
ఇంట్లో ఉండే వస్తువులతోనే చల్లచల్లని గాలిని అందించే ఎయిర్ కూలర్ తయారుచేయవచ్చు. ఇందుకోసం కావాల్సిన వస్తువులేమిటంటే…
ఒక చిన్న ప్లాస్టిక్ బకెట్ లేదా మందపాటి బాక్స్
చిన్న టేబుల్/USB ఫ్యాన్
2 లేదా 3 పెద్ద వాటర్ బాటిళ్లు
ఐస్ ముక్కలు లేదా గడ్డకట్టించిన వాటర్ బాటిళ్లు
కార్డ్‌బోర్డ్ లేదా మందపాటి మూత
టేప్
నీళ్లు కారకుండా కింద పెట్టడానికి ఒక చిన్న ట్రే
1. ముందుగా బకెట్‌ను సిద్ధం చేయండి
ఒక ప్లాస్టిక్ బకెట్ పైభాగంలో ఫ్యాన్ పట్టేంత సైజులో రంధ్రం చేయాలి. గాలి బయటకు వెళ్లడానికి పక్కన 2-3 చిన్న రంధ్రాలు కూడా చేసుకోవచ్చు.
2. ఐస్ బాటిళ్లను రెడీ చేసుకోండి
2 లేదా 3 వాటర్ బాటిళ్లలో నీళ్లు నింపి, వాటిని ఫ్రీజర్‌లో పెట్టి గడ్డకట్టించండి. ఇలా గడ్డకట్టిన బాటిళ్లను వాడితే, కరిగిన నీటిని హ్యాండిల్ చేయడం సులభం అవుతుంది.
3. ఐస్ బాటిళ్లను బకెట్‌లో పెట్టండి
గడ్డకట్టిన బాటిళ్లను బకెట్ లోపల పెట్టండి. అవి ఫ్యాన్ రెక్కలకు నేరుగా తగలకూడదు.
4. ఫ్యాన్‌ను అమర్చండి
బకెట్ లోపల ఉన్న చల్లటి గాలిని ఫ్యాన్ బయటకు నెట్టేలా అమర్చాలి. గాలి బయటకు వెళ్లే రంధ్రాలు ఫ్యాన్ ఎయిర్‌ఫ్లోకు సరిగ్గా ఉండేలా చూసుకోవడం ముఖ్యం.
5. మూతను సరిగ్గా బిగించండి
గాలి వేరే వైపు నుంచి పోకుండా, కేవలం ఆ రంధ్రాల నుంచే బయటకు వచ్చేలా కార్డ్‌బోర్డ్ లేదా మూతను టేప్‌తో గట్టిగా అతికించండి.
6. ఫ్యాన్‌ను ఆన్ చేయండి
ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేస్తే, బకెట్‌లోని చల్లటి ఐస్ బాటిళ్లను తాకుతూ గాలి బయటకు వస్తుంది. దీంతో మామూలు ఫ్యాన్ గాలి కంటే చల్లటి గాలి మీ దగ్గరలో వస్తుంది.
ఇంట్లోనే తయారుచేసే ఎయిర్ కూలర్ వెనుక 'ఎవాపరేటివ్ కూలింగ్' (evaporative cooling), 'హీట్ ట్రాన్స్‌ఫర్' (heat transfer) అనే సింపుల్ ఫిజిక్స్ సూత్రాలు పనిచేస్తాయి. గాలి, నీళ్లు లేదా తేమగా ఉన్న చల్లటి ఉపరితలాన్ని దాటినప్పుడు, అది వేడిని గ్రహిస్తుంది. దీంతో బయటకు వచ్చే గాలి చల్లగా అనిపిస్తుంది. సాధారణంగా ఎవాపరేటివ్ కూలర్లు నీటి ఆవిరి ప్రక్రియను ఉపయోగించే చల్లదనాన్ని సృష్టిస్తాయి.
