కళ్ల కింద నల్లటి వలయాలు ముఖ అందాన్ని తగ్గిస్తాయి. ఈ డార్క్ సర్కిల్స్ జన్యుపరంగా కూడా వస్తాయి. అలాగే చర్మంలో కొల్లాజెన్ తగ్గినప్పుడు కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సూర్యరశ్మి కొల్లాజెన్ ను విచ్ఛిన్నం చేయడం వల్ల చర్మం రంగు మారుతుంది. కాలానుగుణ అలెర్జీలు శరీరంలో హిస్టామిన్ల విడుదలను కూడా ప్రేరేపిస్తాయి. ఇది రక్త నాళాల వాపునకు కారణమవుతుంది. నల్లటి వలయాలు తగ్గిపోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
విటమిన్ సి
విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి ఆహారాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఇది రక్త ప్రసరణ, కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. దీంతో మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. జామ, స్ట్రాబెర్రీ, నారింజ, కాలీఫ్లవర్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
లైకోపీన్
లైకోపీన్ ఎన్నో పండ్లు, కూరగాయలలో కనిపించే అత్యంత శక్తివంతమైన రసాయనం. వీటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యం, మొత్తం రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుది. ఇది పిగ్మెంటేషన్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది మీ డార్క్ సర్కిల్స్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. టమోటాలు, పుచ్చకాయ, క్యాబేజీ, బొప్పాయిలో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది.
vitamin k
విటమిన్ కె
విటమిన్ కె కూడా డార్క్ సర్కిల్స్ ను దూరం చేస్తుంది. ఇది దెబ్బతిన్న చర్మాన్ని మరమ్మత్తు చేయడానికి, చర్మ గాయాలను నయం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రతిరోజూ విటమిన్ కె తినడం వల్ల మీ డార్క్ సర్కిల్స్ మాయమవుతాయి. టర్నిప్ ఆకుకూరలు, కాలీఫ్లవర్, దానిమ్మ, టమోటాల్లో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది.
ఇనుము
మీరు తినే ఆహారంలో సోయా బీన్స్, ఎర్ర మాంసం, చియా విత్తనాలు, ఎండిన నేరేడు పండ్లు, బచ్చలికూర వంటి ఆహారాల్లో ఇనుము ఎక్కువగా ఉంటుంది. శరీర కణజాలంలో ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. అలాగే కంటి కింద వలయాలను తగ్గిస్తుంది.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ లో ఫ్లేవనాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే దీనిలో ఉండే సెరోటోనిన్ నిద్ర లేమి, అలసటతో పోరాడటానికి సహాయపడుతుంది.