా వారానికి ఒకసారి అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గడంతో పాటు జుట్టు కూడా స్ట్రాంగ్ గా, షైనీగా మారుతుంది.

గమనిక: మీ చర్మం సున్నితంగా ఉంటే పైన చెప్పిన చిట్కాలను ప్రయత్నించే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేయండి. మీరు ఏ రెసిపీ నుంచి కూడా తక్షణ ఫలితాలను పొందలేరు.

Latest Videos

click me!