‘’'బకెట్‌లో ఐస్ పెడితే గది మొత్తం ఏసీలా చల్లగా అయిపోతుంది" అని అనుకోవద్దు. ఇది కేవలం ఫ్యాన్ దగ్గర కూర్చున్న వారికి చల్లటి గాలిని అందించే ఒక తక్కువ ఖర్చు ప్రయత్నం మాత్రమే.
రూ.500 ఖర్చు ఎలా అవుతుంది?
ఇంట్లో ఇప్పటికే ఫ్యాన్, వాటర్ బాటిళ్లు ఉంటే, అదనపు ఖర్చు చాలా తక్కువ. కొత్తగా చిన్న USB ఫ్యాన్ కొనాల్సి వస్తే, దాని ధరను బట్టి మొత్తం ఖర్చు మారుతుంది. బకెట్, టేప్ వంటివి ఇంట్లో ఉంటే రూ.500 లోపే ఈజీగా ప్రయత్నించవచ్చు.
ఇక్కడే చాలామంది ఒక విషయం గమనించాలి. 'ఎవాపరేటివ్ కూలింగ్' పద్ధతి గాలిలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తక్కువగా పనిచేస్తుంది. ఎందుకంటే గాలిలో ఇప్పటికే తేమ ఎక్కువగా ఉంటే, నీరు ఆవిరయ్యే సామర్థ్యం తగ్గుతుంది. అందుకే ఇలాంటి కూలర్లు పొడిగా, వేడిగా ఉండే వాతావరణంలో బాగా పనిచేస్తాయి. తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఎవాపరేటివ్ కూలర్ల పనితీరు తగ్గుతుందని స్థానిక యూజర్ల అనుభవాలు కూడా చెబుతున్నాయి.
మరి ఇది ఎక్కడ బాగా పనిచేస్తుంది?
మనం సొంతంగా తయారుచేసే కూలర్‌ను ఇల్లంతా చల్లబరచడానికి కాకుండా చిన్న ప్రాంతాన్ని చల్లబర్చేందుకు ఉపయోగించవచ్చు. అంటే మంచం దగ్గర, చదువుకునే టేబుల్ దగ్గర, వర్క్-ఫ్రమ్-హోమ్ డెస్క్ దగ్గర, చిన్న గదిలో పర్సనల్ కూలింగ్ కోసం,కరెంట్ బిల్లు తగ్గించుకోవాల్సిన సమయాల్లో వాడితే ప్రాక్టికల్‌గా ఉంటుంది.
ఇంట్లోనే ఎయిర్ కూలర్ తయారు చేసేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ఫ్యాన్, నీళ్లు దగ్గరగా ఉంటాయి కాబట్టి, నీళ్లు లీక్ అవ్వకుండా చూసుకోవాలి. ఫ్యాన్‌ను అమర్చేటప్పుడు లేదా ఐస్ బాటిళ్లను మార్చేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసి, ప్లగ్ తీసేయాలి. పాడైన బాటిళ్లను వాడొద్దు. ఫ్యాన్ రెక్కలకు ఐస్ బాటిల్ లేదా ఇతర వస్తువులు తగలకుండా చూసుకోవాలి.
ఇది ఏసీకి ప్రత్యామ్నాయమా?
కచ్చితంగా కాదు. ఏసీ అనేది గదిలోని వేడిని బయటకు పంపే 'రిఫ్రిజరేషన్ సైకిల్'ను వాడుతుంది. కానీ ఈ ఎయిర్ కూలర్ చల్లటి నీరు/ఐస్, గాలి ద్వారా కేవలం దగ్గరి ప్రాంతంలోనే చల్లదనాన్ని సృష్టిస్తుంది. అందువల్ల "రూ.500 ఖర్చుతో ఏసీకి సమానమైన చల్లదనం" అనేది సరైన అంచనా కాదు. ఇది ఏసీకి బదులుగా కాదు.. తక్కువ ఖర్చుతో పర్సనల్ కూలింగ్‌ను పెంచుకునే ఒక ప్రయత్నం మాత్రమే. పొడి వాతావరణంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది, కానీ తేమ ఉన్న ప్రాంతాల్లో పనితీరు తగ్గుతుంది.