Parenting tips: ఇలాంటి విషయాలే టీనేజర్లను ఇబ్బందులకు గురి చేస్తాయని మీకు తెలుసా?

First Published | Jan 20, 2022, 3:41 PM IST

Parenting tips: టీనేజ్ పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటే వారిని సరైన మార్గంలో వెళ్లేలా చేయొచ్చు. కానీ వారి విషయంలో అనవసరంగా ఆందోళన చెంది అతిగా సలహాలు, సూచనలు ఇవ్వడం పిల్లలకు, పేరెంట్స్ ఇద్దరికీ అంత మంచిది కాదు. ఎందుకో తెలుసా..

Parenting tips: టీనేజ్ పిల్లల మనస్తత్వం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రతి పిల్లవాడు ఈ టీనేజ్ లో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులను సంతరించుకుంటాడు.  బాల్యానికి, యుక్త వయస్సుకు మధ్య పిల్లలు కౌమారదశలో ఉంటారు. ఈ దశలో ఎన్నో కొత్త కొత్త మార్పులను పొందుతారు. అది శారీరకంగా కావొచ్చు. మానసికంగా కావొచ్చు. ఈ మార్పులే వారిని మరింత సున్నితంగా తయారుచేస్తాయి. అది ఎలాగంటారా.. మీరు చిన్న విషయాన్ని చెప్పినా.. దాన్ని కొండంతది చేసి ఆలోచించి దాన్ని నెగిటీవ్ తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఏజ్ పిల్లలు ఏ విషయాన్ని కూడా అంత తేలిగ్గా తీసుకోరు. చిన్న చిన్న విషయాలకు కూడా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. కాబట్టి ఈ టీనేజ్ పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి విషయాన్ని అర్థం అయ్యేలా చెప్పాలి. మళ్లీ అతిగా విషయాన్ని వివరిస్తే కూడా బాగోదు. పేరెంట్స్ చేసే కొన్ని విషయాల వల్ల టీనేజర్లు బాగా ఇబ్బందికి గురవుతారు. అవి ఎలాంటి విషయాలో తెలుసా..? 
 

తల్లి దండ్రులకు తమ పిల్లలపై అమితమైన ప్రేమ కలిగిఉండటం సహజమైన విషయం. దాని కారణంగానే పిల్లలు ఎంత ఎదిగినా చిన్న పిల్లలుగానే భావిస్తారు. అక్కడెవరు ఉన్నారో లేదో చూసుకోకుండా ప్రేమకురిపించడం, ముద్దులు పెట్టడం, కౌగిలించుకోవడం లాంటవి చేస్తుంటారు. కానీ టీనేజ్ పిల్లలకు పబ్లిక్ ప్లేస్ అంత Comfortable గా అనిపించదు. అందులో పబ్లిక్ ప్లేస్ లో టీనేజ్ పిల్లలను తిట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. ఇతరుల ముందు వాళ్లను తిట్టడం, వారి తప్పులను ఎత్తి చూపడం వంటివి చేయడం మానుకోండి. అలాగే ఒకే విషయం గురించి ఎక్కువ సేపు వివరించడం కూడా పిల్లవానికి ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అందుకే వాళ్లు ఏదైనా తప్పు చేసినా.. వాటిని అర్థం చేసుకుని ఏది తప్పో, ఏదో ఒప్పో వారికి అర్థం అయ్యేలా చెప్పడానికి ప్రయత్నించడండి. అంతేకాని వారిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, కొట్టడం లాంటి పనుల వల్ల పిల్లలు మరింత బాధపడటమే కాదు.. వారి ప్రవర్తన మారిపోయే ప్రమాదం ఉంది. 
 



చాలా మంది పేరెంట్స్ పిల్లలు ఒంటరిగా ఉంటే తప్పుడు దారిలో వెళతారని ఎప్పుడూ వారిని అంటిపెట్టుకునే ఉంటున్నారు. కానీ వారికి కాస్త సమయాన్ని ఇవ్వండి. వాళ్లను వాళ్లు అర్థం చేసుకునేలా కాసేపు ఒంటరిగా గడిపేందుకు సమయం ఇవ్వండం చాలా మంచిది. అలాగే పిల్లలను వాళ్లకు నచ్చిన ఆటలు ఆడుకోవడానికి, వారి స్నేహితులతో గడపడానికి కూడా అనుమతినివ్వండి. వారిని అన్ని విషయాలకు కట్టడి చేస్తే మీపై ప్రేమ తగ్గే అవకాశం ఉంది. ఫ్రీడం ఇచ్చినా పేరెంట్స్ గా మీరు మీ పిల్లల్ని ఓ కంట కనిపెట్టుకుని ఉండటం చాలా అవసరం. 
 

ముఖ్యంగా పిల్లలు తమ తల్లిదండ్రులు మంచి స్నేహితులుగా ఉండాలి. ఏ విషయాన్నైనా ధైర్యంగా మీతో చెప్పుకునేలా వారితో అనుబంధాన్ని పేరెంట్స్ ఏర్పరుచుకోవాలి. దీని వల్ల మీ పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీరు చెప్పుకోగలుగుతారు. దాంతో వారు ఎలాంటి ఒత్తిడికి గురయ్యే అవకాశమే లేకుండా ఉంటుంది. వారి ఫీలింగ్స్ ను మీతో షేర్ చేసుకునేలా ప్రవర్తించండి. కానీ మీ పిల్లల గురించి వారి స్నేహితుల వద్ద ఎక్కువగా ఆర తీయకండి. అది మీ పిల్లలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఇకపోతే ప్రతి చిన్న విషయాలకు మీ పిల్లలపై కోపానికి రావొద్దు. వారి మనస్తత్వాలను అర్థం చేసుకుని అన్ని విషయాల్లో మీరు వారికి సలహాలనివ్వండి. ఏది మంచో, ఏది చెడో వారికి అర్థమయ్యే రీతిలో చెబితే మీ పిల్లలు భవిష్యత్ కు ఏ ఢోకా ఉండదు. వారు చెడు దారిలో వెళ్లే ప్రసక్తే ఉండదు.

Latest Videos

click me!