
బేబీ క్రీములు, లోషన్లు, షాంపూలు సున్నితమైన చర్మాన్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తారు. అందుకే చర్మం త్వరగా ఎర్రబడటం, పొడిబారడం, దురద వంటి సమస్యలు ఉన్నవారికి ఇవి సురక్షితంగా అనిపిస్తాయి. కొన్నింటిలో కెమికల్స్ లేకపోవడం వల్ల పెద్దవాళ్లకి నచ్చుతాయి. అంతేకాదు.. ఏవేవో ప్రొడక్ట్స్ వాడటం కంటే ఒక బేబీ లోషన్‌తో సరిపెట్టుకోవచ్చని అనుకుంటారు. కానీ ఇక్కడే ఒక విషయం గుర్తుంచుకోవాలి. పిల్లల చర్మం, పెద్దల చర్మం ఒకేలా ఉండవు. అందువల్ల వాటి అవసరాలు కూడా వేర్వేరుగా ఉంటాయి.
చిన్నపిల్లల చర్మం మరింత పల్చగా, సున్నితంగా ఉంటుంది. తేమను త్వరగా కోల్పోయే అవకాశం ఉంటుంది. పెద్దల చర్మం మందంగా ఉంటుంది. అయితే కాలుష్యం, సూర్యరశ్మి, జీవనశైలి వంటి కారణాలతో పొడిబారడం, మొటిమలు, నల్లటి మచ్చలు, వయసుతో వచ్చే మార్పులు కనిపిస్తాయి. పెద్ద వాళ్లలో ఆయిల్ స్కిన్ ఉండేవాళ్లు ఉంటారు. అంతేకాదు చర్మ సమస్యలకు అనుగుణంగా ప్రత్యేక ఉత్పత్తులు అవసరమవుతాయి.
బేబీ ప్రొడక్ట్స్ వాడకూడదని పూర్తిగా చెప్పలేం. కొన్ని బేబీ క్లెన్సర్లు, మాయిశ్చరైజర్లు, బేబీ ఆయిల్స్ పెద్దల చర్మానికి కూడా సరిపోవచ్చు. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారికి కెమికల్స్ లేనివి ఉపశమనం ఇవ్వొచ్చు. అయితే మొటిమలను నియంత్రించడం, వయసుతో వచ్చే ముడతలను తగ్గించడం, నల్లటి మచ్చలపై పనిచేయడం, సూర్యరశ్మి నుంచి కాపాడటం వంటి అవసరాలకు అన్ని బేబీ ఉత్పత్తులూ సరిపోవు. ప్రొడక్ట్స్ లో ఏమేం ఉన్నాయో చెక్ చేయాలి.
డైపర్ రాష్ క్రీముల్లో సాధారణంగా జింక్ ఆక్సైడ్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి చర్మంపై రక్షణ పొరను ఏర్పరచి తేమ నుంచి రక్షించడంలో, చికాకు తగ్గించడంలో సహాయపడతాయి. కానీ ఇలాంటి క్రీములు చిక్కగా ఉండటం వల్ల ముఖంపై తరచూ వాడితే కొందరిలో చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే డైపర్ రాష్ క్రీమ్‌ను సాధారణ ఫేస్ మాయిశ్చరైజర్ లా వాడటం సరి కాదు. చర్మం పొడిబారే సమస్య ఉంటే దానికి అనుగుణంగా మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవడం మంచిది.
జుట్టు జిడ్డుగా ఉన్నప్పుడు బేబీ పౌడర్‌ను ఉపయోగిస్తే నూనెను పీల్చుకోవచ్చు. దీంతో జుట్టు అప్పటికి ఫ్రెష్ గా అనిపించవచ్చు. కానీ దీన్ని తరచూ వాడటం వల్ల తలపై పౌడర్ పేరుకుపోయి చికాకు కూడా కలగవచ్చు. ఆ పౌడర్ ముక్కులోకి వెళ్లకుండా చూసుకోవాలి. అందుకే హెయిర్ కేర్ కోసం బేబీ పౌడర్‌పై ఆధారపడటం కంటే అవసరానికి అనుగుణంగా షాంపూ ఉపయోగించడం మంచిది. బేబీ షాంపూలు మేకప్, సన్‌స్క్రీన్ లోషన్ తీయడానికి సరిపోకపోవచ్చు. అలాగే పిల్లల శరీరానికి ఉపయోగించే సన్‌స్క్రీన్‌ను ముఖానికి వాడినప్పుడు కొందరికి జిడ్డుగా అనిపించవచ్చు లేదా తెల్లటి పొర కనిపించవచ్చు. ముఖానికి ప్రత్యేకంగా రూపొందించిన సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవడం సౌకర్యంగా ఉంటుంది. బేబీ ఆయిల్ విషయానికి వస్తే.. ఇది చర్మంలో తేమను పెంచడం కంటే ఇప్పటికే ఉన్న తేమ బయటకు పోకుండా అడ్డుకోవడంలో ఎక్కువగా సహాయపడుతుంది. అయితే జిడ్డు చర్మం లేదా మొటిమలు ఉన్నవారికి ఇది సరిపోదు. కాబట్టి చర్మ స్వభావాన్ని బట్టి ఉత్పత్తిని ఎంచుకోవాలి.
మీ చర్మ స్వభావానికి సరిపోతుందో లేదో తెలుసుకోండి. హైపోఅలెర్జెనిక్ అని ఉన్నంత మాత్రాన పూర్తిగా సురక్షితమని భావించకండి. మొటిమలు వచ్చే చర్మంపై చిక్కటి క్రీములను ముఖమంతా తరచుగా రాయకండి. బేబీ పౌడర్‌ను శ్వాస ద్వారా లోపలికి పీల్చకుండా జాగ్రత్తపడండి. ముఖానికి తగిన సన్‌స్క్రీన్, క్లెన్సర్, మాయిశ్చరైజర్ వంటి ఉత్పత్తులను మీ అవసరాలకు అనుగుణంగా ఎంచుకోండి. ఏదైనా ఉత్పత్తి వాడిన తర్వాత ఎర్రదనం, దురద లేదా మొటిమలు పెరిగితే దాని వినియోగాన్ని ఆపేసి డాక్టర్ ను కలవండి.
బేబీ ప్రొడక్ట్స్ పెద్దలు వాడకూడదని కాదు. కానీ పిల్లల చర్మాన్ని దృష్టిలో పెట్టుకుని తయారుచేసిన ఉత్పత్తులు పెద్దల అన్ని చర్మ సమస్యలకూ పరిష్కారం కావు. తాత్కాలికంగా చర్మాన్ని మృదువుగా ఉంచడం వేరు.. మొటిమలు, మచ్చలు, ముడతలు, సూర్యరశ్మి ప్రభావం వంటి సమస్యలను లక్ష్యంగా చేసుకుని సంరక్షణ అందించడం వేరు.