డ్రాగన్ ఫ్రూట్ మన ఆరోగ్యానికి మంచే కాదు చెడు కూడా చేస్తుంది.. జర జాగ్రత్త..

First Published Nov 15, 2022, 12:13 PM IST

పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే అరటి, ఆపిల్, దానిమ్మ, ద్రాక్ష వంటి పండ్లను రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. పండ్లలో డ్రాగన్ ఫ్రూట్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.. అయితే ఈ పండు వల్ల లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి. 

Dragon Fruit

డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలియని వారుండరు. ఈ పండు పైన గులాబి రంగు.. లోపల తెల్ల రంగు ఉంటుంది. దీని విత్తనాలు నల్లరంగులో ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ ను పిటయా అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం హిలోసెరాస్ అన్డస్. ఇది తామర పువ్వును పోలి ఉంటుంది. అందుకే దీనిని సంస్కృతంలో 'కమలం' అని పిలుస్తారు. డ్రాగన్ ఫ్రూట్ లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి తెల్లని గుజ్జును కలిగుంటుంది. మరొకదానిలో ఎర్రని గుజ్జు ఉంటుంది. ఈ పండు టేస్టీగా ఉండటమే కాదు.. మన ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ సి, ప్రోటీన్, ఫైబర్, పాలీఅన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అసలు డ్రాగన్ ఫ్రూట్ వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

డ్రాగన్ ఫ్రూట్ ప్రయోజనాలు

గుండె ఆరోగ్యానికి..

డ్రాగన్ ఫ్రూట్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఈ పండులో ఉండే మెగ్నీషియం స్ట్రోక్, గుండెపోటు వంటి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
 

dragon fruit

తక్కువ కొలెస్ట్రాల్

డ్రాగన్ ఫ్రూట్ శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే.. గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. డ్రాగన్ ఫ్రూట్ లో పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటుగా.. మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి కూడా సహాయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల కడుపునకు సంబంధించిన వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. డ్రాగన్ ఫ్రూట్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది.
 

Dragon Fruit

ఉదర సంబంధిత రుగ్మతలను తగ్గిస్తుంది

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల కడుపునకు సంబంధించిన రుగ్మతలు తగ్గిపోతాయి. డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే ఫైబర్ కడుపునకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది. ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది.  ఈ పండులో వాటర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మీ ప్రేగు కదలికకు సహాయపడుతుంది. అలాగే ఇది మలబద్ధకం, కడుపు నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు పెద్దప్రేగు, శోథ, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ వంటి వ్యాధులను తగ్గించడానికి సహాయపడుతుంది. 

Dragon Fruit

రక్తహీనతను పోగొడుతుంది

రక్తహీనత సమస్యతో బాధపడేవారికి డ్రాగన్ ఫ్రూట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రక్తహీనత వల్ల అలసట, బలహీనత వంటి సమస్యలు వస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. 
 

Dragon Fruit

బలమైన దంతాలు, ఎముకల కోసం

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఎముకలు, దంతాలు బలపడతాయి. దీనిలో కాల్షియం, భాస్వరం పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను, దంతాలను బలోపేతం చేయడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల కీళ్లు, దంతాల్లో నొప్పి సమస్యలు తగ్గుతాయి. 
 

Dragon Fruit

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

డ్రాగన్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మన రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటే.. మనకు వ్యాధులు లేని పోని రోగాలొచ్చే అవకాశం ఉంది. అందుకే రోగ నిరోధక శక్తిని పెంచడానికి డ్రాగన్ ఫ్రూట్స్ ను తినండి. ఈ పండులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
 

dragon fruits

డ్రాగన్ ఫ్రూట్ దుష్ప్రభావాలు 

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయినప్పటికీ.. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నోఅనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 
 

Dragon Fruit

బరువు పెరగొచ్చు

డ్రాగన్ ఫ్రూట్ లో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ.. దీనిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ ను అధికంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉండదు. మీరు బరువు తగ్గాలనుకుంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ ను ఎక్కువగా తినకండి. 
 

విరేచనాలు సమస్య

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. దీనిలో ఉండే పదార్థాలు మలాన్ని మృదువుగా మారుస్తాయి. ఇది ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది. అయినప్పటికీ.. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా సమస్యలు వస్తాయి. కాబట్టి దీనిని ఎక్కువగా తినకండి. 
 

click me!