ప్రతీ ఒక్కరూ ఎదుర్కునే అతి సాధారణ సమస్య జుట్టు ఊడిపోవడం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రాలే జుట్టును అరికట్టలేకపోతాం. జుట్టు రాలిపోవడానికి అనేక కారణాలుంటాయి.. తీసుకునే ఆహారంతో పాటు, జీవనశైలి, కాలుష్యం, నీళ్లు లాంటి అనేక రకాలు జుట్టు మీద ప్రభావితం చూపిస్తాయి.
వీటన్నింటిని దాటుకుని జుట్టు ఆరోగ్యంగా, అందంగా పొడవుగా పెరగాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటికంటే ముందు జుట్టును ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు అలవాటు చేసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం, జుట్టు ఆరోగ్యానికి సాధారణ రహస్యం రెగ్యులర్ ఆయిల్ మసాజ్. జుట్టును హైడ్రేట్ చేయడానికి, జుట్టు ఆకృతిని బలోపేతం చేయడానికి, ఒత్తుగా పెరగడానికి జుట్టుకు పోషణ అవసరం కాబట్టి, జుట్టు పెరుగుదలలో కొన్ని రకాల హెయిర్ ఆయిల్స్ ప్రభావవంతంగా పనిచేస్తాయి.
దీనికోసం మీ జుట్టు రకానికి సరిపోయే, ఆరోగ్యకరమైన పెరుగుదలకు తోడ్పడే హెయిర్ ఆయిల్ ల కోసం వెతకడం మామూలే. అయితే జుట్టును బలోపేతం చేయడానికి, జుట్టు పెరుగుదలను పెంచడంలో సహాయపడే ఆయిల్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు. అవేంటో చూడండి...
ఉసిరి + కొబ్బరి నూనె : ఉసిరి, కొబ్బరి నూనె ఎప్పుడూ పొడవాటి, అందమైన జుట్టుకు రహస్యాలుగా చెప్పబడతాయి. ఆమ్లాలో విట్ సి అధికంగా ఉంటుంది. దీనివల్ల జుట్టుకు ఎక్కువ కాలం పోషణనిస్తుంది. ఈ నూనె తయారు చేయడం కోసం రెండు ఉసిరికాయలను కోసి కనీసం ఒక గంట సేపు ఆరబెట్టాలి. ఇప్పుడు ఈ ఎండిన ముక్కలకు 5 టేబుల్ స్పూన్ల ఎక్స్ ట్రా విర్జిన్ కోకోనట్ ఆయిల్ కలిపాలి. ఈ మిశ్రమాన్ని స్టౌ మీద పెట్టి బుడగలు వచ్చేవరకు మరిగించాలి. తరువాత స్టౌ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక సీసాలో పోసి పెట్టుకోవాలి. ఈ సీసాను వారం పాటు ఎండలో ఉంచి ఆ తరువాత వాడితే మంచి ఫలితం ఉంటుంది.
కలబంద + కొబ్బరి నూనె : అలోవెరా హెయిర్ ఆయిల్.. హెయిర్ ఫాల్, చుండ్రు, డ్రై స్కాల్ప్ చికిత్సకు బాగా పనిచేస్తుంది. అలోవిరా జెల్ తీసేముందు.. అలోవిరా పెద్ద ఆకును తీసుకుని.. రెండు ముక్కలుగా కోసి..జెల్ ను సేకరించండి. ఇప్పుడు ఎంత అలోవిరా జెల్ ఉందో అంతే సమాన పరిమాణంలో కొబ్బరి నూనె కలపాలి. ఇప్పుడీ రెండింటిని ఒక గిన్నెలో వేసి వేసి, 5-6 నిమిషాల పాటు కొద్దిగా వేడి చేసి, చల్లబరచాలి. చల్లబడిన తర్వాత, ఒక సీసాలోకి తీసుకోవాలి. తరువాత ఈ నూనె సీసాను రెండు వారాల పాటు చీకటిగా ఉండే ప్రదేశంలో దాచిపెట్టి.. ఆ తరువాత వాడుకోవచ్చు.
వేప + బాదం హెయిర్ ఆయిల్ : వేపలో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చుండ్రు చికిత్సకు కూడా బాగా పనిచేస్తుంది. అంతేకాదు ఫాటీ యాసిడ్స్ కు స్టోర్‌హౌస్, ఇది శోథ నిరోధక స్వభావం కలిగి ఉంటుంది. దీన్నెలా తయారు చేయాలంటే.. కొన్ని వేప ఆకులను ఎండబెట్టి, 100ml బాదం నూనెతో పాటు మరిగించాలి. చల్లారక ఈ నూనెను ఒక గాజు సీసాలోకి తీసుకోవాలి. తరువాత ఒక వారంపాటు అలాగే ఉంచేసి.. ఆ తరువాత వాడుకోవచ్చు. అయితే వాడుకునే ముందు నూనెను వడకట్టుకోవాలనిపిస్తే.. వడకట్టొచ్చు.
ఉల్లిపాయ+ లావెండర్ హెయిర్ ఆయిల్ : ఈ నూనె అనేక జుట్టు సమస్యలకు చికిత్సగా పనిచేస్తుంది. జుట్టు రాలడానికి ఉల్లిపాయలు బాగా పనిచేస్తాయని చెబుతారు. ఇది లావెండర్ నూనెతో కలపడం వలన, ఈ నూనె ప్రభావం యాంటీ బాక్టీరియల్, ప్రక్షాళన లక్షణాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను సక్రియం చేయడానికి కూడా సహాయపడుతుంది. ఉల్లిపాయ రసాన్ని తీసి.. దీనికి సమానమైన కొబ్బరి నూనె కలపాలి. తరువాత వేసి, ఈ మిశ్రమాన్ని కొద్ది నిమిషాలు వేడి చేసి కంటైనర్‌లో పోయాలి. దీనికి కొన్ని చుక్కల లావెండర్ నూనెను కలపాలి. జార్ లోకి తీసుకున్న తరువాత కూడా లావెండర్ నూనె కలపొచ్చు.
కర్పూరం + ఆముదం + ఆలివ్ హెయిర్ ఆయిల్ : కర్పూరం చర్మం, జుట్టు సమస్యలకు చాలా బాగా పనిచేస్తుంది. జుట్టు పెరుగుదలకు కర్పూరం నూనె, ఆముదం నూనె, ఆలివ్ నూనెలను సమాన భాగాలుగా తీసుకుని కలుపుకోవాలి. ఈ నూనెతో జుట్టు కుదుళ్లు, జుట్టును మసాజ్ చేయాలి. అయితే, ఈ నూనెను వాడేముందు కాస్త వేడిచేస్తే మరింత ప్రభావంతంగా ఉంటుంది.