కొందరి కాళ్లపై నీలి రక్తనాళాలు బయటికి స్పష్టంగా కనిపిస్తాయి. కానీ చాలా మంది వాటిని నిర్లక్ష్యం చేస్తారు. అలా వదిలేస్తే అది వెరికోస్ వెయిన్స్ అనే సమస్యకు దారి తీస్తుంది. అందుకే కాళ్లలో కొన్ని లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకూడదు.
చాలామంది కాళ్లపై నీలం లేదా ముదురు ఊదా రంగులో రక్తనాళాలు కనిపిస్తూ ఉంటాయి. అవి సిరలు. కానీ వాటిని పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ ఇలా కనిపించడం సహజమే అనుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇవి వెరికోస్ వెయిన్స్ అనే సమస్యకు సంకేతంగా భావించాలి. ఈ సమస్యలో కాళ్లలోని సిరలు ఉబ్బి, మెలికలు తిరిగి బయటకు కనిపిస్తాయి. సిరల్లో రక్తం గుండె వైపు వెళ్లేందుకు ఉండే చిన్న కవాటాలు సరిగా పనిచేయకపోతే రక్తం కాళ్లలోనే చేరి సిరలు ఉబ్బుతాయి. ఎక్కువసేపు నిలబడటం, ఎక్కువసేపు కూర్చోవడం, అధిక బరువు, వయసు పెరగడం, గర్భధారణ, కుటుంబంలో ఈ సమస్య ఉండటం వంటివి వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాన్ని పెంచవచ్చు.
23
ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
వెరికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు కాళ్లలో నొప్పి, బరువుగా అనిపించడం, మంట, దురద వంటి సమస్యలు రావచ్చు. రోజంతా నిలబడి ఉన్న తర్వాత లేదా ఎక్కువసేపు కూర్చున్న తర్వాత ఇబ్బంది మరింత పెరగొచ్చు. కొందరిలో మడమల దగ్గర లేదా కాళ్ల కింది భాగంలో వాపు కనిపిస్తుంది. సమస్య ఎక్కువైతే చర్మం రంగు మారడం, చర్మం గట్టిపడటం, గాయాలు ఏర్పడటం వంటి సమస్యలు కూడా రావచ్చు. అయితే కాళ్లపై నీలి సిరలు కనిపించిన ప్రతి ఒక్కరికీ ప్రమాదకరమైన వ్యాధి ఉందని అర్థం కాదు. కొన్నిసార్లు అవి సాధారణంగా కనిపించే సిరలు లేదా చిన్న స్పైడర్ వెయిన్స్ కూడా కావచ్చు. కానీ సిరలు అకస్మాత్తుగా ఉబ్బడం, నొప్పి, ఎర్రగా మారడం, వేడిగా అనిపించడం, ఒక కాలులో ఒక్కసారిగా వాపు రావడం వంటి లక్షణాలు ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించడం మంచిది.
33
ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి
కాళ్లలో రక్తప్రసరణ మెరుగ్గా ఉండేందుకు రోజూ నడక, తేలికపాటి వ్యాయామం చేయాలి. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం లేదా నిలబడటం తగ్గించాలి. అవకాశం ఉన్నప్పుడు కాళ్లను కొద్దిసేపు పైకి పెట్టుకుని విశ్రాంతి తీసుకోవచ్చు. అవసరమైతే వైద్యుల సలహాతో కంప్రెషన్ స్టాకింగ్స్ ఉపయోగించవచ్చు. ఇవి కాళ్లలో రక్తం సరిగా ప్రవహించేందుకు సహాయపడతాయి. వెరికోస్ వెయిన్స్ తీవ్రంగా ఉంటే వైద్యులు పరిస్థితిని బట్టి ఇతర చికిత్సలను సూచించవచ్చు. కాబట్టి కాళ్లపై కనిపించే నీలి సిరలను చూసి వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో వాటితో పాటు నొప్పి, వాపు, చర్మంలో మార్పులు వంటి లక్షణాలు ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.